కీర్తనలు 50
50
కీర్తన 50
ఆసాపు కీర్తన.
1దేవుడైన యెహోవా, బలాఢ్యుడు,
భూమితో మాట్లాడతారు,
సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు వారందరిని పిలుస్తారు.
2సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి,
దేవుడు ప్రకాశిస్తారు.
3మన దేవుడు వస్తారు
మౌనంగా ఉండరు;
ఆయన ముందు మ్రింగివేసే అగ్ని ఉంది
ఆయన చుట్టూ బలమైన తుఫాను చెలరేగుతుంది.
4తన ప్రజలకు తీర్పు ఇవ్వడానికి
పైన ఉన్న ఆకాశాలను, క్రింద భూమిని పిలుస్తారు.
5“బలి అర్పణల వల్ల నాతో నిబంధన చేసుకున్న
భక్తులను నా ఎదుట సమావేశపరచండి.”
6ఆకాశాలు దేవుని నీతిని ప్రకటిస్తాయి,
ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. సెలా
7“నా ప్రజలారా! వినండి. నేను మాట్లాడతాను;
ఇశ్రాయేలు, మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాను:
నేను దేవుడను, మీ దేవుడను.
8మీ బలుల గురించి లేదా ఎప్పుడు నా ఎదుటే ఉండే మీ దహనబలుల గురించి,
నేను మీకు వ్యతిరేకంగా ఎటువంటి ఆరోపణలు చేయను.
9మీ శాలలోనుండి మీరు తెచ్చే ఎద్దులు నాకవసరం లేదు.
మీ దొడ్డిలోని మేకపోతులు నాకవసరం లేదు.
10అడవిలో ఉన్న ప్రతి జంతువు నాదే
వేయి కొండలపై ఉన్న పశువులు నావే.
11పర్వతాల్లో ఉన్న ప్రతి పక్షి నాకు తెలుసు,
పొలాల్లో ఉన్న జంతువులు నావే.
12నాకు ఆకలిగా ఉంటే నేను మీకు చెప్పను,
లోకం నాది, అందులో ఉన్నవన్నీ నావి.
13ఎడ్ల మాంసం నేను తింటానా?
మేకపోతుల రక్తం త్రాగుతానా?
14“దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి
మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించండి.
15ఆపద్దినాన నన్ను పిలువండి;
నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు.”
16దుష్టులతో దేవుడు ఇలా అంటున్నారు:
“నా న్యాయవిధులు ఉచ్చరించే
నా నిబంధనను మీ పెదాల మీదికి తీసుకునే హక్కు మీకెక్కడిది?
17నా సూచనను మీరు అసహ్యించుకుంటారు,
నా మాటల్ని మీ వెనుకకు పారవేస్తారు.
18మీరు ఒక దొంగను చూస్తే, వాడితో కలిసిపోతారు;
మీ భాగాన్ని వ్యభిచారులతో పంచుకొంటారు.
19మీ నోటిని చెడుకు వాడుతారు
మీ నాలుకను మోసానికి ఉపయోగిస్తారు.
20మీరు కూర్చుని మీ సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు,
మీ సొంత తల్లి కుమారుని మీద అభాండాలు వేస్తారు.
21మీరు ఇవి చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను,
నేను మీలాంటి వాణ్ణే అని మీరనుకున్నారు.
కాని నేనిప్పుడు మిమ్మల్ని నిలదీస్తున్నాను,
నా ఆరోపణలను మీ ముందు పెడుతున్నాను.
22“దేవున్ని మరచే మీరు, కొంచెం ఆలోచించండి,
లేకపోతే మిమ్మల్ని ఎవరు విడిపించలేనంతగా చీల్చి ముక్కలు చేస్తాను:
23కృతజ్ఞతార్పణలు అర్పించేవారు నన్ను ఘనపరుస్తారు,
నిందారహితులకు#50:23 హెబ్రీ భాషలో ఈ పదం యొక్క అర్థం తెలియదు. దేవుని రక్షణ చూపిస్తాను.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 50: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.