నిందారహిత మార్గాలను అనుసరిస్తూ,
యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు.
ఆయన శాసనాలను పాటిస్తూ
తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు,
వారు అన్యాయం చేయక
ఆయన మార్గాలను అనుసరిస్తారు.
అత్యంత జాగ్రత్తగా పాటించాలని
మీరు వారికి శాసనాలిచ్చారు.
మీ శాసనాలను అనుసరించుటలో
నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది!
అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు
నేను అవమానపాలు కాను.
నేను మీ నీతి న్యాయవిధులను తెలుసుకున్న కొలది
యథార్థ హృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
నేను మీ శాసనాలకు లోబడతాను.
దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి.
యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు?
మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.
నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను;
మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.
నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని
మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.
యెహోవా, మీకు స్తుతి కలుగును గాక;
మీ శాసనాలను నాకు బోధించండి.
మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని
నా పెదవులతో వివరిస్తాను.
ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించునట్లు
నేను మీ శాసనాలను పాటించడంలో సంతోషిస్తాను.
మీ శాసనాలను నేను ధ్యానిస్తాను
మీ మార్గాలను పరిగణిస్తాను.
మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను;
నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను.
నేను బ్రతికి ఉండి మీ వాక్యానికి లోబడేలా,
మీ సేవకునిపట్ల దయగా ఉండండి.
మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని
నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి.
ఈ లోకంలో నేను అపరిచితున్ని;
మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి.
అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం
తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది.
శపించబడినవారైన అహంకారులను మీరు గద్దిస్తారు,
వారు మీ ఆజ్ఞల నుండి తొలగిపోయినవారు.
నేను మీ శాసనాలను పాటిస్తున్నాను,
వారి అపహాస్యాన్ని ధిక్కారాన్ని నా నుండి తొలగించండి.
పాలకులు కలిసి కూర్చుని నన్ను అపవాదు చేసినప్పటికీ,
మీ సేవకుడు మీ శాసనాలను ధ్యానిస్తాడు.
మీ శాసనాలే నాకు ఆనందం;
అవి నాకు ఆలోచన చెప్తాయి.
నేను నేల మీద పడిపోయాను;
మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
నా జీవిత పరిస్థితులను మీకు వివరించాను, మీరు నాకు జవాబిచ్చారు;
మీ శాసనాలు నాకు బోధించండి.
నేను మీ కట్టడల అర్థాన్ని గ్రహించేలా చేయండి,
తద్వారా మీ అద్భుత కార్యాలను నేను ధ్యానిస్తాను.
దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది;
మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి.
మోసపూరిత మార్గాల నుండి నన్ను తప్పించండి;
నా మీద దయచూపి మీ ధర్మశాస్త్రం నాకు బోధించండి.
నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను;
మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను.
యెహోవా, మీ శాసనాలను గట్టిగా పట్టుకుని ఉంటాను;
నాకు అవమానం కలగనివ్వకండి.
మీ ఆజ్ఞల మార్గాన నేను పరుగెడతాను,
ఎందుకంటే మీరు నా గ్రహింపును విశాలపరిచారు.
యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి,
అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను.
మీ ధర్మశాస్త్రం నేను అనుసరించేలా
హృదయపూర్వకంగా వాటికి విధేయత చూపేలా,
నాకు గ్రహింపు దయచేయండి.
మీ ఆజ్ఞల మార్గాన నన్ను నడిపించండి,
అక్కడే నాకు ఆనందము.
నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక
మీ శాసనాల వైపుకు త్రిప్పండి.
పనికిరాని వాటినుండి నా కళ్లను త్రిప్పండి;
మీ మార్గాల ద్వార నా జీవితాన్ని కాపాడండి.
మీ సేవకునిపట్ల మీ మాటను నెరవేర్చండి,
తద్వారా ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.
నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి,
ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి.
మీ కట్టడల కోసం నేను ఎంతగా తహతహ లాడుతున్నాను!
మీ నీతిలో నా జీవితాన్ని కాపాడండి.
యెహోవా, మీ మారని ప్రేమ,
మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక.
అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను,
ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము.
మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి,
ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను.
నేను ఎల్లప్పుడు అంటే నిరంతరం,
మీ ధర్మశాస్త్రానికి లోబడతాను.
నేను మీ కట్టడలను వెదికాను,
కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.
రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను
నేను సిగ్గుపడను,
నేను మీ ఆజ్ఞలలో ఆనందిస్తాను
ఎందుకంటే అవంటే నాకు ప్రేమ.
నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను,
తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను.