1 దినవృత్తాంతములు 21

21
దావీదు యుద్ధవీరులను లెక్కించుట
1సాతాను ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా లేచి, వారి జనాభా లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు. 2కాబట్టి దావీదు యోవాబుతో, సైన్యాధిపతులతో, “మీరు వెళ్లి బెయేర్షేబ నుండి దాను వరకు ఉన్న ఇశ్రాయేలీయులను లెక్కించండి. వారి సంఖ్య నాకు తెలిసేలా ఆ వివరాలు నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు.
3కాని యోవాబు రాజుతో, “యెహోవా తన సైన్యాన్ని వందరెట్లు పెంచు గాక! నా ప్రభువా, రాజా, వారంతా నా ప్రభువుకు సేవకులే కదా? నా ప్రభువు ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? అతడు ఇశ్రాయేలు మీదికి దోషం ఎందుకు తేవాలి?” అని అన్నాడు.
4అయితే రాజు యోవాబుపై తన మాట సాధించుకున్నాడు; కాబట్టి యోవాబు వెళ్లి, ఇశ్రాయేలు దేశమంతా తిరిగి యెరూషలేముకు తిరిగి వచ్చాడు. 5యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య దావీదుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు అంతటిలో కత్తి తిప్పగలవారు పదకొండు లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో నాలుగు లక్షల డెబ్బైవేలమంది ఉన్నారు.
6రాజాజ్ఞ యోవాబుకు అభ్యంతరకరంగా ఉంది కాబట్టి అతడు లేవీ బెన్యామీను వారిని లెక్కలలో చేర్చలేదు. 7ఈ ఆజ్ఞ దేవుని దృష్టిలో కూడా చెడ్డగా ఉంది; కాబట్టి ఆయన ఇశ్రాయేలును శిక్షించారు.
8అప్పుడు దావీదు దేవునితో, “నేను ఇది చేసి ఘోరపాపం చేశాను. మీ సేవకుని దోషాన్ని తొలగించమని బ్రతిమాలుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను” అని ప్రార్థన చేశాడు.
9యెహోవా, దావీదుకు దీర్ఘదర్శిగా ఉన్న గాదుతో ఇలా అన్నారు, 10“వెళ్లి దావీదుతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీకు మూడు ఎంపికలు ఇస్తున్నాను. వాటిలో ఒకదాన్ని ఎంచుకో, దానిని నీమీదికి రప్పిస్తాను.’ ”
11కాబట్టి గాదు దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “యెహోవా చెప్పే మాట ఇదే: ‘వీటిలో ఒకదాన్ని ఎంచుకో: 12మూడు సంవత్సరాల కరువు, మూడు నెలలు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరిమితే వారి ఎదుట నుండి పారిపోవడం, లేదా మూడు రోజులపాటు దేశంలో యెహోవా ఖడ్గం అనగా తెగులు వ్యాపించడం ద్వారా యెహోవా దేవదూత ఇశ్రాయేలీయుల దేశమంతటిని నాశనం చేయడం.’ ఇప్పుడు, నన్ను పంపిన వ్యక్తికి నేనేమి జవాబివ్వాలో నిర్ణయించుకో” అన్నాడు.
13అందుకు దావీదు గాదుతో, “నేను తీవ్ర బాధలో ఉన్నాను. యెహోవా కనికరం ఎంతో గొప్పది కాబట్టి ఆయన చేతిలోనే నేను పడాలి; కాని మనుష్యుల చేతిలో నేను పడకూడదు” అని అన్నాడు.
14కాబట్టి యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు రప్పించారు, డెబ్బైవేలమంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. 15దేవుడు యెరూషలేమును నాశనం చేయడానికి ఒక దూతను పంపారు. అయితే ఆ దూత దానిని నాశనం చేస్తున్నప్పుడు, జరిగిన కీడును చూసి యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను#21:15 ఒర్నాను అరౌనా ఒర్నానుకు మరొక రూపం నూర్పిడి కళ్ళం దగ్గర నిలబడ్డాడు.
