యోవాబు సోదరుడైన అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడువందల మందిని చంపాడు కాబట్టి అతడు ఆ ముగ్గురిలా ప్రసిద్ధి పొందాడు. అతడు ఆ ముగ్గురికంటే రెండింతలు గౌరవించబడి వారి దళాధిపతి అయ్యాడు కాని వారిలో ఒకనిగా చేర్చబడలేదు.
గొప్ప పోరాట వీరుడు, కబ్సెయేలుకు చెందిన యెహోయాదా కుమారుడైన బెనాయా గొప్ప సాహస కార్యాలను చేశాడు. అతడు మోయాబు యొక్క పరాక్రమశాలులైన ఇద్దరిని చంపాడు. అంతేకాక, మంచుపడే కాలంలో ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు. అతడు అయిదు మూరల ఎత్తున్న ఈజిప్టు వానిని చంపాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో నేతపనివాని కర్రలాంటి ఈటె ఉన్నప్పటికీ, బెనాయా దుడ్డుకర్ర పట్టుకుని వాని మీదికి పోయాడు. ఆ ఈజిప్టు వాని చేతిలో ఉన్న ఈటెను లాక్కుని దానితోనే అతన్ని చంపాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా సాహస కార్యాలు ఇలాంటివి; అతడు కూడా ఆ ముగ్గురు గొప్ప యోధులతో పాటు ప్రసిద్ధి పొందాడు. ఆ ముప్పైమందిలో ఘనతకెక్కాడు గాని, ఆ ముగ్గురి జాబితాలో చేర్చబడలేదు. దావీదు అతన్ని తన అంగరక్షకుల నాయకునిగా నియమించాడు.
పరాక్రమముగల బలాఢ్యులు వీరే:
యోవాబు తమ్ముడైన అశాహేలు,
బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను,
హరోరీయుడైన షమ్మోతు,
పెలోనీయుడైన హేలెస్సు,
తెకోవాకు చెందిన ఇక్కేషు కుమారుడైన ఈరా,
అనాతోతుకు చెందిన అబీయెజెరు,
హుషాతీయుడైన సిబ్బెకై,
అహోహీయుడైన ఈలై,
నెటోపాతీయుడైన మహరై,
నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు,
బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి,
పిరాతోనీయుడైన బెనాయా,
గాయషు కనుమలకు చెందిన హూరై,
అర్బాతీయుడైన అబీయేలు,
బహరూమీయుడైన అజ్మావెతు,
షయల్బోనీయుడైన ఎల్యహ్బా,
గిజోనీయుడైన హాషేము కుమారులు,
హరారీయుడైన షాగే కుమారుడైన యోనాతాను,
హరారీయుడైన శాకారు కుమారుడైన అహీయాము,
ఊరు కుమారుడైన ఎలీపాలు,
మెకేరాతీయుడైన హెఫెరు,
పెలోనీయుడైన అహీయా,
కర్మెలీయుడైన హెజ్రో,
ఎజ్బయి కుమారుడైన నయరై,
నాతాను సోదరుడైన యోవేలు,
హగ్రీ కుమారుడైన మిబ్హారు,
అమ్మోనీయుడైన జెలెకు,
బెయేరోతీయుడైన నహరై, ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు,
ఇత్రీయుడైన ఈరా,
ఇత్రీయుడైన గారేబు,
హిత్తీయుడైన ఊరియా,
అహ్లయి కుమారుడైన జాబాదు,
రూబేనీయుడైన షీజా కుమారుడు రూబేనీయులకు పెద్దయైన అదీనా, అతనితో ఉన్న ముప్పైమంది,
మయకా కుమారుడైన హానాను,
మిత్నీయుడైన యెహోషాపాతు,
ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా,
అరోయేరీయుడైన హోతాము కుమారులైన షామా, యెహీయేలు,
షిమ్రీ కుమారుడైన యెదీయవేలు,
అతని సోదరుడు తిజీయుడైన యోహా,
మహవీయుడైన ఎలీయేలు,
ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా,
మోయాబీయుడైన ఇత్మా,
ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా వాడైన యయశీయేలు.