1 దినవృత్తాంతములు 21:17-26

1 దినవృత్తాంతములు 21:17-26 OTSA

దావీదు దేవునితో, “యుద్ధవీరులను లెక్కించమని ఆదేశించింది నేనే కదా? గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? యెహోవా! నా దేవా, మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి, కాని మీ ప్రజలమీదికి ఈ తెగులు రానివ్వకండి” అన్నాడు. అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించాలని దావీదుకు చెప్పమని గాదుకు ఆజ్ఞాపించాడు. కాబట్టి యెహోవా పేరిట గాదు చెప్పిన మాటకు లోబడి దావీదు బయలుదేరి వెళ్లాడు. ఒర్నాను గోధుమలు నూరుస్తున్నప్పుడు, అతడు వెనుకకు తిరిగి ఆ దేవదూతను చూసి అతడు, అతనితో ఉన్న అతని నలుగురు కుమారులు దాక్కున్నారు. అప్పుడు దావీదు వస్తూంటే, ఒర్నాను అతన్ని చూసి నూర్పిడి కళ్ళంలో నుండి బయటకు వచ్చి తలను నేలకు వంచి దావీదుకు నమస్కారం చేశాడు. దావీదు ఒర్నానుతో, “ప్రజల మీద ఉన్న తెగులు ఆగిపోవడానికి ఈ నూర్పిడి కళ్ళం ఉన్న స్థలంలో నేను యెహోవాకు బలిపీఠం కట్టడానికి పూర్తి ఖరీదుకు దానిని నాకు అమ్ము” అని అన్నాడు. అందుకు ఒర్నాను దావీదుతో, “నా ప్రభువా, రాజా తీసుకోండి! మీకు ఏది ఇష్టమో అది చేయండి. చూడండి, దహనబలులకు ఎద్దులు, నూర్చే కర్రలు కట్టెలు, భోజనార్పణ కోసం గోధుమలిస్తాను. ఇదంతా ఇచ్చేస్తాను” అని అన్నాడు. అయితే రాజైన దావీదు ఒర్నానుతో, “లేదు, నీకు పూర్తి వెల చెల్లించి కొంటాను. నేను నీ వాటిని యెహోవా కోసం ఉచితంగా తీసుకోను లేదా నాకు ఖర్చు కాని దానితో దహనబలి అర్పించను” అన్నాడు. కాబట్టి దావీదు ఆ స్థలానికి ఆరువందల షెకెళ్ళ బంగారాన్ని ఒర్నానుకు ఇచ్చాడు. దావీదు అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దహనబలులు సమాధానబలులు అర్పించాడు. అప్పుడు అతడు యెహోవాకు ప్రార్థించగా, యెహోవా పరలోకం నుండి బలిపీఠం మీదికి అగ్నిని పంపి అతనికి జవాబిచ్చారు.