కీర్తనలు 38
38
కీర్తన 38
దావీదు దేవునికి విన్నవించుకున్న కీర్తన
1యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి
ఉగ్రతలో నన్ను శిక్షించకండి.
2మీ బాణాలు నాకు గుచ్చుకున్నాయి,
మీ చేయి నా మీద బరువుగా పడింది.
3మీ ఉగ్రత వల్ల నా శరీరంలో ఆరోగ్యం లేదు;
నా పాపాన్ని బట్టి నా ఎముకల్లో నెమ్మది లేదు.
4నా దోషం భరించలేని భారంలా
నన్ను ముంచెత్తింది.
5నా బుద్ధిహీనతతో చేసిన పాపాల వల్ల
నా గాయాలు కుళ్ళి దుర్వాసన వస్తున్నాయి.
6నేను చాలా క్రుంగిపోయాను;
దినమంతా దుఃఖంలోనే ఉన్నాను.
7నా వీపు తీవ్రమైన బాధతో ఉంది
నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది,
8నేను బలహీనంగా ఉన్నాను పూర్తిగా నలిగిపోయాను;
నేను హృదయ వేదనతో మూలుగుతున్నాను.
9ప్రభువా, నా కోరికలన్నీ మీ ముందు ఉన్నాయి;
నా నిట్టూర్పు మీ నుండి ఉంది.
10నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది;
నా కంటి చూపు తగ్గిపోతుంది.
11నా గాయాల వల్ల నా స్నేహితులు నా సహచరులు నన్ను దూరం పెడుతున్నారు;
నా పొరుగువారు నన్ను దూరంగా ఉంచుతున్నారు.
12నన్ను చంపాలనుకున్నవారు ఉచ్చులు బిగుస్తున్నారు,
నాకు హాని కలిగించేవారు నా పతనం గురించి మాట్లాడుతున్నారు;
రోజంతా వారు కుట్రలు చేస్తున్నారు.
13చెవిటివానిలా నేను వినక ఉన్నాను,
మూగవానిలా మాట్లాడక ఉన్నాను;
14నేను వినలేనివానిగా అయ్యాను,
జవాబు చెప్పలేనివానిగా ఉన్నాను.
15యెహోవా, నేను మీ కోసం ఎదురుచూస్తున్నాను;
ప్రభువా నా దేవా, మీరు జవాబిస్తారు.
16నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు
వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను.
17నేను పడిపోయేలా ఉన్నాను,
నా బాధ నిత్యం నాతోనే ఉంది.
18నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను;
నా పాపాన్ని గురించి బాధపడుతున్నాను.
19కారణం లేకుండ అనేకులు నాకు శత్రువులయ్యారు;
కారణం లేకుండ అనేకులు నన్ను ద్వేషిస్తున్నారు;
20నేను చేసిన మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు,
నేను మంచిని మాత్రమే అనుసరిస్తున్నా సరే,
వారు నన్ను వ్యతిరేకిస్తున్నారు.
21యెహోవా, నన్ను విడువకండి;
నా దేవా, నాకు దూరంగా ఉండకండి.
22నా ప్రభువా నా రక్షకా,
త్వరగా వచ్చి నాకు సాయం చేయండి.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తనలు 38: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.