రాత్రివేళలో కలిగిన దర్శనంలో మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి నిలబడి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయండి” అని తనను బ్రతిమాలుతున్నట్లు పౌలు చూశాడు. పౌలు ఆ దర్శనాని చూసిన తర్వాత, వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని నిర్ణయించుకొని, వెంటనే మాసిదోనియ ప్రాంతానికి వెళ్లడానికి మేము సిద్ధపడ్డాము.
మేము త్రోయ ప్రాంతాన్ని వదిలి ఓడ ఎక్కి నేరుగా సమొత్రాకే ద్వీపానికి వచ్చి, మరుసటిరోజు నెయపొలి ప్రాంతానికి వెళ్లాము. అక్కడినుండి మేము ప్రయాణం చేసి, రోమీయులున్న మాసిదోనియ ప్రాంతంలోని ముఖ్య పట్టణమైన ఫిలిప్పీకు వెళ్లాము. మేము అక్కడ చాలా రోజులు ఉన్నాము.
ఒక సబ్బాతు దినాన ప్రార్థన స్థలమేదైనా ఉంటుందేమో చూద్దామని, పట్టణ ద్వారాన్ని దాటి నదీ తీరానికి వెళ్లాము, మేము ఒక చోటున కూర్చుని అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడడం ప్రారంభించాము. అక్కడ వింటున్న వారిలో తుయతైర పట్టణానికి చెందిన, ఊదా రంగు బట్టలను అమ్మే లూదియ అనే స్త్రీ ఉంది. ఆమె దేవుని ఆరాధించేది. పౌలు చెప్పిన మాటలకు స్పందించేలా ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచారు. కాబట్టి ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆమె మాతో, “నేను ప్రభువు విశ్వాసినని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండవలసిందే” అని తన ఇంటికి రమ్మని బ్రతిమాలి మమ్మల్ని ఆహ్వానించింది.
మరొక రోజు మేము ప్రార్థన స్థలానికి వెళ్తుండగా, దయ్యం పట్టి సోదె చెప్పే ఒక బానిస స్త్రీ మాకు ఎదురయింది. ఆమె సోదె చెప్తూ తన యజమానికి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేది. ఆమె పౌలును మమ్మల్ని వెంబడిస్తూ, “ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని తెలియజేస్తున్నారు” అని బిగ్గరగా అరిచి చెప్పింది. ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ ఉంది. చివరికి ఒక రోజు పౌలు చాలా చికాకుపడి ఆమె వైపు తిరిగి దయ్యంతో, “నీవు ఈమె నుండి బయటకు వెళ్లిపో అని యేసు క్రీస్తు పేరట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను!” అని గద్దించాడు. వెంటనే ఆ దయ్యం ఆమెను వదిలిపోయింది.
ఆమె యజమానులు ఇక వారికి ఆదాయం వచ్చే మార్గమే లేకుండా పోయిందని గుర్తించి, వారు పౌలు సీలలను పట్టుకుని ఆ పట్టణ సంతవీధులలో ఉండే అధికారుల దగ్గరకు వారిని ఈడ్చుకొని పోయారు. వారు వారిని న్యాయాధికారుల దగ్గరకు తెచ్చి, “ఈ మనుష్యులు యూదులు, రోమీయులమైన మనం అంగీకరించని ఆచారాలను ప్రకటిస్తూ, మన పట్టణంలో కలహాలను రేపుతున్నారు” అని చెప్పారు.
జనసమూహం కూడా వారి మీద దాడి చేశారు, కాబట్టి న్యాయాధికారులు వారి వస్త్రాలను లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారిని తీవ్రంగా దెబ్బలు కొట్టి, చెరసాలలో పడవేసి, భద్రంగా కాపలా కాయమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. అతడు ఈ ఆదేశాలను పొందుకొని, వారిని చెరసాలలోని లోపలి గదిలో కాళ్లను చెక్క మొద్దులలో ఇరికించి బంధించాడు.
సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయి. ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు. వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు.
చెరసాల అధికారి దీపాలను తెమ్మని చెప్పి, వేగంగా లోనికి వచ్చి, వణుకుతూ పౌలు సీలల ముందు సాగిలపడ్డాడు. ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు.
అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు. అప్పుడు వారు అతనికి అతని ఇంటి వారందరికి ప్రభువు వాక్యాన్ని బోధించారు. ఆ రాత్రి సమయంలోనే అతడు వారిని తీసుకువచ్చి, వారి గాయాలను కడిగాడు. వెంటనే అతడు అతని ఇంటివారందరు బాప్తిస్మం పొందుకున్నారు. ఆ చెరసాల అధికారి వారిని తన ఇంటికి తెచ్చి వారికి భోజనం వడ్డించాడు. తాను తన ఇంటివారందరు దేవుని నమ్ముకున్నందుకు అతడు ఆనందించాడు.