ప్రకటన 11
11
ఇద్దరు సాక్షులు
1అప్పుడు ఒక దేవదూత నా చేతికి కొలత చూసే కర్రను ఇచ్చి నాతో, “లేచి, దేవుని ఆలయాన్ని, బలిపీఠాన్ని కొలిచి, ఆరాధిస్తున్నవారి సంఖ్యను లెక్కించు, 2అయితే మందిరపు బయటి ఆవరణాన్ని కొలత తీసుకోకుండా విడిచిపెట్టాలి, ఎందుకంటే అది యూదేతరులకు ఇవ్వబడింది. వారు పరిశుద్ధ పట్టణాన్ని 42 నెలలు అణగద్రొక్కుతారు. 31,260 రోజులు గోనెపట్టను ధరించుకొని ప్రవచించడానికి నా ఇద్దరు సాక్షులను నేను నియమిస్తున్నాను” అని చెప్పాడు. 4వారు “రెండు ఒలీవ చెట్లు” రెండు దీపస్తంభాలుగా ఉన్నారు; “వారు భూలోకానికి ప్రభువైనవాని యెదుట నిలబడి వున్నారు.”#11:4 జెకర్యా 4:3,11,14 5ఎవరైనా వారికి హాని చేయాలని ప్రయత్నిస్తే, వారి నోటి నుండి అగ్ని వచ్చి వారి శత్రువులను దహించి వేస్తుంది. కనుక వీరికి హాని చేయాలనుకునేవారు ఇలా చావాల్సిందే. 6వారు ప్రవచించే రోజుల్లో భూమి మీద వాన కురవకుండా ఆకాశాన్ని మూయగలిగే అధికారం వారికి ఉంది. అలాగే వారికి కావలసినప్పుడెల్లా నీటిని రక్తంగా మార్చి, అన్ని రకాల వ్యాధులతో భూమిని బాధించడానికి అధికారం వారికి ఉంది.
7ఆ ఇద్దరు సాక్షులు సాక్ష్యం ఇవ్వడం పూర్తి చేసిన తరువాత, అగాధం నుండి ఒక మృగం వారి మీద యుద్ధం చేసి వారిని ఓడించి చంపుతుంది. 8వారి మృతదేహాలు ఆ గొప్ప పట్టణపు వీధిలో పడి ఉంటాయి. ఆ పట్టణం ఉపమానరీతిలో సొదొమ లేక ఐగుప్తు అని పిలువబడుతుంది. వారి ప్రభువు కూడా సిలువ వేయబడింది అక్కడే. 9మూడున్నర రోజుల వరకు ప్రజలలో ప్రతి గోత్రం వారు, ప్రతి భాష వారు, ప్రతి జాతి వారు వీరి శవాలను చూస్తారు, వాటిని సమాధి చేయనివ్వరు. 10ఆ ఇద్దరు ప్రవక్తలు భూమి మీద జీవించే వారిని వేధించారు కనుక భూనివాసులందరు వారి చావును బట్టి సంతోష సంబరాలు జరుపుకొంటూ ఒకరికొకరు బహుమానాలు ఇచ్చిపుచ్చుకొంటారు.
11కానీ మూడున్నర రోజుల తరువాత దేవుని నుండి జీవవాయువు#11:11 యెహె 37:5,14 వారిలోనికి ప్రవేశించి వారు తమ కాళ్ళ మీద లేచి నిలబడినప్పుడు వారిని చూసిన వారందరికి విపరీతమైన భయం కలిగింది. 12అప్పుడు పరలోకం నుండి ఒక గొప్ప స్వరం వారితో, “ఇక్కడికి ఎక్కి రండి!” అని చెప్పడం ఆ సాక్షులు విన్నారు. అప్పుడు వారి శత్రువులు వారిని చూస్తూ ఉండగానే వారు ఒక మేఘం మీద పరలోకానికి ఎక్కివెళ్ళిపోయారు.
13సరిగ్గా అదే గంటలో ఒక పెద్ద భూకంపం వచ్చి ఆ పట్టణ పదవ భాగం కూలిపోయింది. ఏడు వేలమంది ప్రజలు చనిపోయారు, అయితే మిగిలిన వారికి భయం కలిగి పరలోకం నుండి పరిపాలిస్తున్న దేవుని మహిమపరిచారు.
14రెండవ విపత్తు ముగిసింది. మూడవ విపత్తు అతిత్వరలో రానుంది.
ఏడవ బూర
15ఏడవ దేవదూత తన బూరను ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు, ఇలా చెప్పడం వినిపించింది,
“భూలోక రాజ్యం
ప్రభు రాజ్యంగా ఆయన క్రీస్తు రాజ్యంగా మారాయి
కనుక ఆయన ఎల్లకాలం పరిపాలిస్తాడని.”
16అప్పుడు, దేవుని సన్నిధిలో తమ సింహాసనాల మీద కూర్చుని ఉన్న ఆ ఇరవైనలుగురు పెద్దలు సాగిలపడి ఇలా దేవుని ఆరాధించారు,
17“ఉన్నవాడు, ఉండినవాడు
అయిన సర్వశక్తిగల ప్రభువైన దేవా,
నీ మహాశక్తిని బట్టి నీవు పరిపాలిస్తున్నావు,
గనుక మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం.
18దేశాలు కోపగించినందుకు
నీ ఉగ్రత వచ్చింది.
ఇక చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికి,
సేవకులైన ప్రవక్తలకు,
నీ నామాన్ని గౌరవించే నీ ప్రజలకు
అల్పులైనా ఘనులైనా నీ ప్రజలకు
ప్రతిఫలాన్ని ఇవ్వడానికి,
భూమిని నాశనం చేసేవారిని
నాశనం చేయడానికి సమయం వచ్చింది.”
19అప్పడు పరలోకంలోని దేవాలయం తెరచుకొంది, దేవుని నిబంధన మందసము ఆయన దేవాలయంలో కనిపించింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపం, తీవ్రమైన వడగండ్ల వాన వచ్చాయి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ప్రకటన 11: TCV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.