ఫిలిప్పీయులకు 3

3
శరీరం మీద నమ్మకం ఉంచకండి
1చివరిగా, నా సహోదరీ సహోదరులారా, ప్రభువులో ఆనందించండి! మరల అవే సంగతులను మీకు వ్రాయడం నాకు కష్టం కలిగించదు, అది మీకు రక్షణ కవచం. 2ఆ కుక్కల విషయంలో జాగ్రత్త, దుష్టమైన పనులు చేసేవారి విషయంలో, శరీరాన్ని ముక్కలుగా ఖండించేవారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. 3ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి. 4కావాలంటే నేను శరీరంపై అలాంటి నమ్మకాన్ని కలిగివుండవచ్చు.
ఎవరైనా శరీరంపై నమ్మకం ఉంచడానికి తమ దగ్గర కారణాలు ఉన్నాయని అనుకుంటే, వారి కంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. 5నేను ఎనిమిదవ రోజున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశానికి చెందినవాడిని, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల యొక్క హెబ్రీయుడను; ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడను. 6అత్యాసక్తితో సంఘాన్ని హింసించాను; ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని నీతి విషయంలో నిరపరాధిని.
7అయితే, ఏవైతే నాకు లాభదాయకంగా ఉన్నాయో, నేను ఇప్పుడు వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా భావించాను. 8నిశ్చయంగా నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం విలువైనది కనుక నేను ప్రతిదీ నష్టంగా భావిస్తున్నాను. నేను క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తాన్ని వ్యర్థంగా భావిస్తున్నాను. 9క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్ని బట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని, 10నేను క్రీస్తును తెలుసుకోవాలని కోరుతున్నాను, అవును, ఆయన పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలని, ఆయన శ్రమల్లో పాల్పంచుకోవడం, ఆయన మరణంలో ఆయనలా కావడం, 11అలా, ఏదో ఒక విధంగా, మృతుల్లో నుండి పునరుత్థానం పొందడం.
12నేను ఇప్పటికే ఇవన్ని పొందానని గాని, నా లక్ష్యాన్ని చేరుకున్నానని గాని నేను భావించడంలేదు, కాని దేని కొరకు క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నారో దానిని పట్టుకోవాలని పరుగెడుతున్నాను. 13సహోదరీ సహోదరులారా, నేను ఇంతకు ముందే దానిని పట్టుకున్నానని భావించను, అయితే నేను చేస్తున్నది ఒకటే, వెనుక ఉన్నవాటిని మరచిపోయి ముందున్న వాటికొరకు ప్రయాసపడుతున్నాను, 14క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను.
పౌలు మాదిరిని అనుసరించుట
15కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాం. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు. 16అయినా ఇప్పటి వరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాం.
17సహోదరీ సహోదరులారా, మీరు నా మాదిరిని అనుసరించండి. మేము మీకు మాదిరిగా ఉన్నట్లే, ఎవరైతే మాలాగా జీవిస్తారో వారిపై మీ దృష్టిని ఉంచండి. 18అనేకమంది క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు, గతంలో వీరిని గురించి మీతో అనేకసార్లు చెప్పినా, మరల ఇప్పుడు కన్నీటితో చెప్తున్నాను. 19వారి గమ్యం నాశనం, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన వాటిలో వారు గర్వపడుతున్నారు. భూసంబంధమైన వాటిపైనే తమ మనస్సు ఉంచుతున్నారు. 20అయితే మన పౌరసత్వం పరలోకంలో ఉంది, కనుక అక్కడి నుండి వచ్చే మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. 21సమస్తాన్ని తన ఆధీనంలోనికి తీసుకురాగల తన శక్తిని బట్టి, ఆయన మన నీచమైన శరీరాలను తన మహిమ గల శరీరాన్ని పోలి ఉండేలా మార్చగలరు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఫిలిప్పీయులకు 3: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

ఫిలిప్పీయులకు 3 కోసం వీడియో