కీర్తనలు 107:1-22

కీర్తనలు 107:1-22 TSA

యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు; ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది. యెహోవాచేత విమోచింపబడినవారు, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు, వివిధ దేశాల నుండి, తూర్పు పడమర, ఉత్తర దక్షిణాల నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక. కొందరు ఏకాంతంగా ఎడారిలో తిరిగారు; నివాసయోగ్యమైన పట్టణం ఒక్కటి వారికి కనిపించలేదు. వారు ఆకలి దప్పికతో ఉన్నారు, వారి ప్రాణాలు సొమ్మసిల్లాయి. అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధలనుండి విడిపించారు. ఆయన వారిని తిన్నని బాటలో నివాసయోగ్యమైన పట్టణానికి నడిపించారు. యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, దాహంతో ఉన్న వారి దాహాన్ని ఆయన తీరుస్తారు, మేలైన వాటితో ఆయన ఆకలి తీర్చుతారు. కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి, చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు, వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, మహోన్నతుని ప్రణాళికలను తృణీకరించారు. కాబట్టి ఆయన వారిని వెట్టిచాకిరికి అప్పగించారు; వారు తొట్రిల్లారు సాయం చేసేవాడు ఒక్కడూ లేడు. అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు. ఆయన వారిని చీకటి, కటిక చీకటిలో నుండి బయటకు తెచ్చారు, వారి సంకెళ్ళను తుత్తునియలుగా చేశారు. యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, ఎందుకంటే ఆయన ఇత్తడి ద్వారాలను పగలగొడతారు ఇనుప గడియలను విరగ్గొడతారు. కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు. వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు. అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు. తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు. యెహోవా యొక్క మారని ప్రేమ కోసం మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక, కృతజ్ఞతార్పణలు అర్పించాలి. ఆనంద ధ్వనులతో దేవుని క్రియలను ప్రకటించాలి.