సంఖ్యా 18
18
యాజకులు, లేవీయుల బాధ్యతలు
1యెహోవా అహరోనుతో, “పరిశుద్ధాలయానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు నీ కుటుంబం బాధ్యులు, యాజక ధర్మానికి సంబంధించిన అపరాధాలకు నీవూ నీ కుమారులు బాధ్యులు. 2మీతో చేరి నీవు, మీ కుమారులు నిబంధన గుడారం ముందు పరిచర్య చేస్తున్నప్పుడు మీకు సహాయపడడానికి మీ పూర్వికుల గోత్రానికి చెందిన మీ తోటి లేవీయులను తీసుకురండి. 3వారు నీకు బాధ్యత వహించాలి, గుడారం యొక్క అన్ని విధులను నిర్వర్తించాలి, అయితే వారు పరిశుద్ధాలయం యొక్క సామాగ్రి దగ్గరకు గాని బలిపీఠం దగ్గరకు గాని వెళ్లకూడదు. లేదంటే వారు మీరు చస్తారు. 4వారు మీతో కలిసి సమావేశ గుడారంలోని అన్ని పనులు జరిగేలా బాధ్యత వహించాలి; మీకు సహాయం చేయడానికి ఇతరులెవ్వరు రాకూడదు.
5“పరిశుద్ధాలయం, బలిపీఠం పట్ల శ్రద్ధ వహించే విషయంలో మీరు బాధ్యత వహించాలి. తద్వారా ఇశ్రాయేలీయుల మీదికి యెహోవా కోపం రాదు. 6నేను నేనే ఇశ్రాయేలీయుల నుండి మీ తోటి లేవీయులను మీకు బహుమానంగా, సమావేశ గుడారంలో సేవ చేయడానికి యెహోవాకు ప్రతిష్ఠించాను. 7అయితే నీవు, నీ కుమారులు మాత్రమే బలిపీఠం దగ్గర, తెర వెనుక ఉన్న ప్రతిదానికీ సంబంధించి యాజకులుగా పని చేయవచ్చు. యాజక ధర్మాన్ని మీకు ప్రత్యేకమైన వరంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే, వారికి మరణశిక్ష విధించబడుతుంది.”
యాజకులు, లేవీయుల కోసం అర్పణలు
8అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “నాకు అర్పించిన అర్పణలకు నేనే నీకు బాధ్యత అప్పగించాను; ఇశ్రాయేలీయులు నాకు ఇచ్చే పరిశుద్ధ అర్పణలన్నీ నేను నీకు, నీ కుమారులకు మీ భాగంగా, మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. 9బలిపీఠం మీది నిప్పులో కాల్చివేయబడని అతి పవిత్ర అర్పణలలో కొంత భాగం మీరు తీసుకోవాలి. నాకు వారు తెచ్చే అతి పవిత్రమైన భోజనార్పణలు పాపపరిహారబలులు అపరాధబలులు నీకు, నీ కుమారులకు చెందినవి. 10అవి అతి పవిత్రంగా ఎంచి తినాలి. ప్రతి మగవాడు అది తినాలి. వాటిని పవిత్రమైనవిగా పరిగణించాలి.
11“ఇది కూడా మీదే: ఇశ్రాయేలీయులు అర్పించే అర్పణలన్నిటిలో నుండి ప్రక్కన పెట్టబడినది. నేను నీకు, నీ కుమారులు కుమార్తెలకు మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. మీ ఇంట్లో ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తినవచ్చు.
12“యెహోవాకు ఇశ్రాయేలీయులు వారి కోతలో నుండి ప్రథమ ఫలంగా అర్పించే ధాన్యము, ద్రాక్షరసము, నూనె అంతటిని మీకు ఇస్తున్నాను. 13దేశం పంటలన్నిటిలో యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాలు మీకు చెందుతాయి. నీ కుటుంబంలో ఆచార ప్రకారం పవిత్రులందరు వాటిని తినవచ్చు.
14“ఇశ్రాయేలీయులు యెహోవా కోసం ప్రతిష్ఠించిన ప్రతిదీ నీకు చెందుతుంది. 15ప్రతి గర్భం నుండి వచ్చిన యెహోవాకు అర్పించబడ్డ జ్యేష్ఠ సంతానం, మనుష్యులైన, జంతువులైన, మీకు చెందుతాయి. కానీ మీరు ప్రతి పెద్ద కుమారున్ని, అపవిత్ర జంతువుల తొలిచూలును విడిపించాలి. 16ఒక నెల వయస్సున్నప్పుడు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం అయిదు షెకెళ్ళ#18:16 అంటే సుమారు 58 గ్రాములు వెండితో విడిపించాలి, అంటే ఇరవై గెరాలు.
