ఆమోసు 3
3
ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా పిలువబడిన సాక్షులు
1ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి:
2“భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండి
మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను.
కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టి
నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”
3పరస్పర సమ్మతి లేకుండా
ఇద్దరూ కలిసి నడుస్తారా?
4ఆహారం దొరకక పోతే,
సింహం అడవిలో గర్జిస్తుందా?
దేనినీ పట్టుకోకుండానే
అది దాని గుహలో గుర్రుమంటుందా?
5నేల మీద ఎరపెట్టనిదే,
పక్షి ఉరిలో చిక్కుకుంటుందా?
ఉరిలో ఏదీ చిక్కకపోతే,
ఆ ఉరి నేల నుండి పైకి లేస్తుందా?
6పట్టణంలో బూరధ్వని వినబడితే,
ప్రజలు వణకరా?
పట్టణంలో విపత్తు వచ్చినప్పుడు
అది యెహోవా పంపింది కాదా?
7తన సేవకులైన ప్రవక్తలకు
తన ప్రణాళికను తెలియజేయకుండా
ప్రభువైన యెహోవా ఏదీ చేయరు.
8సింహం గర్జించింది,
భయపడని వారెవరు?
ప్రభువైన యెహోవా చెప్పారు
దానిని ప్రవచించకుండ ఉన్నవారెవరు?
9అష్డోదు కోటలకు ఇలా చాటించండి,
ఈజిప్టు కోటలకు ఇలా చాటించండి:
“సమరయ పర్వతాలమీద కూడుకోండి;
దానిలో జరుగుతున్న గొప్ప అల్లరిని,
దాని ప్రజలమధ్య ఉన్న దౌర్జన్యాన్ని చూడండి.”
10“సరియైనది ఎలా చేయాలో వారికి తెలియదు,”
అని యెహోవా చెప్తున్నారు,
“వారు తమ కోటలలో
తాము కొల్లగొట్టిన దోపుడుసొమ్మును దాచుకుంటారు.”
11కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే:
“శత్రువు నీ ప్రాంతంలో చొరబడతాడు,
మీ దుర్గాలను పడగొడతాడు,
మీ కోటలను దోచుకుంటాడు.”
12యెహోవా చెప్పే మాట ఇదే:
“గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు,
దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా,
సమరయలో మంచాల మీద
పట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న,
ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.”
13“దీనిని విని, యాకోబు వారసులకు వ్యతిరేకంగా తెలియజేయండి” అని ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్తున్నారు.
14“ఇశ్రాయేలు పాపాలను శిక్షించే రోజున
బేతేలులోని బలిపీఠాలను నేను నాశనం చేస్తాను;
ఆ బలిపీఠపు కొమ్మలు విరగ్గొట్టబడి నేలరాలుతాయి.
15చలికాలపు విడిది భవనాన్ని,
ఎండకాలపు విడిది భవనాన్ని పడగొడతాను;
ఏనుగు దంతంతో అలంకరించబడ్డ భవనాలు నాశనమవుతాయి
గొప్ప భవనాలు నిర్మూలించబడతాయి,”
అని యెహోవా చెప్తున్నారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఆమోసు 3: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.