పరమ 8
8
1ఒకవేళ నీవు నాకు సోదరుడిలా ఉంటే,
నా తల్లి స్తనముల దగ్గర పెంచబడిన వాడవైయుంటే!
అప్పుడు, నేను నిన్ను బయట కనుగొని ఉంటే,
నిన్ను ముద్దాడేదాన్ని,
నన్ను ఎవరూ నిందించేవారు కారు.
2నేను నిన్ను తోలుకొని
నాకు ఉపదేశం చేసిన,
నా తల్లి ఇంటికి తీసుకెళ్లేదాన్ని.
నీవు త్రాగడానికి నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసాన్ని,
దానిమ్మపండ్ల మకరందం ఇచ్చేదాన్ని.
3ఆయన ఎడమ చేయి నా తల క్రింద ఉంచాడు,
కుడిచేతితో నన్ను కౌగిలించుకున్నాడు.
4యెరూషలేము కుమార్తెలారా! మీతో ప్రమాణము చేయిస్తున్నాను:
సరియైన సమయం వచ్చేవరకు
ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.
చెలికత్తెలు
5తన ప్రియుని ఆనుకుని
అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు?
యువకుడు
ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను;
అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది,
అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది.
6నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా,
మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో;
ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది,
దాని అసూయ సమాధిలా క్రూరమైనది.
ఇది మండుతున్న అగ్నిలా,
శక్తివంతమైన మంటలా#8:6 లేదా యెహోవా యొక్క మంటలా కాలుతుంది.
7పెరుగుతున్న జలాలు ప్రేమను అణచివేయలేవు;
నదీజలాలు ప్రేమను తుడిచివేయలేవు.
ప్రేమకు ప్రతిగా
తనకున్నదంతా ఇచ్చినా,
దానికి#8:7 లేదా అతడు తిరస్కారమే లభిస్తుంది.
చెలికత్తెలు
8మాకో చిన్న చెల్లెలుంది,
దానికింకా స్తనములు రాలేదు.
దానికి పెళ్ళి నిశ్చయమైతే
ఏం చేయాలి?
9ఒకవేళ ఆమె ప్రాకారమైతే,
ఆమెపై మేము వెండి గోపురం కట్టిస్తాము.
ఒకవేళ ఆమె ద్వారం అయితే,
దేవదారు పలకలతో దానికి భద్రత ఏర్పరుస్తాము.
యువతి
10నేను ప్రాకారాన్ని,
నా స్తనములు గోపురాల్లాంటివి.
అందుకే అతని దృష్టికి
క్షేమం పొందదగినదానిగా ఉన్నాను.
11బయల్-హామోను దగ్గర సొలొమోనుకు ద్రాక్షతోట ఉంది;
అతడు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చాడు.
దాని ఫలానికి ఒక్కొక్కడు
వెయ్యి వెండి షెకెళ్ళ#8:11 అది సుమారు 12 కి. గ్రా. లు; పరమ 8:12 కూడా శిస్తు చెల్లించాలి.
12కాని, నా ద్రాక్షవనం నా స్వాధీనంలోనే ఉంది;
సొలొమోను రాజా, నీ వెయ్యి షెకెళ్ళు నీకే చెందుతాయి.
వాటిని చూసుకునే వారికి రెండువందలు షెకెళ్ళు#8:12 అంటే, సుమారు 2.3 కి. గ్రా. లు గిట్టుతాయి.
యువకుడు
13ఉద్యానవనాల్లో నివసించేదానా
నీ చెలికత్తెలు నీతో ఉండగా,
నీ స్వరం విననివ్వు.
యువతి
14నా ప్రియుడా, దూరంగా రా,
జింకలా, దుప్పిలా
పరిమళముల పర్వతాల మీదుగా
గంతులు వేస్తూ రా.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
పరమ 8: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.