తీతు పత్రిక 1
1
1దేవుని దాసుడును యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడనైన పౌలు అనే నేను దేవుడు ఏర్పరచుకున్నవారికి విశ్వాసాన్ని ప్రకటించడానికి, దైవిక జీవితాలను ఎలా జీవించాలో వారికి చూపించే సత్యాన్ని తెలుసుకోవడం నేర్పడానికి, 2ఈ సత్యం వారికి అబద్ధమాడని దేవుడు యుగయుగాలకు ముందే వాగ్దానం చేసిన నిత్యజీవాన్ని గురించిన నిరీక్షణతో, 3ఆ నిత్యజీవం గురించి అబద్ధమాడని దేవుడు సృష్టి ఆరంభానికి ముందే వాగ్దానం చేశాడు.
4విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు, తీతుకు:
మన తండ్రియైన దేవుని నుండి, రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపా సమాధానాలు కలుగును గాక.
మంచిని ప్రేమించేవారిని సంఘపెద్దలుగా నియమించుట
5నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఇంకా పూర్తి చేయవలసిన వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలో సంఘ పెద్దలను నియమించు. 6ఒక సంఘపెద్ద నిందారహితునిగా, తన భార్యకు నమ్మకమైనవానిగా ఉండాలి, అతని పిల్లలు విశ్వాసం కలవారిగా ఉండి, దుష్టమైన పనులు చేశారని అవిధేయులు అనే నిందలేనివారిగా ఉండాలి. 7సంఘపెద్ద దేవుని కుటుంబాన్ని నడిపిస్తాడు కాబట్టి, అతడు నిందారహితునిగా ఉండాలి, అయితే అహంకారిగా, త్వరగా కోప్పడేవానిగా, త్రాగుబోతుగా, దౌర్జన్యం చేసేవానిగా, అక్రమ సంపాదన ఆశించేవానిగా ఉండకూడదు. 8దానికి బదులు, అతడు ఆతిథ్యాన్ని ఇచ్చేవానిగా, మంచిని ప్రేమించేవానిగా, స్వీయ నియంత్రణ కలవానిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, క్రమశిక్షణ కలవాడై ఉండాలి. 9బోధించబడిన రీతిలో ఈ నమ్మకమైన వాక్యాన్ని అతడు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అతడు తాను నేర్చుకున్న సత్య బోధతో ఇతరులను ప్రోత్సాహించి దానిని వ్యతిరేకించే వారిని ఖండించగలడు.
మంచి చేయడంలో విఫలమైన వారిని గద్దించుట
10ఎందుకంటే మీలో అనేకమంది, ముఖ్యంగా సున్నతి పొందినవారిలో కొందరు, తిరుగుబాటు స్వభావం కలిగి, అర్థంలేని మాటలు మాట్లాడేవారిగా, మోసగించేవారిగా ఉన్నారు. 11వారి నోళ్ళు ఖచ్చితంగా మూయించాలి, ఎందుకంటే వారు తమ అవినీతి సంపాదన కోసం బోధించకూడని తప్పుడు బోధలు చేస్తూ, కుటుంబాలన్నిటిని చెడగొడుతున్నారు. 12క్రేతు ప్రవక్తల్లో ఒకడు తన సొంత ప్రజల గురించి చెప్తూ, “క్రేతు దేశస్థులు ఎప్పుడు అబద్ధికులుగా, క్రూరులుగా, సోమరులుగా, తిండిబోతులుగా ఉన్నారు” అన్నాడు. 13వారి గురించి అతడు చెప్పింది సత్యమే. కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండేలా, 14యూదుల కట్టుకథలను లేదా సత్యాన్ని తిరస్కరించిన మనుష్యుల ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా నీవు వారిని తీవ్రంగా గద్దించు. 15ఎందుకంటే, పవిత్రులకు అన్ని పవిత్రంగానే ఉంటాయి కాని, నమ్మనివారికి, చెడిపోయినవారికి ఏది పవిత్రంగా ఉండదు. నిజానికి అలాంటివారి మనస్సులు, మనస్సాక్షి కూడా చెడిపోయాయి. 16వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నప్పటికి, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
తీతు పత్రిక 1: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.