ప్రకటన 14
14
గొర్రెపిల్ల మరియు 1,44,000
1ఆ తరువాత నాయెదుట సీయోను పర్వతం మీద వధింపబడిన గొర్రెపిల్ల, ఆయనతో 1,44,000 మంది తమ నుదుటి మీద ఆయన పేరును ఆయన తండ్రి పేరును వ్రాయబడినవారు నిలబడి ఉండడం చూసాను. 2అప్పుడు నేను పరలోకం నుండి ప్రవాహ జలాల ధ్వనిలా, గొప్ప ఉరుములా ఒక శబ్దాన్ని విన్నాను. అది నాకు వీణ వాయిద్యకారులు తమ వాయిద్యాలను వాయిస్తున్న ధ్వనిలా వినిపించింది 3వారు సింహాసనం ముందు, నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచన పొందిన ఈ 1,44,000 మంది తప్ప ఆ పాటను ఎవరు నేర్చుకోలేక పోయారు. 4వీరు, ఏ స్త్రీతో తమను అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా జీవించారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు దాన్ని అనుసరించారు. వారు మానవుల నుండి దేవునికి, గొర్రెపిల్లకు తొలిఫలంగా అర్పించడానికి కొనబడ్డవారు. 5వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు.
ముగ్గురు దేవదూతలు
6ఆ తరువాత నేను ఇంకొక దేవదూత ఆకాశం మధ్య ఎగిరివెళ్ళుతూ భూమి మీద జీవిస్తున్న ప్రతి దేశానికి, ప్రతి జాతి వారికి, ప్రతి భాష మాట్లాడేవారికి, ప్రతి జనులకు శాశ్వతమైన సువార్తను ప్రకటించడాన్ని చూసాను. 7అతడు పెద్ద స్వరంతో, “దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించండి! ఎందుకంటే ఆయన తీర్పుతీర్చే ఘడియ వచ్చింది! ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని నీటి ఊటలను సృష్టించిన దేవుని ఆరాధించండి!” అని చెప్పాడు.
8రెండవ దేవదూత అతని వెంబడించి, “ ‘కూలిపోయింది! బబులోను మహా పట్టణం కూలిపోయింది!’#14:8 యెషయా 21:9 అది తన వ్యభిచార మద్యాన్ని అన్ని దేశాలకు త్రాగించింది” అని చెప్పాడు.
9మూడవ దేవదూత వారిని వెంబడించి పెద్ద స్వరంతో, “మృగం దాని విగ్రహాన్ని పూజించి, తమ నుదుటి మీద లేక చేతి మీద దాని ముద్ర వేయించుకొంటే, 10వారు ఏమి కలపకుండా దేవుని ఉగ్రతాపాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యాన్ని త్రాగుతారు. పవిత్ర దేవదూతల యెదుట వధించబడిన గొర్రెపిల్ల సన్నిధిలో అగ్ని గంధకంతో వేధించబడుతారు. 11ఆ మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించిన లేక దాని పేరు ముద్రను వేయించుకొన్నవారు విశ్రాంతి లేకుండా రాత్రింబగళ్లు వేదన పొందుతారు. ఆ వేదన పొగ ఎల్లప్పుడు లేస్తూనే ఉంటుంది” అని బిగ్గరగా చెప్పాడు. 12అందుకే దేవుని ప్రజలు యేసుక్రీస్తుకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నవారు సహనంతో ఆ హింసలను భరించాలి.
13అప్పడు పరలోకం నుండి ఒక స్వరం, ఈ విషయాన్ని వ్రాసి పెట్టు: “ఇప్పటి నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు!” అని చెప్పింది.
దేవుని ఆత్మ, “అవును నిజమే, వారు ప్రయాసం నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.
భూమిపై పంటను కోయుట మరియు ద్రాక్ష గానుగ త్రొక్కుట
14నేను చూస్తుండగా ఒక తెల్లని మేఘం మీద మనుష్యకుమారునిలా#14:14 దాని 7:13 ఉన్న ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు తన తల మీద బంగారు కిరీటాన్ని ధరించి చేతిలో పదునైన కొడవలిని పట్టుకుని ఉన్నాడు. 15అప్పుడు మరొక దేవదూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘం మీద కూర్చున్న వానితో, “భూమి మీద పంట పూర్తిగా పండి పోయింది కనుక నీ కొడవలి తీసుకొని పండిన పంటను కోయుము, ఎందుకంటే పంటకోసే కోతకాలం వచ్చింది” అని బిగ్గరగా చెప్పాడు. 16కనుక మేఘం మీద కూర్చున్న వాడు తన కొడవలిని భూమి మీద తిప్పగానే భూమి పంటంతా కోయబడింది.
17మరొక దేవదూత పరలోక దేవాలయంలో నుండి బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా పదునైన కొడవలి ఉండింది. 18మరో దేవదూత బలిపీఠం నుండి వచ్చాడు. అతనికి బలిపీఠం మీద ఉన్న అగ్నిపై అధికారం ఉంది. అతడు పదునైన కొడవలి గలవానితో బిగ్గరగా, “భూమి మీద ఉన్న ద్రాక్షపండ్లు పండిపోయాయి గనుక నీ పదునైన కొడవలితో ద్రాక్షపండ్ల గుత్తులను కోయుము” అని చెప్పాడు. 19అప్పడు ఆ దేవదూత తన కొడవలిని భూమి మీద తిప్పి ద్రాక్షపండ్లను కోసి దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేసాడు. 20ఆ ద్రాక్ష గానుగ పట్టణానికి బయట ఉంది. అక్కడ ద్రాక్షపండ్లను త్రొక్కడంతో ఆ ద్రాక్ష గానుగ నుండి 1,600 స్టాడియా#14:20 సుమారు మూడువందల కిలోమీటర్లు దూరం వరకు గుర్రాల కళ్ళెములంత ఎత్తులో ఆ రక్తం నదిలా ప్రవహించింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ప్రకటన 14: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.