సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరికి వ్యాపించింది. ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఇశ్రాయేలీయులు ఎబెనెజెరులో, ఫిలిష్తీయులు ఆఫెకులో శిబిరం ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలీయుల మీదికి వెళ్లడానికి ఫిలిష్తీయులు తమ బలగాలను మోహరించారు. యుద్ధం ముమ్మరమైనప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయి యుద్ధభూమిలోనే సుమారు నాలుగు వేలమంది మరణించారు. సైనికులు శిబిరం దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల పెద్దలు, “ఈ రోజు యెహోవా ఫిలిష్తీయుల ముందు ఎందుకు మనలను ఓడిపోయేలా చేశారు? మనం యెహోవా నిబంధన మందసాన్ని షిలోహులో నుండి తీసుకువద్దాం, అప్పుడు ఆయన మనతో వెళ్లి మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షిస్తారు” అని అన్నారు. కాబట్టి ప్రజలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడినుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాల యెహోవా యొక్క నిబంధన మందసాన్ని తెప్పించారు. దేవుని నిబంధన మందసంతో పాటు ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు అక్కడే ఉన్నారు. యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి రాగానే ఇశ్రాయేలీయులందరు భూమి దద్దరిల్లేంత పెద్దగా కేకలు వేశారు. ఆ కేకల ధ్వని ఫిలిష్తీయులు విని, “హెబ్రీయుల శిబిరంలో ఆ పెద్ద కేకలు ఏంటి?” అనుకున్నారు. యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి వచ్చిందని వారు తెలుసుకొని, ఫిలిష్తీయులు భయపడి, “ఒక దేవుడు శిబిరంలోనికి వచ్చాడు; అయ్యో! ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరుగలేదు. మనకు శ్రమ! బలాఢ్యుడైన ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపిస్తారు? అరణ్యంలో అనేక రకాల తెగుళ్ళతో ఈజిప్టువారిని నాశనం చేసిన దేవుడు ఈయనే. ఫిలిష్తీయులారా, ధైర్యంగా ఉండండి! మగవారిగా ఉండండి, లేదా వారు మీకు బానిసలైనట్టు మీరు హెబ్రీయులకు బానిసలు కాకుండ మగవారిగా బలాఢ్యులై పోరాడండి!” అని చెప్పుకొన్నారు. కాబట్టి ఫిలిష్తీయులు యుద్ధం చేశారు, ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ గుడారాలకు పారిపోయారు. అప్పుడు భయంకరమైన వధ జరిగింది; ఇశ్రాయేలీయులలో ముప్పైవేలమంది సైనికులు చనిపోయారు. దేవుని మందసం స్వాధీనం చేసుకోబడింది, ఏలీ ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులు చనిపోయారు.
చదువండి 1 సమూయేలు 4
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: 1 సమూయేలు 4:1-11
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు