యెహెజ్కేలు 20
20
తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు ప్రక్షాళన
1ఏడవ సంవత్సరం అయిదవ నెల పదవ రోజున ఇశ్రాయేలు పెద్దలలో కొందరు యెహోవాను సంప్రదించడానికి నా దగ్గరకు వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
2యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 3“మనుష్యకుమారుడా, నీవు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నన్ను సంప్రదించడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నేను మీకే ఆలోచన చెప్పను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’
4“వారికి న్యాయం తీరుస్తావా? మనుష్యకుమారుడా, వారికి న్యాయం తీరుస్తావా? వారి పూర్వికులు చేసిన అసహ్యమైన ఆచారాలు వారికి తెలియజేసి, 5వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న రోజున, నేను యాకోబు వారసులకు ప్రమాణం చేసిన రోజున ఈజిప్టులో వారికి నన్ను ప్రత్యక్షపరచుకుని ప్రమాణం చేసి, “మీ దేవుడనైన యెహోవాను నేనే” అని వారికి ప్రకటించాను. 6వారిని ఈజిప్టు దేశంలో నుండి బయటకు తీసుకువచ్చి నేను వారికి ఏర్పాటుచేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అన్ని దేశాల్లో సుందరమైన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను. 7అప్పుడు నేను, “నేనే మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన అసహ్యమైన పనులను విడిచిపెట్టాలి. ఈజిప్టువారి విగ్రహాలను పూజించి అపవిత్రులు కావద్దని వారికి ఆజ్ఞాపించాను.”
8“ ‘అయితే వారు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేశారు; తమకిష్టమైన అసహ్యమైన పనులు చేయడం మానలేదు, ఈజిప్టువారి విగ్రహాలను పూజించడం మానలేదు. కాబట్టి వారు ఈజిప్టు దేశంలో ఉండగానే నేను నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకున్నాను. 9అయితే నా నామం కోసం వారిని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. వారు నివసించిన జనాంగాల దృష్టిలో, ఎవరి ఎదుట నన్ను నేను ఇశ్రాయేలీయులకు బయలుపరచుకున్నానో వారి ఎదుట నా పేరు అపవిత్రం కాకూడదని అలా చేశాను. 10వారిని ఈజిప్టు దేశం నుండి బయటకు రప్పించి అరణ్యంలోకి తీసుకువచ్చి, 11వారికి నా శాసనాలను ఇచ్చి, నా ధర్మశాస్త్రాన్ని వారికి తెలియజేశాను. వాటిని అనుసరించిన మనుష్యులే బ్రతుకుతారు. 12యెహోవానైన నేనే వారిని పవిత్రపరచానని వారు తెలుసుకునేలా, నాకు వారికి మధ్య సూచనగా సబ్బాతులను నియమించాను.
13“ ‘అరణ్యంలో ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి, నా శాసనాలను తృణీకరించి, వాటికి లోబడేవారు బ్రతుకుతారని నేనిచ్చిన నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా నేను నియమించిన సబ్బాతులను పూర్తిగా అపవిత్రం చేశారు. కాబట్టి వారిపై నా ఉగ్రత కుమ్మరించి వారిని అరణ్యంలో నాశనం చేయాలనుకున్నాను. 14అయితే కోసం నేను ఎవరి దృష్టిలో వారిని బయటకు తీసుకువచ్చానో ఆ జాతుల దృష్టిలో నా నామం అపవిత్రం కాకుండా ఉండేందుకు నేను అనుకున్న ప్రకారం చేయలేదు. 15-16తమకిష్టమైన విగ్రహాలను పూజించాలని నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండ నా శాసనాలను అనుసరించకుండ నా సబ్బాతులను అపవిత్రం చేసినందుకు, నేను వారికి ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, అన్ని దేశాల్లో అతి సుందరమైన దేశంలోనికి నేను వారిని తీసుకురానని వారు అరణ్యంలో ఉండగానే నా చేయి పైకెత్తి వారితో ప్రమాణం చేశాను. 17అయినా వారి మీద జాలిపడి వారిని నాశనం చేయలేదు, అరణ్యంలోనే వారిని అంతం చేయలేదు. 18వారు అరణ్యంలో ఉన్నప్పుడు నేను వారి పిల్లలతో, “మీ తండ్రుల కట్టడలను పాటించవద్దు; వారి పద్ధతులను అనుసరిస్తూ వారి విగ్రహాలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. 19మీ దేవుడైన యెహోవాను నేనే; నా శాసనాలను అనుసరిస్తూ నా ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించండి. 20సబ్బాతును పరిశుద్ధంగా పాటించండి; నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి మీకూ నాకు మధ్య సూచనగా ఉంటాయి” అని చెప్పాను.
