కీర్తనలు 89:19-29

కీర్తనలు 89:19-29 TSA

ఒకనాడు మీరు దర్శనంలో మాట్లాడుతూ, మీకు నమ్మకమైన వారితో మీరిలా అన్నారు: “నేను వీరుడికి సాయం చేశాను. ఒక యువకుడిని ప్రజల్లో నుండి లేవనెత్తాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను; నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను. అతనికి నా చేయి తోడుగా ఉంది; నా బాహువు అతన్ని బలపరుస్తుంది. శత్రువు అతని నుండి పన్ను వసూలు చేయలేడు; దుష్టులు అతన్ని అణచివేయలేరు. అతని ఎదుటనే అతని పగవారిని పడగొడతాను, అతన్ని ద్వేషించేవారిని మొత్తుతాను. నా నమ్మకత్వం నా మారని ప్రేమ అతనితో ఉంటాయి, నా నామాన్ని బట్టి అతని కొమ్ము హెచ్చంపబడుతుంది. నేను అతని చేతిని సముద్రం మీద, అతని కుడి హస్తాన్ని నదుల మీద ఉంచుతాను. ‘మీరు నా తండ్రి, నా దేవుడు నా కొండ, నా రక్షకుడు’ అని అతడు నాకు మొరపెడతాడు. అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చూసుకుంటాను, భూరాజులందరిలో అతన్ని మహా ఉన్నతమైనవానిగా చేస్తాను. నేను అతని పట్ల నా మారని ప్రేమను నిత్యం కొనసాగిస్తాను, అతనితో నా నిబంధన స్థిరమైనది. అతని వంశాన్ని నిత్యం స్థాపిస్తాను, అతని సింహాసనం ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది.