2 పేతురు పత్రిక 2

2
అబద్ధ బోధకులు, వారి నాశనం
1అయితే మీలో అబద్ధ బోధకులు ఉన్నట్లుగానే, గతంలో కూడా ప్రజల మధ్యలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారు రహస్యంగా నాశనకరమైన నియమాలను ప్రవేశపెడుతూ, తమను కొన్న సర్వాధికారియైన ప్రభువును కూడా తిరస్కరిస్తూ తమ మీదికి తామే వేగంగా నాశనాన్ని తెచ్చుకుంటారు. 2చాలామంది వారి పోకిరి చేష్టలను అనుసరిస్తారు, వీరిని బట్టి సత్యమార్గంలో ఉన్నవారిని దూషిస్తారు. 3ఈ బోధకులు దురాశతో కట్టుకథలు చెప్పి మిమ్మల్ని దోచుకుంటారు. వారికి పూర్వకాలమే ఇవ్వబడిన తీర్పు వారి మీదికే వస్తుంది, వారి నాశనం ఆలస్యం కాదు.
4ఎందుకంటే, దేవదూతలు పాపం చేసినపుడు దేవుడు వారిని విడిచిపెట్టక, వారిని సంకెళ్లతో బంధించి,#2:4 కొ.ప్ర.లలో చింత కలిగించు చెరసాలలు చీకటి గల పాతాళానికి#2:4 గ్రీకులో టర్టారస్ పంపి తీర్పు దినం వరకు వారిని కాపలాలో ఉంచారు. 5ఆయన పూర్వకాలపు లోకాన్ని విడిచిపెట్టక అప్పటి భక్తిహీనులైన ప్రజలమీదికి జలప్రళయాన్ని రప్పించారు కాని, నీతిని బోధించిన నోవహును#2:5 ఆది 6–8, అధ్యాయాలను చూడండి మరి ఏడుగురిని రక్షించారు. 6దేవుడు సొదొమ, గొమొర్రాలకు#2:6 ఆది 18; 19 చూడండి తీర్పు తీర్చి వాటిని కాల్చి బూడిద చేసి భక్తిహీనులకు ఏమి జరుగుతుందో తెలియజేయడానికి వాటిని ఒక మాదిరిగా ఉంచారు. 7దుష్టుల కామ వికార ప్రవర్తన వలన బాధపడిన నీతిమంతుడైన లోతును ఆయన రక్షించారు. 8ఎందుకంటే, ఈ నీతిమంతుడు దినదినం వారి మధ్య జీవిస్తూ వారి చెడు కార్యాలను చూసి, వారి మాటలు విని తన నీతిగల మనస్సులో వేదన చెందాడు. 9అదే విధంగా భక్తులను శ్రమలలో నుండి ఎలా విడిపించాలో ప్రభువుకు తెలుసు. అలాగే తీర్పు దినాన దుష్టులను ఎలా శిక్షించాలో కూడా ఆయనకు తెలుసు. 10మరి ముఖ్యంగా శరీరాశలను అనుసరించి చెడిపోయిన వారిని, ఆయన అధికారాన్ని తృణీకరించిన వారిని శిక్షించడం ఆయనకు తెలుసు.
వీరు ధైర్యంగా దురహంకారంతో పరలోక సంబంధులను దూషించడానికి భయపడరు. 11బలవంతులు శక్తిమంతులైన దేవదూతలు సహితం ప్రభువు తీర్పు తెచ్చినప్పుడు#2:11 అనేక ప్రతులలో ప్రభువు సన్నిధిలో వారిని అలా దూషించరు. 12కాని ఈ ప్రజలు తాము గ్రహించలేని విషయాలను దూషిస్తారు. వారు స్వాభావికంగా పట్టబడడానికి, నశించడానికి పుట్టిన వివేకంలేని జంతువుల వంటివారు, ఆ జంతువుల్లా వీరు కూడా నశించిపోతారు.
13వారు ఇతరులకు చేసిన హానికి ప్రతిఫలంగా వారికి హాని కలుగుతుంది. వారు పట్ట పగలే త్రాగుతూ ఆనందించాలని భావిస్తారు. వారు కళంకులు నిందలుగలవారై విందుల్లో#2:13 కొ.ప్ర.లలో వారి ప్రేమ విందుల్లో మీతో పాల్గొని తిని త్రాగి ఆనందిస్తారు. 14వ్యభిచారం నిండిన కళ్లతో, పాపం చేయడం వారెప్పటికి మానరు; వారు అస్థిరమైన వ్యక్తులను ప్రలోభపెడతారు; వారు దురాశ కోసం వారి హృదయాలకు శిక్షణనిచ్చారు; వీరు శాపగ్రస్తులైన పిల్లలు! 15వారు సరియైన మార్గాన్ని విడిచిపెట్టి, దుష్టత్వానికి వచ్చే జీతాన్ని ప్రేమించిన బెయోరు#2:15 గ్రీకు భాషలో బోసోర్ కుమారుడైన బిలాము మార్గాన్ని అనుసరించడానికి వెళ్లారు. 16అయితే అతడు తన చెడు కార్యాన్ని బట్టి ఒక గాడిద చేత గద్దింపబడ్డాడు, ఒక మాట్లాడలేని జంతువు మానవ స్వరంతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డుకున్నది.
17వీరు నీళ్లు లేని ఊటల వంటివారు. తుఫాను తీవ్రతకు కొట్టుకొని పోవు మేఘాల వంటివారు. కటిక చీకటి వారి కోసం సిద్ధపరచబడింది. 18ఎందుకంటే, వారి మాటలు వట్టివి డాంబికమైనవి, వారు శరీర సంబంధమైన దురాశలు కలవారై, చెడు మార్గంలో జీవిస్తూ అప్పుడే తప్పించుకున్నవారికి పోకిరి చేష్టలను ఎరగా చూపించి ప్రలోభపెడతారు. 19తామే దుర్నీతికి బానిసలై ఉండి, అలాంటి వారికి స్వాతంత్ర్యం ఇస్తామని చెప్తారు. ఎందుకంటే “ఒకరు దేని చేతిలో ఓడిపోతారో దానికే దాసులవుతారు.” 20మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తును తెలుసుకోవడం వల్ల లోకంలోని పాపం నుండి తప్పించుకుని, మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడితే, వారి చివరి స్థితి మొదటి స్ధితి కన్నా దారుణంగా ఉంటుంది. 21వారు నీతి మార్గాన్ని తెలుసుకొని వారికి ఇవ్వబడిన పరిశుద్ధ ఆజ్ఞల నుండి వెనుకకు తిరిగితే, ఆ మార్గం వారికి తెలియక పోవడమే మంచిది. 22“కుక్క తను కక్కిన దానికి తిరిగినట్లు, కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మళ్లినట్లు”#2:22 సామెత 26:11 అనే సామెతలు వీరి విషయంలో నిజం.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 పేతురు పత్రిక 2: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

2 పేతురు పత్రిక 2 కోసం వీడియో