21“ ‘అయినా వారి పిల్లలు నాపై తిరగబడ్డారు: వారు అనుసరించి బ్రతకాలని చెప్పి నేను ఇచ్చిన నా శాసనాలను వారు పాటించకుండా నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా నా సబ్బాతును అపవిత్రం చేశారు. కాబట్టి వారు అరణ్యంలో ఉండగానే నా ఉగ్రతను వారి మీద కుమ్మరించి కోపాన్ని తీర్చుకోవాలని అనుకున్నాను. 22అయితే నేను ఏ ఇతర ప్రజలమధ్య ప్రత్యక్షమయ్యానో ఏ ఇతర ప్రజల నుండి వారిని బయటకు రప్పించానో ఆ ప్రజలమధ్య నా నామం అపవిత్రపరచబడకుండా నా చేయి వెనుకకు తీసి నా వాగ్దానం నెరవేర్చాను. 23-24వారు నా ధర్మశాస్త్రానికి లోబడకుండా నా శాసనాలను తృణీకరించి నా సబ్బాతును అపవిత్రపరచి తమ తండ్రులు పెట్టిన విగ్రహాలను పూజించారు, కాబట్టి నేను వారిని ఇతర ప్రజలమధ్య చెదరగొట్టి అన్ని దేశాలకు వారిని చెదరగొడతానని అరణ్యంలో వారికి ప్రమాణం చేశాను. 25కాబట్టి నేనే యెహోవానని వారు తెలుసుకునేలా నేను వారికి మంచివి కాని శాసనాలు, వారు బ్రతకడానికి ఉపయోగపడని విధులు ఇచ్చాను; 26వారు తమ మొదటి సంతానాన్ని బలి ఇచ్చి తమను తాము అపవిత్రం చేసుకోనిచ్చాను. నేనే యెహోవానని వారు తెలుసుకునేలా వారిని భయాందోళనలకు గురిచేస్తాను.’
27“కాబట్టి మనుష్యకుమారుడా, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ విషయంలో కూడా మీ పూర్వికులు నాకు నమ్మకద్రోహం చేసి నన్ను దూషించారు: 28నేను వారిని ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి నేను వారిని తీసుకువచ్చిన తర్వాత కూడా ఎత్తైన కొండను గాని గుబురుగా ఉన్న చెట్టును గాని వారు చూడగానే వాటికి బలులు అర్పణలు అర్పిస్తూ, పరిమళ ధూపాలను వేస్తూ పానార్పణలు చేస్తూ నాకు కోపం పుట్టించారు. 29అప్పుడు నేను వారితో ఇలా అన్నాను: మీరు వెళ్లే ఈ ఉన్నత స్థలం ఏమిటి?’ ” అని అడిగాను. (ఇప్పటికి అది బామా#20:29 బామా అంటే ఉన్నత స్థలం అనే పిలువబడుతుంది.)
తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు పునరుద్ధరించబడింది
30“కాబట్టి ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీ పూర్వికులు చేసిన విధంగా మీరు కూడా అసహ్యమైన విగ్రహాలతో వ్యభిచారం చేస్తారా? 31నేటి వరకు మీరు అర్పణలు అర్పించి, మీ పిల్లలను అగ్నిగుండాలు దాటించి మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటిని పూజించి అపవిత్రులవుతున్నారు. ఇశ్రాయేలీయులారా, నన్ను విచారించడానికి నేను మిమ్మల్ని అనుమతించాలా? నా జీవం తోడు నా నుండి మీకు ఏ ఆలోచనా దొరకదు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
32“ ‘ “మేము కట్టెను, రాయిని సేవించే దేశాల్లా, ప్రపంచంలోని జనాంగాల్లా ఉండాలని కోరుకుంటున్నాము” అని మీరంటున్నారు. కాని మీ మనస్సులో ఉన్నట్లు ఎప్పటికీ జరగదు. 33నా జీవం తోడు, నేను బలిష్టమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న కోపంతో నిన్ను పరిపాలిస్తాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 34నేను మిమ్మల్ని ఇతర ప్రజల్లో నుండి రప్పిస్తాను మీరు చెదిరిపోయి ఉన్న దేశాల నుండి బలమైన చేతితో, చాచిన బాహువుతో, వెల్లువెత్తుతున్న ఉగ్రతతో మిమ్మల్ని సమకూరుస్తాను. 35నేను మిమ్మల్ని జనాలు ఉన్న అరణ్యంలోకి తీసుకువస్తాను, అక్కడ ముఖాముఖిగా నేను మీకు తీర్పు తీరుస్తాను. 36ఈజిప్టు దేశపు అరణ్యంలో నేను మీ పూర్వికులకు తీర్పు ఇచ్చినట్టే మీకు కూడా తీరుస్తానని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు. 37మీరు నా చేతికర్ర క్రింద దాటి వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని గమనించి మిమ్మల్ని ఒడంబడిక బంధంలోనికి తీసుకువస్తాను. 38నా మీద తిరుగుబాటు చేసేవారిని దోషులను మీలో ఉండకుండా చేస్తాను. వారు ఉంటున్న దేశంలో నుండి వారిని బయటకు రప్పిస్తాను కాని వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు. అప్పుడు మీరు నేనే యెహోవానని తెలుసుకుంటారు.
39“ ‘ఇశ్రాయేలు ఇంటివారలారా! ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: మీరు నా మాట వినకపోతే మీరు వెళ్లి మీ విగ్రహాలను పూజించండి. కాని మీ అర్పణల వలన విగ్రహాల వలన నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేయకండి. 40ఇశ్రాయేలీయులకు ఉన్నత పర్వతమైన నా పరిశుద్ధ పర్వతం మీద దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరు నాకు సేవ చేస్తారు, అక్కడే నేను వారిని అంగీకరిస్తాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అక్కడ మీ పరిశుద్ధ బలులతో పాటు మీ అర్పణలు, మీ ప్రత్యేక కానుకలన్నిటిని#20:40 లేదా ప్రథమ ఫలాల కానుకలు నేను అంగీకరిస్తాను. 41ఇతర ప్రజల నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మీరు చెదరిపోయిన ఆయా దేశాల్లో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపంలా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. ఇతర ప్రజల ఎదుట మీ మధ్య నన్ను నేను పరిశుద్ధ పరుచుకుంటాను. 42మీ పూర్వికులకు ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశమైన ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 43అక్కడ మీరు మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకున్న పనులన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీరు చేసిన చెడు అంతటిని బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు. 44ఇశ్రాయేలీయులారా! మీ దుర్మార్గాన్ని బట్టి మీ చెడు పనులను బట్టి కాకుండా నా నామాన్ని బట్టే మీకు ఇలా చేసినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
దక్షిణ దేశానికి వ్యతిరేకంగా ప్రవచనం
45యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 46“మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని దక్షిణం వైపు త్రిప్పుకుని దక్షిణ దేశానికి ప్రకటించు; దక్షిణ అరణ్యాన్ని గురించి ప్రవచించు. 47దక్షిణ అరణ్యంలో ఇలా చెప్పు: ‘యెహోవా మాట విను. ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను నీలో అగ్ని రాజేస్తాను. అది నీలో ఉన్న పచ్చని చెట్లను ఎండిన చెట్లను అన్నిటిని కాల్చివేస్తుంది. ఆ అగ్ని ఆరిపోదు. దక్షిణ దిక్కునుండి ఉత్తరదిక్కు వరకు భూతలమంతా కాలిపోతుంది. 48ఆ అగ్నిని రగిలించింది యెహోవానైన నేనేనని అందరు తెలుసుకుంటారు; దాన్ని ఎవరూ ఆర్పలేరు.’ ”
49అప్పుడు నేను ఇలా అన్నాను, “ప్రభువైన యెహోవా, వారు నా గురించి, ‘ఇతడు కేవలం ఉపమానాలు చెప్పేవాడే కదా?’ అని అంటున్నారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహెజ్కేలు 20: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.