హెబ్రీ పత్రిక 1
1
దేవుని తుది వాక్కు: ఆయన కుమారుడు
1గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు. 2కాని ఈ చివరి దినాల్లో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు, ఆయన తన కుమారున్ని సమస్తానికి వారసునిగా నియమించారు, ఆయన ద్వారానే ఈ జగత్తును కూడా సృష్టించారు. 3ఆ కుమారుడు తన శక్తిగల మాటచేత సమస్తాన్ని సంరక్షిస్తూ, దేవుని మహిమ యొక్క ప్రకాశంగా, ఆయన ఉనికికి ఖచ్చితమైన ప్రాతినిధ్యంగా ఉన్నారు. పాపాలకు ఆయన శుద్ధీకరణను సిద్ధపరచిన తర్వాత, ఆయన పరలోకంలో మహోన్నతుని కుడి వైపున కూర్చున్నారు. 4కాబట్టి ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన నామాన్ని వారసత్వంగా పొందినట్లే ఆయన దేవదూతల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు.
కుమారుడు దేవదూతల కంటే ఉన్నతుడు
5దేవదూతల్లో ఎవరితోనైనా ఎన్నడైన దేవుడు,
“నీవు నా కుమారుడవు;
ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను”#1:5 కీర్తన 2:7
అని గాని,
“నేను అతనికి తండ్రిగా ఉంటాను,
అతడు నాకు కుమారునిగా ఉంటాడు,”#1:5 2 సమూ 7:14; 1 దిన 17:13 అని గాని అన్నారా?
6దేవుడు తన మొదటి సంతానాన్ని భూలోకానికి తెచ్చినప్పుడు, ఆయన,
“దేవదూతలందరు ఆయనను ఆరాధించాలి,”#1:6 ద్వితీ 32:43 అని చెప్పారు.
7దేవదూతల గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు,
“ఆయన తన దూతలను ఆత్మలుగా,
తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తారు,”#1:7 కీర్తన 104:4
అని అన్నారు.
8కాని తన కుమారుని గురించి ఆయన,
“ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది;
మీ న్యాయ దండం మీ రాజ్య రాజదండం.
9మీరు నీతిని ప్రేమించి దుష్టత్వాన్ని ద్వేషించారు;
కాబట్టి దేవుడు, మీ దేవుడు, ఆనంద తైలంతో మిమ్మల్ని అభిషేకించి,
మీ తోటివారి కన్నా మిమ్మల్ని ఉన్నతస్థితికి హెచ్చించారు,”#1:9 కీర్తన 45:6,7 అని అన్నారు.
10ఇంకా ఆయన,
“ప్రభువా, ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు,
ఆకాశాలు మీ చేతి పని.
11అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు;
ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి.
12వాటిని మీరు అంగీలా చుట్టి పెడతారు;
వస్త్రంలా అవన్నీ మార్చబడతాయి.
కానీ మీరు అలాగే ఉంటారు,
మీ సంవత్సరాలకు అంతం ఉండదు,”#1:12 కీర్తన 102:25-27 అని అన్నారు.
13దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా,
“నేను నీ శత్రువులను
నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు
నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”#1:13 కీర్తన 110:1?
14దేవదూతలందరు రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి పరిచర్య చేయడానికి పంపబడిన ఆత్మలు కారా?
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హెబ్రీ పత్రిక 1: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.