ప్రకటన 5
5
గ్రంథపు చుట్ట మరియు గొర్రెపిల్ల
1అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని కుడిచేతిలో ఇరువైపుల వ్రాయబడి ఏడు ముద్రలతో ముద్రించబడి ఉన్న ఒక గ్రంథపు చుట్టను నేను చూసాను. 2అప్పుడు ఒక శక్తిగల దేవదూత బిగ్గరగా, “చుట్టబడి ఉన్న ఈ ముద్రలను విప్పి గ్రంథపు చుట్టను తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని ప్రకటన చేస్తుంటే నేను చూసాను. 3అయితే పరలోకంలో కాని, భూమి మీద కాని, భూమి క్రింద కాని ఉన్నవారిలో కాని ఎవరూ ఆ గ్రంథపు చుట్టను విప్పలేకపోయారు, కనీసం దానిలోనికి చూడలేకపోయారు. 4ఆ గ్రంథపు చుట్టను తెరవడానికి కాని దాని లోపలకి చూడడానికి కాని సామర్ధ్యం గలవారు ఎవరూ లేరని నేను చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు, 5పెద్దలలో ఒకరు నాతో, “ఏడ్వకు, ఇదిగో, దావీదు వేరు నుండి వచ్చిన యూదా గోత్రపు సింహం జయాన్ని పొందాడు. ఆయనే ఆ ఏడు ముద్రలను విప్పి ఆ గ్రంథపు చుట్టను తెరవగలవాడు” అన్నాడు.
6అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూసాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు.#5:6 అంటే, ఏడంతల ఆత్మ 7ఆ గొర్రెపిల్ల, సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని దగ్గరకు వెళ్ళి అతని కుడిచేతిలో ఉన్న ఆ గ్రంథపు చుట్టను తీసుకొన్నాడు. 8ఆయన ఆ గ్రంథపు చుట్టను తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులు, ఆ ఇరవైనలుగురు పెద్దలు వధించబడిన ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరు తంతి వీణెను పరిశుద్ధుల ప్రార్థనలనే ధూపంతో నిండిన బంగారు గిన్నెలను పట్టుకొన్నారు. 9వారు ఒక క్రొత్త పాటను పాడారు,
“చుట్టబడి ఉన్న ఆ గ్రంథపు చుట్టను తీసుకొని,
దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు!
ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి,
ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను,
దేవుని కొరకు విడిపించడానికి నీవు వధింపబడి నీ రక్తంతో కొన్నావు.
10నీవు వారిని దేవుని సేవించే యాజకపు రాజ్యంగా,
భూమిని పరిపాలించడానికి వారిని నియమించావు.”
11అప్పుడు నేను చూస్తూ వుండగా, సింహాసనం చుట్టూ ఉన్న నాలుగు ప్రాణుల మరియు పెద్దల చుట్టూ ఉన్న వేలాదివేల కోటానుకోట్ల దేవదూతల స్వరం నాకు వినబడింది. 12వారు పెద్ద స్వరంతో,
“శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం,
గౌరవం, మహిమ, స్తుతులను పొందడానికి
యోగ్యుడు వధింపబడిన గొర్రెపిల్లయే!”
అని చెప్తున్నారు.
13అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టింపబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను:
“సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వానికి, వధించబడిన గొర్రెపిల్లకు
కీర్తి, గౌరవం, మహిమ, ప్రభావం,
నిరంతరం కలుగును గాక!”
14ఆ నాలుగు ప్రాణులు “ఆమేన్” అని చెప్పాయి, అప్పుడు ఆ పెద్దలందరు సాగిలపడి ఆరాధించారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ప్రకటన 5: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.