1 దినవృత్తాంతములు 19

19
దావీదు అమ్మోనీయులను ఓడించుట
1కొంతకాలం తర్వాత అమ్మోనీయుల రాజు నాహాషు చనిపోయాడు, అతని స్థానంలో అతని కుమారుడు రాజయ్యాడు. 2అప్పుడు దావీదు, “హానూను తండ్రియైన నాహాషు నా మీద దయ చూపించాడు కాబట్టి నేను హామాను మీద దయ చూపిస్తాను” అని అనుకున్నాడు. కాబట్టి అతని తండ్రి విషయంలో తన సానుభూతి తెలుపడానికి దావీదు తన ప్రతినిధులను పంపించాడు.
దావీదు దూతలు అతనికి సానుభూతి తెలుపడానికి అమ్మోనీయుల దేశంలో ఉన్న హానూను దగ్గరకు వచ్చినప్పుడు, 3అమ్మోనీయుల దళాధిపతులు హానూనుతో, “నీ తండ్రిని గౌరవించడానికి నీకు సానుభూతి తెలుపాలని దావీదు దూతలను పంపాడని అనుకుంటున్నావా? అతని దూతలు ఈ దేశాన్ని జయించడానికి గూఢాచారులుగా రాలేదా?” అన్నారు. 4అందువల్ల హానూను దావీదు దూతలను పట్టుకుని వారి జుట్టు గొరిగించి, పిరుదుల దగ్గర వారి వస్త్రాలు కత్తిరించి పంపించేశాడు.
5కొంతమంది, ఆ మనుష్యుల సంగతి దావీదుకు చెప్పినప్పుడు, వారు చాలా అవమానించబడినట్లు గ్రహించిన రాజు వారి దగ్గరకు మనుష్యులను పంపి, “మీ గడ్డాలు పెరిగే వరకు యెరికో పట్టణంలో ఉండి, ఆ తర్వాత రండి” అని చెప్పాడు.
6దావీదుకు తాము కోపం తెప్పించామని అమ్మోనీయులు గ్రహించి, హానూను అమ్మోనీయులు వేయి తలాంతుల#19:6 అంటే, సుమారు 38 టన్నుల వెండిని పంపి అరాము నహరయీము#19:6 అంటే, వాయువ్య మెసొపొటేమియా నుండి, అరాము మయకా నుండి, సోబా నుండి రథాలను, రథసారధులను కిరాయికి తీసుకున్నారు. 7వారు 32,000 రథాలను, రథసారధులను, మయకా రాజును, అతని సైన్యాన్ని కిరాయికి తీసుకున్నారు. వారు మెదెబా దగ్గరలో శిబిరం ఏర్పరచుకున్నారు, ఆ సమయంలో అమ్మోనీయులు తమ పట్టణాల నుండి సమకూడి యుద్ధం చేయడానికి వెళ్లారు.
8ఇది విన్న దావీదు యోవాబును యుద్ధ సైనికులందరితో సహా పంపించాడు. 9అమ్మోనీయులు బయటకు వచ్చి తమ పట్టణ ద్వారం దగ్గర యుద్ధ పంక్తులు తీర్చారు. అక్కడికి వచ్చిన రాజులు విడిగా పొలాల్లో ఉన్నారు.
10యోవాబు తన ముందు వెనుకా యుద్ధ పంక్తులు ఉండడం చూశాడు; ఇశ్రాయేలులో కొందరు అత్యుత్తమ దళాలను ఎంపికచేసి, వారిని అరామీయులకు ఎదురుగా మోహరించాడు. 11మిగిలిన వారిని తన సోదరుడైన అబీషై ఆధీనంలో ఉంచాడు, వారిని అమ్మోనీయులకు ఎదురుగా మోహరించాడు. 12యోవాబు, “అరామీయులను ఎదుర్కోవడం నాకు కష్టమైనప్పుడు నన్ను రక్షించడానికి నీవు రావాలి; అమ్మోనీయులను ఎదుర్కోవడం నీకు కష్టమైనప్పుడు నిన్ను నేను రక్షిస్తాను. 13ధైర్యంగా ఉండు, మన ప్రజల కోసం, మన దేవుని పట్టణాల కోసం ధైర్యంగా పోరాడదాం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తారు” అని అబీషైతో చెప్పాడు.
14అప్పుడు యోవాబు అతనితో ఉన్న దళాలు అరామీయులతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్లగా, అతన్ని ఎదుర్కోలేక వారు పారిపోయారు. 15అరామీయులు పారిపోయారని గ్రహించిన అమ్మోనీయులు కూడా యోవాబు సోదరుడైన అబీషై ఎదుట నుండి పారిపోయి పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
16తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని గ్రహించిన అరామీయులు దూతలను పంపి, యూఫ్రటీసు నది అవతల ఉన్న అరామీయులను పిలిపించారు. హదదెజెరు సేనాధిపతియైన షోఫకు వారిని నడిపించాడు.
17దావీదుకు ఈ సంగతి తెలిసినప్పుడు, అతడు ఇశ్రాయేలు అంతటిని సమకూర్చి యొర్దాను నది దాటి వెళ్లాడు; వారికి ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాడు. దావీదు అరామీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు ఏర్పరిచాక వారు అతనితో యుద్ధం చేశారు. 18అయితే అరామీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోయారు. దావీదు వారిలో 7,000 మంది రథసారధులను 40,000 సైనికులను చంపాడు. అలాగే వారి సైన్యాధిపతియైన షోఫకును కూడా చంపాడు.
19హదదెజెరు సేవకులు తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతున్నామని గ్రహించి దావీదుతో సమాధానపడి అతనికి లొంగిపోయారు.
అప్పటినుండి ఇంకెప్పుడు అరామీయులు అమ్మోనీయులకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 దినవృత్తాంతములు 19: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి