ద్వితీయో 14

14
పవిత్రమైన అపవిత్రమైన ఆహారం
1మీరు మీ దేవుడైన యెహోవాకు పిల్లలు. చనిపోయినవారి కోసం మిమ్మల్ని మీరు కోసుకోకూడదు, మీ కనుబొమ్మల మధ్య క్షవరం చేసుకోకూడదు, 2ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు పవిత్ర ప్రజలు. భూమి మీద ఉన్న ప్రజలందరిలో యెహోవా మిమ్మల్ని తన విలువైన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారు.
3అసహ్యమైనదేది తినకూడదు. 4మీరు తినదగిన జంతువులు: ఎద్దు, గొర్రె, మేక, 5జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి మేకలు, అడవి గొర్రెలు, లేడి దుప్పులు, కొండ గొర్రెలు, 6చీలిన డెక్కలు ఉండి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు. 7అయితే, నెమరువేసే జంతువు లేదా చీలిన డెక్కలు కలిగి ఉన్న ఒంటెలు, కుందేలు, పొట్టి కుందేలు లాంటివి మీరు తినకూడదు. అవి నెమరువేసేవైనా వాటికి చీలిన డెక్కలు లేవు; అవి మీకు ఆచారరీత్య అపవిత్రమైనవి. 8పంది కూడా అపవిత్రమైనది; దానికి చీలిన డెక్కలు ఉంటాయి కాని అది నెమరువేయదు. వాటి మాంసం తినవద్దు వాటి కళేబరాలు ముట్టుకోవద్దు.
9నీటిలో నివసించే జీవులన్నిటిలో రెక్కలు పొలుసులు గలవాటిని మీరు తినవచ్చు. 10రెక్కలు పొలుసులు లేనివాటిని మీరు తినకూడదు; అవి మీకు అపవిత్రమైనవి.
11పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు. 12కాని మీరు తినకూడనివి ఇవే: గ్రద్ద, రాబందు, నల్ల రాబందు, 13ఎర్ర గ్రద్ద, నల్ల గ్రద్ద, ప్రతి రకమైన తెల్ల గ్రద్ద, 14ప్రతి రకమైన కాకి, 15కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ, 16పైడికంటే, గుడ్లగూబ, హంస, 17గూడబాతు, నల్లబోరువ, చెరువు కాకి, 18సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.
19ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవి; మీరు వాటిని తినకూడదు. 20ఆచారరీత్య పవిత్రమైన రెక్కలు గల ప్రతి ప్రాణిని మీరు తినవచ్చు.
21మీరు ముందే కనుగొన్న చచ్చినదానిని తినకూడదు. మీ పట్టణాల్లో నివసించే విదేశీయులకు మీరు దానిని ఇవ్వవచ్చు, వారు దానిని తినవచ్చు లేదా ఇతర విదేశీయులకు దానిని అమ్మవచ్చు. అయితే మీరు మీ దేవుడైన యెహోవాకు పవిత్ర ప్రజలు.
మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.
దశమభాగాలు
22ప్రతి సంవత్సరం మీ పొలాల్లో పండే పంటల్లో పదవ వంతును ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉంచాలి. 23మీ దేవుడైన యెహోవాకు మీరు ఎల్లప్పుడు భయపడడం నేర్చుకునేలా మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, పశువుల్లో, మందలలో మొదటి పిల్లల్లో పదవ దానిని యెహోవా సన్నిధిలో తినాలి. 24ఒకవేళ ఆ స్థలం అంటే యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలం మీకు చాలా దూరంగా ఉంటే, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినందున మీ దశమభాగాన్ని అక్కడికి మోసుకొని వెళ్లలేనప్పుడు, 25మీ దశమభాగాన్ని వెండికి మార్చి, దానిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకురావాలి. 26ఆ వెండితో మీకు నచ్చిన వాటిని కొనండి: పశువులు, గొర్రెలు, ద్రాక్షరసం లేదా మద్యం లేదా మీకు నచ్చింది ఏదైన. తర్వాత మీరు మీ కుటుంబీకులు అక్కడే మీ దేవుడైన యెహోవా సన్నిధిలో వాటిని తిని సంతోషించాలి. 27మీ పట్టణాల్లో నివసించే లేవీయులను నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే వారికి మీతో పాటు భాగం గాని వారసత్వం గాని లేదు.
28-29మీ దేవుడైన యెహోవా మీ చేతిపనిని ఆశీర్వదించేలా, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఆ సంవత్సరం పండిన పంటలో దశమభాగాన్ని తెచ్చి మీ పట్టణాల్లో నిలువచేయాలి, తద్వార మీతో పాటు భాగం గాని వారసత్వం గాని లేని లేవీయులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తిపొందుతారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ద్వితీయో 14: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ద్వితీయో 14 కోసం వీడియో