కీర్తనలు 71
71
కీర్తన 71
1యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను;
నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి.
2మీ నీతిని బట్టి నన్ను రక్షించి విడిపించండి;
నా వైపు చెవి ఉంచి నన్ను రక్షించండి.
3నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే,
నా ఆశ్రయదుర్గంగా ఉండండి;
మీరు నా కొండ నా కోట కాబట్టి,
నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి.
4నా దేవా, దుష్టుల చేతి నుండి,
చెడ్డవారు, క్రూరుల పట్టు నుండి నన్ను విడిపించండి.
5ప్రభువైన యెహోవా, మీరే నా నిరీక్షణ,
నా యవ్వనం నుండి మీరే నా ధైర్యం.
6పుట్టినప్పటి నుండి నేను మీమీద ఆధారపడ్డాను;
నన్ను తల్లి గర్భం నుండి బయటకు తెచ్చింది మీరే.
నేను నిత్యం మిమ్మల్ని స్తుతిస్తాను.
7అనేకులకు నేనొక సూచనగా ఉన్నాను;
మీరే నాకు బలమైన ఆశ్రయం.
8నా నోరు మీ స్తుతితో నిండి ఉంది;
నేను రోజంతా మీ వైభవాన్ని ప్రకటిస్తాను.
9నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నన్ను త్రోసివేయకండి;
నా బలం తగ్గిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టకండి.
10నా శత్రువులు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు;
నన్ను చంపాలని చూసేవారంతా కలిసి కుట్ర చేస్తున్నారు.
11“దేవుడు అతన్ని విడిచిపెట్టారు;
అతన్ని విడిపించడానికి ఒక్కరు లేరు,
అతన్ని వెంటాడి పట్టుకోండి” అని వారంటారు.
12నా దేవా, నాకు దూరంగా ఉండకండి;
దేవా, సాయం చేయడానికి త్వరగా రండి.
13నాపై నేరం మోపేవారు సిగ్గుతో నశించుదురు గాక;
నాకు హాని చేయాలని కోరేవారు
ఎగతాళిచేయబడి అవమానపరచబడుదురు గాక.
14నా మట్టుకైతే, నేనెల్లప్పుడు నిరీక్షణ కలిగి ఉంటాను;
నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని స్తుతిస్తాను.
15రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి,
రక్షణక్రియలను గురించి చెప్తుంది.
అవి నా గ్రహింపుకు అందనివి.
16ప్రభువైన యెహోవా, నేను వచ్చి మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను;
కేవలం మీ నీతిక్రియలను మాత్రమే నేను ప్రకటిస్తాను.
17దేవా! నా యవ్వనం నుండి మీరు నాకు బోధించారు,
ఈ రోజు వరకు నేను మీ అద్భుత క్రియలను ప్రకటిస్తున్నాను.
18నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి,
నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని,
రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు
నన్ను విడిచిపెట్టకండి.
19దేవా, మీ నీతి ఎత్తయిన ఆకాశాలకు ఉన్నతమైనది,
మీరు గొప్ప వాటిని చేశారు.
దేవా, మీలాంటి వారెవరు?
20మీరు నన్ను అనేకమైన ఇబ్బందులు,
చేదైన వాటిని చూసేలా చేసినప్పటికీ,
మీరు నన్ను మళ్ళీ జీవించేలా చేస్తారు;
భూమి యొక్క లోతుల నుండి
మీరు నన్ను మళ్ళీ పైకి తెస్తారు.
21మీరు నా గౌరవాన్ని పెంచుతారు
మరోసారి నన్ను ఓదార్చుతారు.
22నా దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి
నేను సితారాతో మిమ్మల్ని స్తుతిస్తాను;
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా,
నేను వీణతో మిమ్మల్ని స్తుతిస్తాను.
23మీరు విడిపించిన నేను
మీకు స్తుతి పాడినప్పుడు
నా పెదవులు ఆనందంతో కేకలు వేస్తాయి.
24రోజంతా నా నాలుక
మీ నీతిక్రియలను గురించి చెప్తుంది,
ఎందుకంటే నాకు హాని చేయాలని కోరుకున్నవారు
అవమానం పొంది గందరగోళానికి గురి అయ్యారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 71: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.