ఎఫెసీ పత్రిక 1

1
1దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు,
ఎఫెసులో ఉన్న క్రీస్తు యేసునందు నమ్మకస్థులైన, దేవుని పరిశుద్ధ ప్రజలకు వ్రాయునది:
2మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.
క్రీస్తులో ఉన్న ఆత్మీయ ఆశీర్వాదాలను బట్టి స్తుతించుట
3మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక. పరలోక మండలాల్లో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో క్రీస్తులో ఆయన మనల్ని దీవించారు. 4మనం ఆయన దృష్టిలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని లోకం సృష్టించబడక ముందే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు. 5తన ప్రేమతో ముందుగానే, యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన సొంత కుమారులుగా స్వీకరించాలని ఆయన నిర్ణయించుకోవడం ఆయనకు ఎంతో ఇష్టాన్ని ఆనందాన్ని కలిగించింది. 6తాను ప్రేమించిన వానిలో, ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన తన మహాకృపకు ఘనత కలుగునట్లు దేవుడు ఈ విధంగా చేశారు. 7దేవుని కృపా ఐశ్వర్యానికి అనుగుణంగా ఆయనలో మనం ఆయన రక్తం ద్వారా విడుదల, పాపక్షమాపణ కలిగి ఉన్నాము. 8ఆ కృపను ఎంత ధారాళంగా కుమ్మరించారంటే, దానితో మనకు సంపూర్ణమైన జ్ఞానం, వివేచనను ఇచ్చి, 9క్రీస్తులో ఆయన ఉద్దేశించిన తన చిత్తాన్ని గురించిన మర్మాన్ని తన దయాసంకల్పానికి అనుగుణంగా మనకు తెలియజేశారు. 10కాలం సంపూర్ణమైనప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, అనగా పరలోకంలో ఉన్న వాటినే గాని భూమి మీద ఉన్న వాటినే గాని సమస్తాన్ని క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని నిర్ణయించుకొన్నారు.
11దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పాన్ని బట్టి, క్రీస్తులో ముందుగా నిరీక్షించిన మనం, తన మహిమకు కీర్తి తీసుకురావాలని నిర్ణయించి, ఆయన మనల్ని తన వారసులుగా ఏర్పరచుకున్నారు. 12ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయాన్ని బట్టి, సమస్త కార్యాలను జరిగిస్తున్నారు. 13మీరు కూడా సత్య వాక్యాన్ని అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మచేత ముద్రించబడి ఉన్నారు. 14దేవుని మహిమను స్తుతించడానికి ఆయన స్వాస్థ్యమైన వారికి విడుదల కలిగే వరకు ఈ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.
ప్రార్థన కృతజ్ఞత చెల్లించుట
15ఈ కారణాన్ని బట్టి, ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించి, దేవుని ప్రజలందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి నేను విన్నప్పటి నుండి, 16మీ గురించి మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కోసం ప్రార్థిస్తున్నాను. 17మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియైన తండ్రిని మీరు తెలుసుకోవడానికి జ్ఞానం ప్రత్యక్షతగల ఆత్మను మీకు ఇవ్వాలని నా ప్రార్థనలలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. 18-19మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణలో, ఆయన పరిశుద్ధ ప్రజల్లో ఆయన వారసత్వం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో, మనం నమ్మిన ఆయన శక్తి యొక్క అపరిమితమైన ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవడానికి మీ మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థిస్తున్నాను. 20-21ఆయన ప్రభావవంతమైన శక్తితోనే క్రీస్తును మృతులలో నుండి లేపి, సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగంలోను రాబోవు యుగాల్లోను పేరుగాంచిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకంలో తన కుడి వైపున ఆయనను కూర్చోబెట్టుకున్నారు. 22దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచి, సమస్తానికి పైన సంఘానికి ఆయనను శిరస్సుగా నియమించారు. 23సంఘం అనగా ఆయన శరీరం; సమస్తాన్ని పూర్తిగా నింపుతున్న ఆయన యొక్క పరిపూర్ణత.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఎఫెసీ పత్రిక 1: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ఎఫెసీ పత్రిక 1 కోసం వీడియో