1 రాజులు 11

11
సొలొమోను భార్యలు
1రాజైన సొలొమోను ఫరో కుమార్తెతో పాటు చాలామంది పరదేశి స్త్రీలను అనగా మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ ప్రజల్లోని స్త్రీలను ప్రేమించాడు. 2“మీరు వారితో పెళ్ళి చేసుకోవద్దు, ఎందుకంటే వారు ఖచ్చితంగా మీ హృదయాలను వారి దేవుళ్ళ వైపు త్రిప్పుతారు” అని యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో ఈ దేశాల వారి గురించే చెప్పారు. అయినప్పటికీ, సొలొమోను వారిని చాలా ప్రేమించాడు. 3అతనికి రాజకుమార్తెలైన ఏడువందలమంది భార్యలు, మూడువందలమంది ఉంపుడుగత్తెలు ఉన్నారు. అతని భార్యలు అతన్ని తప్పుదారి పట్టించారు. 4సొలొమోను వృద్ధుడైనప్పుడు, అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళ వైపు మళ్ళించారు. అతని హృదయం తన తండ్రియైన దావీదు హృదయంలా తన దేవుడైన యెహోవాకు పూర్తిగా అంకితం కాలేదు. 5సొలొమోను సీదోనీయుల దేవత అష్తారోతునూ, అమ్మోనీయుల అసహ్యమైన దేవత మిల్కోమును#11:5 మోలెక్ మిల్కోము యొక్క వేరే రూపం అనుసరించాడు. 6కాబట్టి సొలొమోను యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు; తన తండ్రియైన దావీదులా యెహోవాను సంపూర్ణంగా వెంబడించలేదు.
7సొలొమోను మోయాబీయుల అసహ్యమైన కెమోషు దేవునికి, అమ్మోనీయుల అసహ్యమైన మోలెకు దేవునికి యెరూషలేము తూర్పున ఉన్న కొండమీద క్షేత్రాలను కట్టించాడు. 8తన పరదేశి భార్యలు తమ దేవుళ్ళకు ధూపం వేస్తూ బలులు అర్పించడానికి ఇలా చేశాడు.
9సొలొమోనుకు రెండుసార్లు ప్రత్యక్షమైన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను అనుసరించక, తన హృదయం త్రిప్పుకున్నందుకు యెహోవా అతని మీద చాలా కోప్పడ్డారు. 10ఇతర దేవుళ్ళను అనుసరించకూడదు అని సొలొమోనుతో యెహోవా చెప్పినా, సొలొమోను ఆయన ఆజ్ఞను పాటించలేదు. 11కాబట్టి యెహోవా సొలొమోనుతో ఇలా అన్నారు, “నీ వైఖరి ఇలా ఉన్నది కాబట్టి, నేను నీకు ఆజ్ఞాపించిన నా నిబంధనను, నా శాసనాలను పాటించలేదు కాబట్టి, నేను ఖచ్చితంగా నీ నుండి ఈ రాజ్యాన్ని తీసివేసి నీ పనివారిలో ఒకనికి ఇస్తాను. 12అయినాసరే, నీ తండ్రియైన దావీదును బట్టి, నీ జీవితకాలంలో అలా చేయను, నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేస్తాను. 13అయితే అతని నుండి రాజ్యాన్నంతా తీసివేయను కాని నా సేవకుడైన దావీదును బట్టి, నేను ఎన్నుకున్న యెరూషలేమును బట్టి, నేను నీ కుమారునికి ఒక్క గోత్రం ఇస్తాను.”
