హెబ్రీ పత్రిక 12:1-17

హెబ్రీ పత్రిక 12:1-17 OTSA

కాబట్టి, ఇంత గొప్ప సాక్షిసమూహం మన చుట్టూ ఆవరించి ఉంది కాబట్టి, మనకు ఆటంకం కలిగించే సమస్తాన్ని, సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెడదాము. విశ్వాసానికి కర్తయైన దాన్ని పరిపూర్ణం చేసేవాడైన యేసువైపు చూస్తూ, మన ముందు ఉన్న పరుగు పందెంలో ఓపికతో పరుగెడదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం సిలువను భరించి దానివల్ల కలిగే అవమానాలను లక్ష్యపెట్టక, ఇప్పుడు దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చుని ఉన్నారు. పాపుల నుండి అలాంటి వ్యతిరేకతను భరించిన వ్యక్తిని గురించి ఆలోచించండి, తద్వారా మీరు అలసట చెందరు, మీ హృదయాలు క్రుంగిపోవు. మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు. తండ్రి తన కుమారునితో మాట్లాడినట్లుగా ఆయన మీతో ప్రోత్సాహకరంగా మాట్లాడిన మాటలను పూర్తిగా మరచిపోయారా? అవి ఇలా చెప్తున్నాయి, “నా కుమారుడా, ప్రభువు క్రమశిక్షణను చులకనగా చూడకు, ఆయన నిన్ను గద్దించినపుడు నీవు నిరాశ చెందకు, ఎందుకంటే, ప్రభువు తాను ప్రేమించేవారిని క్రమశిక్షణలో ఉంచుతారు, తన కుమారునిగా అంగీకరించిన ప్రతివారికి ఆయన శిక్షణనిస్తారు.” మీరు పొందే బాధలన్నిటిని క్రమశిక్షణగా సహించండి; ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా భావిస్తున్నాడు. తమ తండ్రిచేత క్రమశిక్షణ పొందని కుమారుడెవడు? అందరు క్రమశిక్షణ పొందినట్లు మీరు క్రమశిక్షణ పొందకపోతే చట్టబద్ధమైన సంతానం అవ్వరు మీరు నిజమైన కుమారులు కుమార్తెలు కారు. మనల్ని క్రమశిక్షణలో పెంచిన మానవ తండ్రులను మనమందరం కలిగి ఉన్నాం, ఈ విషయంలో వారిని గౌరవిస్తాము. అలాగే ఆత్మలకు తండ్రియైన దేవునికి మనం ఇంకా ఎంత అధికంగా లోబడి జీవించాలి! తాము మంచిదని తలంచిన విధంగా మన తండ్రులు కొంతకాలం మనల్ని క్రమశిక్షణలో పెంచారు కాని దేవుడు తన పరిశుద్ధతలో మనం పాలుపంచుకోవడానికి మన మేలు కొరకే ఆ క్రమశిక్షణలో ఉంచాడు. ఆ సమయంలో ఏ క్రమశిక్షణా ఆనందంగా అనిపించదు కాని బాధగా అనిపిస్తుంది. కాని దాని ద్వారా శిక్షణ పొందినవారు నీతి సమాధానం అనే పంట కోస్తారు. కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి. కుంటివారు పడిపోకుండా వారు స్వస్థత పొందేలా, “మీ పాదాల కోసం సమమైన మార్గాలను తయారుచేయండి.” అందరితో సమాధానం కలిగి జీవించడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయండి; పరిశుద్ధత లేకుండ ఎవరు ప్రభువును చూడలేరు. దేవుని కృపను పొందడంలో ఎవరు తప్పిపోకుండా, చేదైన వేరు మొలిచి మిమ్మల్ని కలవరపరచి అనేకమందిని అపవిత్రులుగా చేయకుండా జాగ్రత్తపడండి. లైంగిక అనైతికతను సాగించేవారు గాని ఒక్కపూట తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావులాంటి దైవభక్తిలేని వారు గాని మీలో లేకుండ జాగ్రత్తపడండి. ఆ తర్వాత ఏశావు ఆ ఆశీర్వాదాన్ని పొందాలని అనుకున్నప్పుడు అతడు పొందలేక పోయాడని మీకు తెలుసు. ఎందుకంటే అతడు పశ్చాత్తాపపడేప్పటికి చాలా ఆలస్యమైంది. అతడు కన్నీటితో వెదకినా, తాను చేసిన దాన్ని మార్చలేకపోయాడు.