2 దినవృత్తాంతములు 9
9
షేబ రాణి సొలొమోనును దర్శించుట
1షేబ దేశపు రాణి సొలొమోను ఖ్యాతి గురించి విన్నప్పుడు, చిక్కు ప్రశ్నలతో అతన్ని పరీక్షిద్దామని ఆమె యెరూషలేముకు వచ్చింది. ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది. 2సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు. వివరించలేనంత కష్టమైనది అతనికి ఏది లేదు. 3షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానాన్ని, అతడు కట్టించిన రాజభవనాన్ని, 4అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, తమ ప్రత్యేక వస్త్రాల్లో ఉన్న పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది.
5ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే. 6అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, మీ జ్ఞానం యొక్క గొప్పతనం గురించి సగం కూడా నాకు చెప్పలేదు; నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు. 7మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో! 8మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని తన సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి, వారిని శాశ్వతంగా సుస్థిరం చేయాలని ఆయనకున్న కోరికను బట్టి, నీతిన్యాయాల ప్రకారం కార్యాలు చేయడానికి యెహోవా మిమ్మల్ని వారిమీద రాజుగా చేశారు” అని అభినందించింది.
9తర్వాత ఆమె రాజుకు 120 తలాంతుల#9:9 అంటే, సుమారు 4.5 టన్నులు బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి సొలొమోను రాజుకు ఇచ్చిన సుగంధద్రవ్యాలు వంటివి మరెప్పుడూ రాలేదు.
10(హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు నుండి బంగారం తెచ్చారు; వారు చందనం, దూలాలు, వెలగల రాళ్లు కూడా తెచ్చారు. 11ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి మెట్లను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. అంతకుముందు అలాంటివి యూదా ప్రదేశంలో ఎన్నడూ కనిపించలేదు.)
12రాజైన సొలొమోను షేబ రాణి కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు; ఆమె అతనికి తెచ్చిన వాటికంటే ఎక్కువగా ఆమెకు ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది.
సొలొమోను వైభవము
13సొలొమోనుకు సంవత్సరానికి వచ్చే బంగారం బరువు 666 తలాంతులు.#9:13 అంటే, సుమారు 25 టన్నులు 14అది వర్తకులు వ్యాపారులు తెచ్చిన ఆదాయం కాక, అరేబియా రాజులందరూ, దేశ అధికారుల నుండి సొలొమోనుకు బంగారం, వెండి తెచ్చారు.
15రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో రెండువందల పెద్ద డాళ్లను చేయించాడు; ప్రతి డాలుకు ఆరువందల షెకెళ్ళ#9:15 అంటే, సుమారు 6.9 కి. గ్రా. లు బంగారం వినియోగించారు. 16సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు. ప్రతి డాలుకు మూడువందల షెకెళ్ళ#9:16 అంటే, సుమారు 3.5 కి. గ్రా. లు బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.
17తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు. 18సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. దానికి ఒక బంగారు పాదపీఠం కట్టి ఉంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి. 19ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు. 20రాజైన సొలొమోను పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి, లెబానోను వనపు రాజభవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండితో ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే సొలొమోను కాలంలో వెండికి విలువలేదు. 21హీరాము#9:21 హెబ్రీలో హీరాము మరో రూపం హూరాము మనుష్యులతో పాటు రాజు ఓడలు సముద్రంలో తర్షీషు వెళ్లి, మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి.
22రాజైన సొలొమోను సంపదలో, జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే గొప్పవాడు. 23దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వినడానికి భూలోక రాజులందరూ సొలొమోనును చూడాలని కోరారు. 24ప్రతీ సంవత్సరం అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు తెచ్చేవారు.
25గుర్రాల కోసం, రథాల కోసం రాజైన సొలొమోనుకు నాలుగువేల శాలలు ఉన్నాయి. పన్నెండువేలమంది గుర్రపు రౌతులున్నారు. రథాలలో కొన్నిటిని రౌతులలో కొందరిని వాటికోసం కట్టిన పట్టణాల్లో ఉంచాడు. కొన్ని యెరూషలేములో తన దగ్గర ఉంచాడు. 26యూఫ్రటీసు నది ఒడ్డునుండి ఫిలిష్తీయుల దేశం వరకు, ఈజిప్టు సరిహద్దు వరకు ఉండే రాజులందరిపై అతడు పరిపాలన చేసేవాడు. 27రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా చేశాడు, దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు. 28సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, ఇతర అన్ని దేశాల నుండి దిగుమతి చేసుకున్నారు.
సొలొమోను మరణం
29సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, మొదటి నుండి చివరి వరకు నాతాను ప్రవక్త వ్రాసిన గ్రంథంలో, షిలోనీయుడైన అహీయా ప్రవచన గ్రంథంలో, దీర్ఘదర్శియైన ఇద్దో నెబాతు కుమారుడైన యరొబాము గురించి వ్రాసిన గ్రంథంలో వ్రాయబడలేదా? 30సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలందరి మీదా నలభై సంవత్సరాలు పరిపాలించాడు. 31తర్వాత సొలొమోను చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, అతన్ని అతని తండ్రి దావీదు పట్టణంలో సమాధి చేశారు, సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 దినవృత్తాంతములు 9: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.