మీకా 2
2
మానవ ప్రణాళికలు, దేవుని ప్రణాళికలు
1తమ పడకల మీద పాపపు ఆలోచనలు చేసేవారికి,
కీడును తలంచే వారికి శ్రమ!
వారికి అధికారం ఉంది కాబట్టి,
ఉదయకాల వెలుగులో వారు చెడు చేస్తారు.
2వారు భూములను ఆశించి ఆక్రమించుకుంటారు,
ఇళ్ళను ఆశించి తీసుకుంటారు.
వారు ప్రజలను మోసం చేసి వారి ఇళ్ళను లాక్కుంటారు,
ప్రజల నుండి వారి స్వాస్థ్యాన్ని దోచుకుంటారు.
3కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే:
“నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను,
దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు.
అది విపత్తు కాలం కాబట్టి
మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు.
4ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు;
మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు:
‘మేము పూర్తిగా పాడైపోయాం;
నా ప్రజల ఆస్తి విభజింపబడింది
ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు!
ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”
5అందువల్ల చీట్లువేసి భూమిని కొలమానం ప్రకారం పంచడానికి
యెహోవా సమాజంలో ఎవరూ ఉండరు.
అబద్ధ ప్రవక్తలు
6“ప్రవచించకండి” అని వారి ప్రవక్తలు అంటారు,
“వీటి గురించి ప్రవచించకండి;
మనకు అవమానం కలుగకూడదు.”
7యాకోబు వారసులారా,
“యెహోవా సహనం కోల్పోయారా?
ఆయన ఇలాంటి పనులు చేస్తారా?” అని అనవచ్చా?
“యథార్థంగా ప్రవర్తించే వారికి
నా మాటలు క్షేమం కలిగించవా?
8ఇటీవల నా ప్రజలే
శత్రువుగా లేచారు.
యుద్ధం నుండి తిరిగి వచ్చే మనుష్యుల్లా,
నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి నుండి
సంపన్న వస్త్రాన్ని మీరు లాగివేస్తారు.
9నా ప్రజల స్త్రీలను
వారికిష్టమైన గృహాలలో నుండి వెళ్లగొడతారు.
వారి పిల్లల మీద ఎప్పటికీ
నా ఆశీర్వాదం ఉండకుండా చేస్తున్నారు.
10మీరు లేచి వెళ్లిపోండి!
ఇది మీ విశ్రాంతి స్థలం కాదు,
ఎందుకంటే అది అపవిత్రమైంది,
అది పూర్తిగా నిర్మూలమైంది.
11ఒకవేళ అబద్ధికుడు మోసగాడు వచ్చి,
‘ద్రాక్షరసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచిస్తాను’
అంటే, వాడే ఈ ప్రజలకు తగిన ప్రవక్త!
విమోచన వాగ్దానం
12“యాకోబూ, నేను ఖచ్చితంగా మీ అందరిని సమకూరుస్తాను;
నేను ఖచ్చితంగా మిగిలిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాను.
నేను వారిని గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా,
పచ్చిక బయళ్లలోని మందలా సమకూరుస్తాను,
ఈ స్థలం మనుష్యులతో కిటకిటలాడుతుంది.
13అడ్డును పడగొట్టేవాడు వారికి ముందుగా వెళ్తాడు;
వారు గుమ్మాన్ని పడగొట్టి, దానిగుండా బయటకు వెళ్తారు.
వారి రాజు వారికి ముందుగా వెళ్తాడు,
యెహోవా వారికి నాయకునిగా ఉంటారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
మీకా 2: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.