యెహెజ్కేలు 3

3
1ఆయన నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, నీకు కనిపించిన దానిని తిని, ఈ గ్రంథపుచుట్టను తిను; తర్వాత ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారికి ప్రకటించు.” 2నేను నోరు తెరవగా ఆయన నాకు ఆ గ్రంథపుచుట్టను తినిపించారు.
3అప్పుడు ఆయన, “మనుష్యకుమారుడా, నేనిచ్చే ఈ గ్రంథపుచుట్టను తిని నీ కడుపు నింపుకో” అన్నారు. ఆయన చెప్పినట్లే ఆ గ్రంథాన్ని తిన్నాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది.
4ఆయన ఇంకా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి నా మాటలు వారికి తెలియజేయి. 5నీవు అర్థం చేసుకోలేని మాటలు మాట్లాడేవారి దగ్గరకు తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరకు కాదు ఇశ్రాయేలీయుల దగ్గరికే నిన్ను పంపుతున్నాను. 6నీకు అర్థం చేసుకోలేని మాటలు తెలియని భాష మాట్లాడే ఇతర ప్రజల దగ్గరకు పంపలేదు. వారి మధ్యకు నిన్ను పంపితే నీవు చెప్పేది వారు వింటారు. 7కాని ఇశ్రాయేలీయులు మొండివారు కఠిన హృదయులు. నా మాటలు వినడానికి ఇష్టపడరు కాబట్టి నీ మాటలు కూడా వినరు. 8వారి ముఖంలాగానే నీ ముఖం కఠినంగా పోతుంది. వారి నుదురులా నీ నుదిటిని కఠినంగా చేస్తాను. 9నేను నీ నుదుటిని వజ్రం కంటే గట్టి రాయిలా చేస్తాను. వారు తిరుగుబాటుదారులు అయినప్పటికీ వారికి బెదరకు వారిని చూసి భయపడకు.”
10ఆయన నాతో, “మనుష్యకుమారుడా, నేను మాట్లాడే మాటలు జాగ్రత్తగా విని మనస్సులో ఉంచుకో. 11బందీలుగా ఉన్న నీ ప్రజలు దగ్గరకు వెళ్లి వారు విన్నా వినకపోయినా, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే’ అని ప్రకటించు” అన్నారు.
12ఆత్మ నన్ను పైకెత్తగా నా వెనుక ఆయన ఉన్న స్థలం నుండి యెహోవా మహిమకు స్తోత్రం కలుగుతుంది అనే గొప్ప గర్జన లాంటి శబ్దం వినిపించింది. 13అది జీవుల రెక్కలు ఒకదానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దము. వాటి ప్రక్కన ఉన్న చక్రాల శబ్దం గొప్ప గర్జన వంటి శబ్దంలా ఉంది. 14అప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్లాడు. నేనలాగే కొట్టుకొని పోయాను. నా మనస్సులో పుట్టిన కోపానికి ఎంతో కలత చెందినప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చింది. 15కెబారు నది దగ్గర ఉన్న తేలాబీబు అనే స్థలంలో బందీలుగా ఉన్న వారి దగ్గరకు వచ్చాను. వారు కూర్చున్న చోటే దిగులుగా ఏడు రోజులు కూర్చుండిపోయాను.
కావలివానిగా యెహెజ్కేలు
16ఏడు రోజులు గడిచిన తర్వాత యెహోవా వాక్కు నా దగ్గరికి వచ్చి: 17“మనుష్యకుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించాను; కాబట్టి నేను చెప్పే మాట విని నా తరపున వారిని హెచ్చరించు. 18నేను దుర్మార్గునితో, ‘నీవు తప్పక చస్తావు’ అని చెప్పినప్పుడు, నీవు వాన్ని హెచ్చరించకపోయినా, లేదా వాని ప్రాణం కాపాడబడేలా చెడు మార్గాలను విడిచిపెట్టమని వాన్ని హెచ్చరించకపోయినా, ఆ దుర్మార్గుడు వాని పాపాలను బట్టి చనిపోతే, వాని చావుకు నిన్ను జవాబుదారీని చేస్తాను. 19అయితే ఒకవేళ నీవు ఆ దుర్మార్గులను హెచ్చరించినా వారు తమ దుర్మార్గాన్ని, దుష్ట మార్గాలను వదలకపోతే, వారు తమ పాపాలను బట్టి చస్తారు; కాని నీవు తప్పించుకుంటావు.
20“నీతిమంతుడు తన నీతి నుండి తొలగిపోయి చెడు చేస్తే నేను అతని ముందు అభ్యంతరం పెడతాను అప్పుడతడు చస్తాడు. అయితే నీవు అతన్ని హెచ్చరించలేదు కాబట్టి అతడు తన పాపాన్ని బట్టి చస్తాడు. అతడు చేసిన నీతిక్రియలను నేను జ్ఞాపకం చేసుకోను, కాని అతని రక్తానికి నిన్నే జవాబుదారీని చేస్తాను. 21ఒకవేళ పాపం చేయకూడదని నీవు నీతిమంతుని హెచ్చరించినప్పుడు అతడు పాపం చేయకపోతే అతడు ఖచ్చితంగా బ్రతుకుతాడు, ఎందుకంటే అతడు ఆ హెచ్చిరికకు లోబడ్డాడు. అలాగే నిన్ను నీవు కాపాడుకుంటావు.”
22అప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చి, ఆయన నాతో, “నీవు లేచి, సమతల మైదాన ప్రాంతానికి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని అన్నారు. 23కాబట్టి నేను లేచి సమతల మైదానానికి వెళ్లాను. కెబారు నది దగ్గర నేను చూసిన యెహోవా మహిమ అక్కడ నిలబడి ఉంది. నేను ముఖం నేలకు ఆనించి మోకాళ్లమీద ఉన్నాను.
24అప్పుడు ఆత్మ నా లోనికి వచ్చి నా కాళ్లమీద నన్ను నిలబెట్టాడు. తర్వాత యెహోవా నాతో ఇలా చెప్పారు: “నీ ఇంటి లోపలికి వెళ్లి, తలుపులు మూసివేసుకో. 25మనుష్యకుమారుడా, వారు నిన్ను త్రాళ్లతో కట్టి బంధించబోతున్నారు కాబట్టి నీవు వారి మధ్యకు వెళ్లవద్దు. 26వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి నీవు వారిని గద్దించకుండా మౌనంగా ఉండేలా నీ నాలుక నీ అంగిటికి అంటుకుపోయేలా చేస్తాను. 27కాని నేను నీతో మాట్లాడినప్పుడు నీవు వారితో, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు’ చెప్పడానికి నేను నీ నోరు తెరుస్తాను. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వినేవారు వింటారు విననివారు వినరు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహెజ్కేలు 3: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

యెహెజ్కేలు 3 కోసం వీడియో