1 సమూయేలు 16:7-12

1 సమూయేలు 16:7-12 OTSA

అయితే యెహోవా సమూయేలుతో, “అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు” అన్నారు. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా ఇతన్ని ఎంచుకోలేదు” అన్నాడు. అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచాడు కాని సమూయేలు, “ఇతన్ని కూడా యెహోవా ఎంచుకోలేదు” అన్నాడు. అలా యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుట నిలబెట్టాడు కాని సమూయేలు, “యెహోవా వీరెవరిని ఎంచుకోలేదు” అని చెప్పి, నీ కుమారులంతా వీరేనా? అని యెష్షయిని అడిగాడు. అందుకు యెష్షయి, ఇంకా చివరివాడున్నాడు. అయితే వాడు గొర్రెలు కాస్తున్నాడని చెప్పాడు. అందుకు సమూయేలు, “అతన్ని పిలిపించు; అతడు వచ్చేవరకు మనం భోజనం చేయము” అన్నాడు. కాబట్టి యెష్షయి అతన్ని పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు ఎర్రగా అందమైన కళ్లతో మంచి రూపంతో ఉన్నాడు. అప్పుడు యెహోవా, “నేను ఎన్నుకున్నది ఇతన్నే, నీవు లేచి అతన్ని అభిషేకించు” అన్నారు.