17“ఆవులలో, గొర్రెలలో, మేకలలో తొలిచూలును విడిపించకూడదు. అవి పవిత్రమైనవి. వాటి రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించి యెహోవాకు సువాసనగా ఉండే హోమంగా వాటి క్రొవ్వును కాల్చివేయాలి. 18ప్రత్యేక అర్పణలోని బోర, కుడి తొడ ఎలాగో, వాటి మాంసం కూడా మీకు చెందుతుంది. 19ఇశ్రాయేలీయులు యెహోవాకు తెచ్చే పవిత్రార్పణలను ప్రక్కకు పెట్టినవి నీకు, నీ కుమారులకు, కుమార్తెలకు శాశ్వత వాటాగా ఇస్తున్నాను. ఇది యెహోవా ఎదుట నీతో పాటు నీ సంతానానికి నిత్య ఉప్పు ఒడంబడికగా ఉంటుంది.”
20యెహోవా అహరోనుతో ఇలా చెప్పారు, “వారి దేశంలో నీకు స్వాస్థ్యం కానీ వాటా కానీ ఉండదు; ఇశ్రాయేలీయుల మధ్య నేనే నీ వాటాను నేనే నీ స్వాస్థ్యాన్ని.
21“సమావేశ గుడారం దగ్గర సేవ చేస్తున్న లేవీయులకు పారితోషికంగా ఇశ్రాయేలీయులు ఇచ్చే దశమ భాగాలను స్వాస్థ్యంగా ఇస్తున్నాను. 22ఇప్పటినుండి యాజకులు, లేవీయులు తప్ప ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం దగ్గరకు రాకూడదు లేదా వారి పాపానికి ప్రతిఫలం భరించి చస్తారు. 23లేవీయులు మాత్రమే సమావేశ గుడారంలో సేవ చేస్తారు వారు చేసే అపరాధాలకు వారే బాధ్యులు. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు. 24దానికి బదులు, ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించే దశమ భాగాలను నేను లేవీ వంశస్థులకు వారసత్వంగా ఇస్తున్నాను. అందుకే, వారిని ఉద్దేశించి ఇలా చెప్పాను: ‘ఇశ్రాయేలీయుల మధ్య వారికి వారసత్వం ఉండదు.’ ”
25యెహోవా మోషేతో ఇలా అన్నారు: 26“లేవీయులతో మాట్లాడుతూ ఇలా చెప్పు: ‘మీరు ఇశ్రాయేలీయుల నుండి వారసత్వంగా దశమభాగం తీసుకున్నప్పుడు, ఆ దశమభాగంలో పదవ వంతు మీరు యెహోవాకు అర్పణగా సమర్పించాలి. 27అలా ప్రత్యేకించిన అర్పణలు నూర్పిడి కళ్ళంలోని ధాన్యంలా, గానుగ నుండి వచ్చిన ద్రాక్షరసంలా లెక్కకు వస్తాయి. 28ఇశ్రాయేలీయుల నుండి పుచ్చుకొనే దశమ భాగాలన్నిటి నుండి యెహోవాకు మీరు కూడా అర్పణలు ఇస్తారు. ఈ దశమ భాగాల నుండి యెహోవా భాగమును యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. 29మీకు ఇవ్వబడిన ప్రతి దానిలో ఉత్తమమైన పవిత్రమైన భాగాన్ని మీరు యెహోవా యొక్క భాగంగా సమర్పించాలి.’
30“లేవీయులకు చెప్పు: ‘శ్రేష్ఠమైనవి అర్పించినప్పుడు, అవి మీ నూర్పిడి కళ్ళంలా, ద్రాక్ష గానుగలా లెక్కకు వస్తాయి. 31మిగితా వాటిని మీరు, మీ ఇంటివారు ఎక్కడైనా తినవచ్చు అది సమావేశ గుడారంలో మీరు చేస్తున్న సేవకు మీ జీతము. 32మీరు దానిలో ఉత్తమమైన వాటిని అర్పించినప్పుడు మీరు దాని గురించి ఎటువంటి పాపశిక్షను భరించరు; అయితే ఇశ్రాయేలీయుల పరిశుద్ధ అర్పణలను అపవిత్రపరచవద్దు. అప్పుడు మీరు చావరు.’ ”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
సంఖ్యా 18: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.