సొలొమోను విరోధులు
14తర్వాత యెహోవా ఎదోము రాజవంశానికి చెందిన ఎదోమీయుడైన హదదును సొలొమోనుకు విరోధిగా లేపారు. 15గతంలో దావీదు ఎదోము మీద యుద్ధం చేస్తున్నప్పుడు సేనాధిపతి యోవాబు చనిపోయినవారిని పాతిపెట్టడానికి వెళ్లినప్పుడు, అతడు ఎదోములోని మగవారందరినీ చంపాడు. 16ఎదోములో ఉన్న మగవారందరు నిర్మూలం చనిపోయే వరకు యోవాబు ఇశ్రాయేలు వారందరితో పాటు ఆరు నెలలు అక్కడ ఉండిపోయాడు. 17అయితే అప్పుడు హదదు చిన్నవాడు, అతడు తన తండ్రి సేవకులైన కొంతమంది ఎదోమీయుల అధికారులతో ఈజిప్టుకు పారిపోయాడు. 18వారు మిద్యాను నుండి బయలుదేరి పారానుకు వెళ్లారు. తర్వాత పారాను నుండి కొందరిని వెంటబెట్టుకొని ఈజిప్టు రాజైన ఫరో దగ్గరకు వెళ్లారు, ఫరో హదదుకు ఇల్లు, ఆహారం, భూమి ఇచ్చాడు.
19ఫరోకు హదదు అంటే చాలా ఇష్టం కలిగి అతనికి తన భార్య తహ్పెనేసు రాణి యొక్క సోదరిని ఇచ్చి పెళ్ళి చేశాడు. 20తహ్పెనేసు సోదరికి హదదుకు గెనుబతు అనే కుమారుడు పుట్టాడు. తహ్పెనేసు రాజభవనంలో అతన్ని పెంచింది. గెనుబతు ఫరో సొంత పిల్లలతో కలిసి పెరిగాడు.
21దావీదు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడని, అతని సేనాధిపతియైన యోవాబు కూడా చనిపోయాడని హదదు ఈజిప్టులో ఉన్నప్పుడు విన్నాడు. అప్పుడు హదదు ఫరోతో, “నా స్వదేశానికి తిరిగి వెళ్లడానికి నన్ను అనుమతించండి” అన్నాడు.
22అందుకు ఫరో, “నా దగ్గర నీకేం తక్కువైందని నీవు నీ స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నావు?” అని అడిగాడు.
అందుకు హదదు, “ఏమీ తక్కువ కాలేదు కాని దయచేసి మీరు నన్ను వెళ్లనివ్వండి” అన్నాడు.
23దేవుడు సొలొమోను మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అనే ఇంకొక విరోధిని లేపారు; ఇతడు తన యజమాని సోబా రాజైన హదదెజెరు నుండి పారిపోయిన వాడు. 24దావీదు సోబా సైన్యాన్ని నిర్మూలం చేసినప్పుడు, రెజోను కొంతమంది తిరుగుబాటుదారుల గుంపు పోగుచేసుకుని వారికి నాయకునిగా ఉన్నాడు; వారు దమస్కుకు వెళ్లి స్థిరపడి, ఆ పట్టణాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నారు. 25హదదు ఇశ్రాయేలుకు చేసిన కీడు కాకుండా సొలొమోను జీవించిన కాలమంతా రెజోను ఇశ్రాయేలుకు శత్రువుగా ఉన్నాడు. రెజోను సిరియాను పరిపాలించాడు, ఇశ్రాయేలును అసహ్యించుకునేవాడు.
సొలొమోనుపై యరొబాము తిరుగుబాటు
26నెబాతు కుమారుడైన యరొబాము కూడా రాజుపై తిరుగుబాటు చేశాడు. అతడు సొలొమోను సేవకులలో ఒకడు, జెరేదా వాడైన ఎఫ్రాయిమీయుడు. అతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు.
27యరొబాము రాజు మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఇది: సొలొమోను మేడలను కట్టించాడు, తన తండ్రి దావీదు పట్టణ ప్రాకారంలో ఉన్న బీటలను బాగుచేయించాడు. 28యరొబాము సమర్థుడు, ఆ యువకుడు మంచిగా పని చేయడాన్ని సొలొమోను చూసి, యోసేపు గోత్రానికి చెందిన ప్రదేశంలో వెట్టి పని చేసేవారిమీద అతన్ని అధికారిగా నియమించాడు.
29ఆ సమయంలో యరొబాము యెరూషలేము విడిచి వెళ్తుండగా, త్రోవలో షిలోహు వాడైన అహీయా ప్రవక్త క్రొత్త వస్త్రం ధరించుకొని అతన్ని కలిశాడు. వారిద్దరు తప్ప ఆ పొలంలో ఇంకెవరు లేరు. 30అప్పుడు అహీయా తాను వేసుకున్న ఆ క్రొత్త వస్త్రాన్ని తీసి పన్నెండు ముక్కలుగా చింపాడు. 31అప్పుడు అతడు యరొబాముతో, “నీవు పది ముక్కలు తీసుకో, ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘సొలొమోను చేతిలో నుండి నేను రాజ్యం చీల్చి పది గోత్రాలు నీకు ఇవ్వబోతున్నాను. 32కాని నా సేవకుడైన దావీదును బట్టి, నా కోసం ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నుండి ఎన్నుకున్న యెరూషలేము పట్టణాన్ని బట్టి అతడు ఒక గోత్రం కలిగి ఉంటాడు. 33నేనిలా చేయడానికి కారణం వారు సొలొమోను తండ్రియైన దావీదులా నా మార్గాలను అనుసరించక నన్ను విడిచిపెట్టి సీదోనీయుల అష్తారోతు దేవతను, మోయాబీయుల కెమోషు దేవున్ని, అమ్మోనీయుల మిల్కోము దేవున్ని పూజిస్తూ, నా దృష్టికి సరియైనది చేయలేదు, నా శాసనాలను నియమాలను పాటించలేదు.
34“ ‘అయితే నేను సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్నంతా తీసివేయను; నా కోసం ఎన్నుకున్న నా సేవకుడు, నా ఆజ్ఞలకు, శాసనాలకు లోబడిన దావీదును బట్టి, సొలొమోనును తన జీవితకాలమంతా పాలకునిగా నియమించాను. 35అతని కుమారుని చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి పది గోత్రాలను నీకు ఇస్తాను. 36నా పేరు అక్కడ ఉండాలని నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణంలో నా సేవకుడైన దావీదు కోసం నా సన్నిధిలో ఒక దీపం ఎల్లప్పుడు ఉండడం కోసం నేను అతని కుమారునికి ఒక గోత్రాన్ని ఇస్తాను. 37నేను నిన్ను అంగీకరించాను కాబట్టి నీవు కోరుకున్న ప్రకారం నీవు పరిపాలిస్తావు ఇశ్రాయేలు మీద రాజుగా ఉంటావు. 38నేను ఆజ్ఞాపించేదంతా నీవు చేసి, నా మార్గాలను అనుసరిస్తే, నా సేవకుడైన దావీదులా నా శాసనాలు ఆజ్ఞలు పాటిస్తూ, నా దృష్టిలో సరియైనది చేస్తే నేను నీతో ఉంటాను. నేను దావీదు పట్ల చేసినట్లు నీ రాజ్యాన్ని స్థిరపరచి నీకు ఇశ్రాయేలును ఇస్తాను. 39వారు చేసిన దానికి నేను దావీదు సంతానాన్ని శిక్షిస్తాను కాని ఎప్పటికి కాదు.’ ”
40సొలొమోను యరొబామును చంపే ప్రయత్నం చేశాడు కాని, యరొబాము ఈజిప్టుకు షీషకు రాజు దగ్గరకు పారిపోయి సొలొమోను చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు.
సొలొమోను మరణం
41సొలొమోను పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన వాటన్నిటి గురించి, అతని జ్ఞానం గురించి సొలొమోను చరిత్ర గ్రంథంలో వ్రాయబడినవి. 42సొలొమోను యెరూషలేములో ఇశ్రాయేలంతటిని నలభై సంవత్సరాలు పరిపాలించాడు. 43తర్వాత సొలొమోను చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని అతని తండ్రి దావీదు పట్టణంలో సమాధి చేశారు. సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 రాజులు 11: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి