1 రాజులు 15

15
యూదా రాజైన అబీయా
1నెబాతు కుమారుడు యరొబాము పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అబీయా యూదా దేశానికి రాజయ్యాడు, 2అతడు యెరూషలేములో మూడేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి పేరు మయకా, ఆమె అబీషాలోము కుమార్తె.
3అతడు గతంలో తన తండ్రి చేసిన పాపాలన్నీ చేశాడు; అతని హృదయం తన పితరుడైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు. 4అయినా, అతని దేవుడైన యెహోవా దావీదును బట్టి, అతని సంతానం అతన్ని తర్వాత కొనసాగడానికి, యెరూషలేమును బలపరచడానికి యెరూషలేములో అతన్ని దీపంలా ఇచ్చారు. 5ఎందుకంటే దావీదు తాను బ్రతికిన కాలమంతా యెహోవా దృష్టిలో సరియైనది చేస్తూ, ఆయన ఆజ్ఞలలో దేనికి అవిధేయుడు కాలేదు. హిత్తీయుడైన ఊరియా విషయంలో మాత్రం అతడు తప్పిపోయాడు.
6అబీయా బ్రతికిన కాలమంతా అతనికి యరొబాముకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది. 7అబీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? అబీయాము యరొబాముకు యుద్ధం జరిగేది. 8అబీయా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు ఆసా రాజయ్యాడు.
యూదా రాజైన ఆసా
9ఇశ్రాయేలు రాజైన యరొబాము పరిపాలనలోని ఇరవయ్యవ సంవత్సరంలో, ఆసా యూదా దేశానికి రాజయ్యాడు. 10అతడు యెరూషలేములో నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు. అబీషాలోము కుమార్తె మయకా అతని అవ్వ.
11ఆసా తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. 12క్షేత్రాల్లోని మగ వ్యభిచారులను దేశం నుండి వెళ్లగొట్టాడు, అతని పూర్వికులు చేసిన విగ్రహాలన్నిటిని తొలగించాడు. 13అతని అవ్వ మయకా అషేరాను పూజించడానికి ఒక అసహ్యమైన ప్రతిమను చేయించింది కాబట్టి ఆమెను రాజమాత స్థానం నుండి తొలగించాడు. ఆసా ఆ ప్రతిమను కూలగొట్టి, కిద్రోను లోయలో దానిని తగలబెట్టాడు. 14అతడు క్షేత్రాలను మాత్రం తొలగించనప్పటికీ, ఆసా బ్రతికిన కాలమంతా యెహోవాకు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. 15అతడు, తాను తన తండ్రి ప్రతిష్ఠించిన బంగారం వెండి పాత్రలను యెహోవా ఆలయానికి తెచ్చాడు.
16ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది. 17ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీదికి వెళ్లి యూదా రాజైన ఆసా సరిహద్దులోనికి రాకపోకలు లేకుండ రామా పట్టణాన్ని పటిష్టం చేశాడు.
18అప్పుడు ఆసా యెహోవా మందిరంలో, తన భవనంలో ఉన్న ఖజానాల్లో మిగిలిన వెండి బంగారాలంతా తీసి తన అధికారులకు అప్పగించి, దమస్కులో పరిపాలిస్తున్న తబ్రిమ్మోను కుమారుడు, హెజ్యోను మనుమడు, సిరియా రాజైన బెన్-హదదుకు పంపాడు. 19అతడు, “నా తండ్రికి నీ తండ్రికి మధ్య ఒప్పందం ఉన్నట్లు, నీకు నాకు మధ్య ఒప్పందం ఉండాలి. చూడు, నేను వెండి బంగారాలను కానుకగా పంపిస్తున్నాను. ఇప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషా నా దగ్గర నుండి వెళ్ళిపోయేలా అతనితో నీ ఒప్పందం తెంచుకో” అని అన్నాడు.
20రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. అతడు ఈయోను, దాను, ఆబేల్-బేత్-మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా జయించాడు. 21బయెషా ఈ వార్త విని రామాను కట్టించడం మానేసి తిర్సాకు వెళ్లిపోయాడు. 22అప్పుడు రాజైన ఆసా ఎవరినీ మినహాయించకుండా, యూదా వారంతా రావాలని ప్రకటన చేశాడు. వారు కూడి వచ్చి, రామా కట్టించడానికి బయెషా ఉపయోగించిన రాళ్లను, కలపను ఎత్తుకుపోయారు. వాటితో రాజైన ఆసా బెన్యామీను ప్రాంతంలో గెబాను, మిస్పాను కట్టించాడు.
23ఆసా పరిపాలన గురించిన ఇతర విషయాలు అతని విజయాలు అతడు చేసిందంతా అతడు కట్టించిన పట్టణాల గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? అతని వృద్ధాప్యంలో అతని పాదాలకు వ్యాధి సోకింది. 24తర్వాత ఆసా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, తన పితరుడైన దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజైన నాదాబు
25యూదా దేశంలో రాజైన ఆసా పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యరొబాము కుమారుడైన నాదాబు ఇశ్రాయేలు దేశానికి రాజయ్యాడు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలును పరిపాలించాడు. 26అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు. అతని తండ్రి మార్గాలను అనుసరిస్తూ, అతని తండ్రి ఇశ్రాయేలు ప్రజలను పాపంలోకి నడిపించినట్లు అతడు కూడా చేశాడు.
27నాదాబు మీద ఇశ్శాఖారు గోత్రికుడు, అహీయా కుమారుడైన బాషా కుట్రపన్ని, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తున్న సమయంలో గిబ్బెతోనులో బయెషా నాదాబును చంపేశాడు. 28యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో బయెషా నాదాబును చంపి, అతని తర్వాత రాజయ్యాడు.
29అతడు రాజైన వెంటనే యరొబాము వంశం వారినందరిని చంపేశాడు. యరొబాము వంశంలో ప్రాణంతో ఉన్న ఏ ఒక్కని కూడా వదిలిపెట్టకుండా వారందరిని నిర్మూలం చేశాడు. యెహోవా తన సేవకుడు, షిలోహు వాడైన అహీయా ద్వారా ప్రకటించిన వాక్కు ప్రకారం ఇది జరిగింది. 30యరొబాము పాపం చేసి ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారకుడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం రేపాడు కాబట్టి ఇలా జరిగింది.
31నాదాబు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిందంతా ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా? 32ఆసాకు, ఇశ్రాయేలు రాజైన బయెషాకు వారు బ్రతికిన కాలమంతా యుద్ధం జరుగుతూనే ఉండేది.
ఇశ్రాయేలు రాజైన బాషా
33యూదా రాజైన ఆసా పరిపాలనలోని మూడవ సంవత్సరంలో, అహీయా కుమారుడైన బయెషా తిర్సాలో ఇశ్రాయేలంతటికి రాజయ్యాడు. అతడు ఇరవైనాలుగు సంవత్సరాలు పరిపాలించాడు. 34అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు, యరొబాము జీవిత విధానాన్ని అనుసరిస్తూ, యరొబాము ఇశ్రాయేలు ప్రజలను పాపంలోకి నడిపించినట్లు అతడు కూడా చేశాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 15: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి