దేవుని కుమారుడైన క్రీస్తు యేసును గురించిన సువార్త ప్రారంభం. యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినట్లుగా:
“ఇదిగో, నీకు ముందుగా నా దూతను పంపుతాను,
అతడు నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు.”
“అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం,
‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి,
ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి’ ” అని చెప్తుంది.
అలాగే బాప్తిస్మమిచ్చే యోహాను అరణ్యంలో ప్రత్యక్షమై, పాపక్షమాపణ కొరకై పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందుకోండని ప్రకటిస్తున్నాడు. యూదయ గ్రామీణ ప్రాంతమంతా, యెరూషలేము ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి తమ పాపాలను ఒప్పుకుని యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందారు. యోహాను ఒంటె వెంట్రుకలతో చేయబడిన వస్త్రాలను ధరించి, నడుముకు తోలుదట్టీ కట్టుకునేవాడు. అతడు మిడతలు అడవి తేనె తినేవాడు. ఆయన ఇచ్చిన సందేశమిది: “నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను, కాని ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తారు.”
ఆ సమయంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందారు. యేసు నీటిలో నుండి బయటకు వస్తుండగా, ఆకాశం చీలి దేవుని ఆత్మ పావురంలాగ ఆయన మీదికి దిగి రావడం అతడు చూశాడు. అంతేకాక పరలోకం నుండి ఒక స్వరం: “నీవు నా కుమారుడవు, నేను ప్రేమించేవాడవు; నీయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను” అని చెప్పడం వినబడింది.
వెంటనే ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు, ఆయన సాతానుచేత శోధించబడుతూ, నలభై రోజులు అరణ్యంలో ఉన్నారు. అడవి మృగాల మధ్య ఆయన ఉన్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.
యోహాను చెరసాలలో వేయబడిన తర్వాత, యేసు దేవుని సువార్తను ప్రకటిస్తూ, గలిలయకు వెళ్లారు. ఆయన, “కాలము పూర్తయింది. దేవుని రాజ్యం సమీపించింది. పశ్చాత్తాపపడండి, సువార్తను నమ్మండి!” అని చెప్పారు.
యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు, సీమోను అతని సోదరుడు అంద్రెయ సముద్రంలో వల వేయడం ఆయన చూశారు, వారు జాలరులు. యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు. వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.
ఆయన ఇంకా కొంత దూరం వెళ్లినప్పుడు, జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను పడవలో ఉండి, తమ వలలను సిద్ధం చేసుకోవడం ఆయన చూశారు వెంటనే ఆయన వారిని పిలిచారు, వారు ఆలస్యం చేయకుండ తమ తండ్రియైన జెబెదయిని పనివారితో పాటు పడవలో విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.
వారు కపెర్నహూముకు వెళ్లారు, సబ్బాతు దినం వచ్చినప్పుడు, యేసు సమాజమందిరంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లా కాక, ఒక అధికారం కలవానిగా వారికి బోధించారు. అంతలో వారి సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒకడు, “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరో నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడవు!” అని బిగ్గరగా కేకలు వేశాడు.
అందుకు యేసు, “మాట్లాడకు!” అని అంటూ, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. అప్పుడు ఆ అపవిత్రాత్మ వానిని బలంగా కుదిపి పెద్ద కేకలు వేసి వానిలో నుండి బయటకు వచ్చేసింది.
ప్రజలందరు ఆశ్చర్యపడి, “ఇదేంటి? అధికారంతో కూడిన ఒక క్రొత్త బోధ! ఆయన అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి ఆయనకు లోబడుతున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు. ఇలా ఆయనను గురించిన వార్త గలిలయ ప్రాంతమంతా వేగంగా వ్యాపించింది.