హోషేయ 10
10
1ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు;
అతడు బాగా ఫలించాడు.
అతడు ఫలించినకొద్దీ,
అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు.
అతని భూమి సారవంతమైన కొద్ది,
అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.
2వారి హృదయం కపటమైనది,
ఇప్పుడు వారు తమ అపరాధానికి శిక్షను భరించాలి.
యెహోవా వారి బలిపీఠాలను పడగొట్టి,
వారి పవిత్ర రాళ్లను నాశనం చేస్తారు.
3అప్పుడు వారు, “మనకు రాజు లేడు
ఎందుకంటే మనం యెహోవాకు భయపడలేదు.
ఒకవేళ మనకు రాజు ఉన్నా కూడా,
అతడు మనకు ఏమి చేయగలడు?” అంటారు.
4వారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు,
అబద్ధ ప్రమాణాలు చేస్తారు
ఒప్పందాలు చేసుకుంటారు;
కాబట్టి వాదనలు దున్నబడిన పొలంలో
విషపు మొక్కల్లా మొలుస్తాయి.
5సమరయలో నివసించే ప్రజలు,
బేత్-ఆవెనులో#10:5 బేత్-ఆవెనులో అంటే దుష్టత్వం గల ఇల్లు ఉన్న దూడ విగ్రహం గురించి భయపడతారు.
దాని ఘనత పోయిందని
దాని ప్రజలు దుఃఖపడతారు,
దాని వైభవం గురించి ఆనందించిన
దాని యాజకులు ఏడుస్తారు.
6అది అష్షూరుకు కొనిపోబడి,
మహారాజుకు కానుకగా ఇవ్వబడుతుంది.
ఎఫ్రాయిం అవమానించబడుతుంది;
ఇశ్రాయేలు తాను చేసిన తప్పుడు ఆలోచనలను బట్టి సిగ్గుపడుతుంది.
7సమరయ రాజు నాశనమవుతాడు,
అతడు నీటిలో విరిగిపోయిన రెమ్మలా కొట్టుకు పోతాడు.
8ఇశ్రాయేలు పాపానికి ప్రతిరూపాలైన
దుష్టత్వం#10:8 హెబ్రీలో ఆవెను బేత్-ఆవెన్ ను సూచిస్తుంది; 5 వచనం చూడండి కలిగిన క్షేత్రాలు నాశనం చేయబడతాయి.
ముండ్ల చెట్లు, గచ్చపొదలు పెరిగి
వారి బలిపీఠాలను కప్పుతాయి.
అప్పుడు వారు పర్వతాలతో, “మమ్మల్ని కప్పండి!” అని
కొండలతో, “మామీద పడండి!” అని అంటారు.
9“ఇశ్రాయేలూ, గిబియా కాలం నుండి నీవు పాపం చేస్తూ ఉన్నావు.
నీవు అదే స్థితిలో ఉండిపోయావు.
గిబియాలోని దుర్మార్గుల మీదికి
మరలా యుద్ధం రాలేదా?
10నాకు ఇష్టమైనప్పుడు, నేను వారిని శిక్షిస్తాను;
వారి రెండంతల పాపం కోసం వారిని బంధకాలలో పెట్టడానికి
దేశాలు వారికి విరుద్ధంగా కూడుకుంటాయి.
11ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది,
నూర్పిడి అంటే దానికి ఇష్టం;
కాబట్టి దాని నున్నటి మెడ మీద
నేను కాడి పెడతాను,
నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను,
యూదా భూమిని దున్నాలి,
యాకోబు భూమిని చదును చేయాలి.
12మీ కోసం నీతిని విత్తండి,
మారని ప్రేమ అనే పంట కోయండి.
దున్నబడని భూమిని చదును చేయండి;
ఎందుకంటే, యెహోవా మీ దగ్గరకు వచ్చి,
నీతి వర్షం మీపై కురిపించే వరకు,
యెహోవాను వెదికే సమయం ఇదే.
13కాని మీరు దున్ని దుష్టత్వాన్ని నాటారు,
మీరు చెడును కోశారు,
మీరు వంచన ఫలాలు తిన్నారు.
మీరు మీ సొంత బలాన్ని,
మీకున్న అనేకమంది యోధులను నమ్ముకున్నారు.
14కాబట్టి మీ ప్రజల్లో అల్లకల్లోలం ఏర్పడుతుంది,
షల్మాను యుద్ధంలో బేత్-అర్బేలును పాడుచేసినట్లు,
మీ కోటలన్నీ నాశనమవుతాయి,
ఆ రోజు తల్లులు తమ పిల్లలతో పాటు నేలకు కొట్టబడతారు.
15బేతేలు, నీకు ఇలా జరుగుతుంది,
ఎందుకంటే, నీ దుష్టత్వం ఘోరంగా ఉంది.
ఆ రోజు ఉదయించినప్పుడు,
ఇశ్రాయేలు రాజు సంపూర్ణంగా నాశనమవుతాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హోషేయ 10: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.