1 సమూయేలు 4
4
1సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరికి వ్యాపించింది.
మందసాన్ని స్వాధీనపరచుకున్న ఫిలిష్తీయులు
ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఇశ్రాయేలీయులు ఎబెనెజెరులో, ఫిలిష్తీయులు ఆఫెకులో శిబిరం ఏర్పరచుకున్నారు. 2ఇశ్రాయేలీయుల మీదికి వెళ్లడానికి ఫిలిష్తీయులు తమ బలగాలను మోహరించారు. యుద్ధం ముమ్మరమైనప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయి యుద్ధభూమిలోనే సుమారు నాలుగు వేలమంది మరణించారు. 3సైనికులు శిబిరం దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల పెద్దలు, “ఈ రోజు యెహోవా ఫిలిష్తీయుల ముందు ఎందుకు మనలను ఓడిపోయేలా చేశారు? మనం యెహోవా నిబంధన మందసాన్ని షిలోహులో నుండి తీసుకువద్దాం, అప్పుడు ఆయన మనతో వెళ్లి మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షిస్తారు” అని అన్నారు.
4కాబట్టి ప్రజలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడినుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాల యెహోవా#4:4 హెబ్రీలో ఎల్-షద్దాయ్ యొక్క నిబంధన మందసాన్ని తెప్పించారు. దేవుని నిబంధన మందసంతో పాటు ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు అక్కడే ఉన్నారు.
5యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి రాగానే ఇశ్రాయేలీయులందరు భూమి దద్దరిల్లేంత పెద్దగా కేకలు వేశారు. 6ఆ కేకల ధ్వని ఫిలిష్తీయులు విని, “హెబ్రీయుల శిబిరంలో ఆ పెద్ద కేకలు ఏంటి?” అనుకున్నారు.
యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి వచ్చిందని వారు తెలుసుకొని, 7ఫిలిష్తీయులు భయపడి, “ఒక దేవుడు శిబిరంలోనికి వచ్చాడు; అయ్యో! ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు. 8మనకు శ్రమ! బలాఢ్యుడైన ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో అనేక రకాల తెగుళ్ళతో ఈజిప్టువారిని నాశనం చేసిన దేవుడు ఈయనే. 9ఫిలిష్తీయులారా, ధైర్యంగా ఉండండి! మగవారిగా ఉండండి, లేదా వారు మీకు బానిసలైనట్టు మీరు హెబ్రీయులకు బానిసలు కాకుండ మగవారిగా బలాఢ్యులై పోరాడండి!” అని చెప్పుకొన్నారు.
10కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ గుడారాలకు పారిపోయారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది; ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సైనికులు చనిపోయారు. 11దేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది, ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.
ఏలీ మరణం
12ఆ రోజే ఒక బెన్యామీనీయుడు యుద్ధభూమిలో నుండి పరుగెత్తుకుని వచ్చి చినిగిన బట్టలతో తలమీద దుమ్ముతో షిలోహులోనికి వచ్చాడు. 13అతడు వచ్చేటప్పటికి, ఏలీ మార్గం ప్రక్కన తన కుర్చీలో చూస్తూ కూర్చున్నాడు, ఎందుకంటే అతని హృదయం దేవుని మందసాన్ని గురించిన భయంతో నిండింది. ఆ వ్యక్తి పట్టణంలోకి ప్రవేశించి జరిగిన విషయం చెప్పగానే పట్టణమంతా కేకలు వేసింది.
14ఏలీ ఆ కేకలు విని, “ఈ కేకలకు అర్థమేంటి?” అని అడిగాడు.
ఆ వ్యక్తి వెంటనే ఏలీ దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు. 15ఏలీకి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు, అతనికి చూపు మందగించి చూడలేకపోయేవాడు. 16అతడు ఏలీతో, “యుద్ధభూమి నుండి వచ్చినవాన్ని నేనే, ఈ రోజే నేను యుద్ధంలో నుండి పరుగెత్తుకొని వచ్చాను” అని చెప్పాడు.
అప్పుడు ఏలీ, “నా కుమారుడా, ఏమి జరిగింది?” అని అడిగాడు.
17అందుకు ఆ వార్త తెచ్చిన అతడు, “ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందు నిలబడలేక పారిపోయారు. సైన్యంలో అనేకమంది చంపబడ్డారు. నీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ ఫీనెహాసులు కూడా చంపబడ్డారు. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారు” అని చెప్పాడు.
18దేవుని మందసం గురించి అతడు చెప్పగానే, ఏలీ గుమ్మం దగ్గర ఉన్న తన కుర్చీమీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. ఎందుకంటే అతడు ముసలివాడు, భారీకాయుడు. అతడు నలభై సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
19ఏలీ కోడలైన ఫీనెహాసు భార్య ప్రసవ సమయం దగ్గరపడిన గర్భవతి. దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని ఆమె విని, పురిటినొప్పులు వచ్చి, మోకాళ్లమీద కూలబడి ప్రసవించింది. ఆమె ఆ పురిటినొప్పులు తట్టుకోలేకపోయింది. 20ఆమె చనిపోతుండగా, అక్కడ నిలబడి ఉన్న స్త్రీలు ఆమెతో, “భయపడకు, నీకు కుమారుడు పుట్టాడు” అని చెప్పారు, కాని ఆమె జవాబు ఇవ్వలేదు, ఆ మాటలు పట్టించుకోలేదు.
21ఆమె దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని తెలుసుకొని, “ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని అంటూ తన కుమారునికి ఈకాబోదు#4:21 ఈకాబోదు అంటే మహిమ లేదు అని పేరు పెట్టింది. 22“దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకోవడం వలన, ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని ఆమె చెప్పింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
1 సమూయేలు 4: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.