కీర్తనలు 119:113-128

కీర్తనలు 119:113-128 TSA

ద్విమనస్కులంటే నాకు అసహ్యం, కాని మీ ధర్మశాస్త్రం నాకు ఇష్టం. మీరు నా ఆశ్రయం నా డాలు; నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను. నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా, కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి! మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను; నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి. నన్ను ఎత్తిపట్టుకోండి, నేను విడిపించబడతాను; మీ శాసనాలను నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను. మీ శాసనాల నుండి తప్పుకున్న వారిని మీరు తిరస్కరిస్తారు, వారి భ్రమలు ఏమీ కాకుండా పోతాయి. భూమి మీద ఉన్న దుష్టులందరిని మీరు లోహపు మడ్డిలా విస్మరిస్తారు; కాబట్టి నేను మీ శాసనాలను ప్రేమిస్తాను. మీ భయానికి నా శరీరం వణకుతుంది; మీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. నేను నీతియుక్తమైనది న్యాయమైనది చేశాను; నన్ను బాధించేవారికి నన్ను వదిలేయకండి. మీ సేవకుడి శ్రేయస్సుకు హామీ ఇవ్వండి; అహంకారులు నన్ను అణచివేయనివ్వకండి. మీ నీతియుక్తమైన వాగ్దానం కోసం, మీ రక్షణ కోసం ఎదురుచూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి. మీ మారని ప్రేమకు తగినట్టుగా మీ సేవకునితో వ్యవహరించండి అలాగే మీ శాసనాలు నాకు బోధించండి. నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా నాకు వివేచన ఇవ్వండి. మీ ధర్మశాస్త్రం ఉల్లంఘించబడుతుంది; యెహోవా, మీరు చర్య తీసుకోవలసిన సమయం ఇదే. ఎందుకంటే నేను మీ ఆజ్ఞలను బంగారం కంటే, మేలిమి బంగారం కంటే ఎక్కువ ప్రేమిస్తాను, నేను మీ కట్టడలన్నిటిని యథార్థమైనవిగా పరిగణిస్తాను, ప్రతి తప్పుడు మార్గం నాకసహ్యము.