ఫిలిప్పీయులకు 3:7-16

ఫిలిప్పీయులకు 3:7-16 TCV

అయితే, ఏవైతే నాకు లాభదాయకంగా ఉన్నాయో, నేను ఇప్పుడు వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా భావించాను. నిశ్చయంగా నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం విలువైనది కనుక నేను ప్రతిదీ నష్టంగా భావిస్తున్నాను. నేను క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తాన్ని వ్యర్థంగా భావిస్తున్నాను. క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్ని బట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని, నేను క్రీస్తును తెలుసుకోవాలని కోరుతున్నాను, అవును, ఆయన పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలని, ఆయన శ్రమల్లో పాల్పంచుకోవడం, ఆయన మరణంలో ఆయనలా కావడం, అలా, ఏదో ఒక విధంగా, మృతుల్లో నుండి పునరుత్థానం పొందడం. నేను ఇప్పటికే ఇవన్ని పొందానని గాని, నా లక్ష్యాన్ని చేరుకున్నానని గాని నేను భావించడంలేదు, కాని దేని కొరకు క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నారో దానిని పట్టుకోవాలని పరుగెడుతున్నాను. సహోదరీ సహోదరులారా, నేను ఇంతకు ముందే దానిని పట్టుకున్నానని భావించను, అయితే నేను చేస్తున్నది ఒకటే, వెనుక ఉన్నవాటిని మరచిపోయి ముందున్న వాటికొరకు ప్రయాసపడుతున్నాను, క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాం. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు. అయినా ఇప్పటి వరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాం.