సామెతలు 28
28
1ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు,
కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు.
2ఒక దేశం తిరుగుబాటు చేసినప్పుడు, దానికి చాలామంది పాలకులు ఉంటారు,
కానీ వివేచన జ్ఞానంగల మనుష్యులు క్రమాన్ని పాటిస్తారు.
3పేదలను హింసించే ఒక పేదవాడు
పంటను తుడిచిపెట్టుకుపోయే వర్షం లాంటివాడు.
4బోధనను విడిచిపెట్టిన వారు దుష్టులను పొగడుతారు,
కాని దానిని లక్ష్యపెట్టేవారు దుష్టులను వ్యతిరేకిస్తారు.
5కీడుచేసేవారు సరియైనది గ్రహించరు,
కాని యెహోవాను ఆశ్రయించువారు దాన్ని పూర్తిగా గ్రహిస్తారు.
6మూర్ఖమైన మార్గాలు అనుసరించే ధనికుని కంటే,
నిందారహితంగా నడుచుకొనే పేదవాడు మేలు.
7వివేకవంతుడైన కుమారుడు బోధనకు శ్రద్ధ వహిస్తాడు,
కాని తిండిబోతు సహచరుడు తన తండ్రిని అవమానపరుస్తాడు.
8పేదవాని నుండి వడ్డిచేత గాని లేదా లాభంచేత గాని ఆస్తి పెంచుకొనువాడు
పేదవారి పట్ల దయ చూపే మరొకరికి దాన్ని కూడ పెడుతున్నాడు.
9ఒకవేళ ఎవరైనా నా బోధను పెడచెవిని పెడితే,
వారి ప్రార్థనలు కూడా అసహ్యకరమైనవి.
10యథార్థమైన వారిని చెడు దారిలోకి నడిపించేవారు,
తమ ఉచ్చులో తామే పడతారు,
కాని నిందారహితులు మంచి వారసత్వాన్ని పొందుకుంటారు.
11ధనవంతులు తమ కళ్లకు తామే జ్ఞానులు;
వివేకంగల పేదవారు వారు ఎంత మోసపూరితమైనవారో చూస్తారు.
12నీతిమంతులు విజయం సాధించినప్పుడు, గొప్ప ఉల్లాసం ఉంటుంది;
కాని దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రజలు దాక్కుంటారు.
13తమ పాపాలను దాచిపెట్టేవారు వర్ధిల్లరు,
కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరం పొందుతారు.
14దేవుని ఎదుట ఎప్పుడూ భయంతో వణికేవారు ధన్యులు,
కాని తమ హృదయాలను కఠినం చేసుకొనే వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారు.
15నిస్సహాయ ప్రజలను పైన ఉన్న దుష్ట పాలకుడు
గర్జించే సింహం లేదా దాడి చేసే ఎలుగుబంటిలాంటి వాడు.
16ఒక నిరంకుశ పాలకుడు బలాత్కారాన్ని అభ్యసిస్తాడు,
కాని చెడుతో సంపాదించిన లాభాన్ని ద్వేషించేవాడు సుదీర్ఘ పాలనను అనుభవిస్తాడు.
17హత్యచేసిన అపరాధభావంతో బాధించబడే వారు
సమాధిలో ఆశ్రయం వెదకుతారు;
ఎవరు వారిని ఆపకూడదు.
18ఎవరి నడక నిందారహితంగా ఉంటుందో వారు భద్రంగా ఉంచబడతారు,
కాని ఎవరి మార్గాలు మూర్ఖంగా ఉంటాయో వారు హఠాత్తుగా గొయ్యిలో పడిపోతారు.
19తమ భూమిలో పని చేసేవారికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది,
కానీ పగటి కలల వెంటపడేవారికి దరిద్రత నిండుతుంది.
20నమ్మకమైన వ్యక్తి అధికంగా దీవించబడతాడు,
కాని ధనము సంపాదించాలని ఆరాటపడేవాడు శిక్ష పొందక మానడు.
21పక్షపాతం చూపడం మంచిది కాదు
అయినా రొట్టె ముక్క కోసం మనుష్యులు తప్పు చేస్తారు.
22పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు
అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు.
23నాలుకతో పొగిడే వారికన్నా,
మనుష్యులను గద్దించేవారే చివరికి ఎక్కువ ఇష్టమవుతారు.
24తన తల్లిదండ్రులను దోచుకొని
“ఇది ద్రోహం కాదు” అనేవాడు
నాశనం చేసేవానికి భాగస్వామి.
25దురాశ కలవాడు కలహాన్ని రేపుతాడు,
కాని యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వృద్ధి చెందుతాడు.
26తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు,
కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు.
27పేదవారికి ఇచ్చేవారికి ఏదీ కొదువ కాదు,
కాని వారి పట్ల కళ్లు మూసుకొనే వారికి అనేక శాపాలు కలుగుతాయి.
28దుష్టులైన మనుష్యులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు;
కాని దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు వృద్ధిచెందుతారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సామెతలు 28: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.