కీర్తనలు 7:10-17

కీర్తనలు 7:10-17 TSA

యథార్థ హృదయులను కాపాడే సర్వోన్నతుడైన దేవుడే నాకు డాలు. దేవుడు నీతిగల న్యాయమూర్తి, ఆయన దుష్టులపై ప్రతిరోజు తన ఉగ్రతను చూపిస్తారు. ఒకవేళ ఎవరైనా పశ్చాత్తాపపడకపోతే, దేవుడు తన ఖడ్గాన్ని పదునుపెడతారు; ఆయన తన విల్లు ఎక్కుపెట్టి బాణం సిద్ధపరుస్తారు. ఆయన తన మారణాయుధాలు సిద్ధం చేసుకుంటారు; ఆయన తన అగ్ని బాణాలు సిద్ధం చేసుకుంటారు. దుష్టులు చెడును గర్భం దాలుస్తారు, కీడును గర్భంలో మోసి అబద్ధాలకు జన్మనిస్తారు. ఇతరుల కోసం గుంటను త్రవ్వుతారు తాము త్రవ్విన గుంటలో వారే పడతారు. వారు చేసిన కీడు వారికే చుట్టుకుంటుంది; వారు చేసిన హింస వారి తల మీదికే వస్తుంది. యెహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మహోన్నతుడైన యెహోవా నామానికి నేను స్తుతులు పాడతాను.