16దావీదు పైకి చూసినప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి, కత్తి పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపి ఉంచిన యెహోవా దూత అతనికి కనిపించాడు. అప్పుడు దావీదు, పెద్దలు గోనెపట్ట కట్టుకుని సాష్టాంగపడ్డారు.
17దావీదు దేవునితో, “యుద్ధవీరులను లెక్కించమని ఆదేశించింది నేనే కదా? గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? యెహోవా! నా దేవా, మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి, కాని మీ ప్రజలమీదికి ఈ తెగులు రానివ్వకండి” అన్నాడు.
దావీదు బలిపీఠం కడతాడు
18అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించాలని దావీదుకు చెప్పమని గాదుకు ఆజ్ఞాపించాడు. 19కాబట్టి యెహోవా పేరిట గాదు చెప్పిన మాటకు లోబడి దావీదు బయలుదేరి వెళ్లాడు.
20ఒర్నాను గోధుమలు నూరుస్తున్నప్పుడు, అతడు వెనుకకు తిరిగి ఆ దేవదూతను చూసి అతడు, అతనితో ఉన్న అతని నలుగురు కుమారులు దాక్కున్నారు. 21అప్పుడు దావీదు వస్తూంటే, ఒర్నాను అతన్ని చూసి నూర్పిడి కళ్ళంలో నుండి బయటకు వచ్చి తలను నేలకు వంచి దావీదుకు నమస్కారం చేశాడు.
22దావీదు ఒర్నానుతో, “ప్రజల మీద ఉన్న తెగులు ఆగిపోవడానికి ఈ నూర్పిడి కళ్ళం ఉన్న స్థలంలో నేను యెహోవాకు బలిపీఠం కట్టడానికి పూర్తి ఖరీదుకు దానిని నాకు అమ్ము” అని అన్నాడు.
23అందుకు ఒర్నాను దావీదుతో, “నా ప్రభువా, రాజా తీసుకోండి! మీకు ఏది ఇష్టమో అది చేయండి. చూడండి, దహనబలులకు ఎద్దులు, నూర్చే కర్రలు కట్టెలు, భోజనార్పణ కోసం గోధుమలిస్తాను. ఇదంతా ఇచ్చేస్తాను” అని అన్నాడు.
24అయితే రాజైన దావీదు ఒర్నానుతో, “లేదు, నీకు పూర్తి వెల చెల్లించి కొంటాను. నేను నీ వాటిని యెహోవా కోసం ఉచితంగా తీసుకోను లేదా నాకు ఖర్చు కాని దానితో దహనబలి అర్పించను” అన్నాడు.
25కాబట్టి దావీదు ఆ స్థలానికి ఆరువందల షెకెళ్ళ#21:25 అంటే, సుమారు 6.9 కి. గ్రా. లు బంగారాన్ని ఒర్నానుకు ఇచ్చాడు. 26దావీదు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అప్పుడు అతడు యెహోవాకు ప్రార్థించగా, యెహోవా పరలోకం నుండి బలిపీఠం మీదికి అగ్నిని పంపి అతనికి జవాబిచ్చారు.
27అప్పుడు యెహోవా దూతతో మాట్లాడగా అతడు తన కత్తిని తిరిగి ఒరలో పెట్టాడు. 28ఆ సమయంలో యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవా తనకు జవాబిచ్చాడని గ్రహించి దావీదు అక్కడ బలులర్పించాడు. 29మోషే అరణ్యంలో చేయించిన యెహోవా సమావేశ గుడారం, దహనబలి బలిపీఠం ఆ కాలంలో గిబియోనులోని ఎత్తైన స్థలంలో ఉన్నాయి. 30అయితే దావీదు యెహోవా దూత యొక్క ఖడ్గానికి భయపడి, దేవుని దగ్గర విచారణ చేయడానికి ఆ స్థలానికి వెళ్లలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 దినవృత్తాంతములు 21: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి