అయితే జీవానికి వెళ్లే ద్వారం చిన్నగా, దాని దారి ఇరుకుగా ఉంటుంది, కొంతమందే దాని కనుగొంటారు. “అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. ముళ్లపొదల్లో ద్రాక్షపండ్లను, పల్లేరు మొక్కల్లో అంజూరపు పండ్లను ప్రజలు కోస్తారా? అలాగే, ప్రతి మంచిచెట్టు మంచిపండ్లు కాస్తుంది. చెడ్డచెట్టు చెడ్డపండ్లు కాస్తుంది. మంచిచెట్టు చెడ్డపండ్లు కాయదు, చెడ్డచెట్టు మంచిపండ్లు కాయదు. మంచిపండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. “ ‘ప్రభువా, ప్రభువా’ అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోకరాజ్యంలో ప్రవేశించరు, కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరట ప్రవచించలేదా? నీ పేరట దయ్యాలను వెళ్లగొట్టలేదా? నీ పేరట అనేక అద్బుతాలను చేయలేదా?’ అని అంటారు. అప్పుడు నేను వారితో, ‘మీరు ఎవరో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అని స్పష్టంగా చెప్తాను. “కావున నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసే ప్రతి ఒక్కరు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని లాంటివారు. వాన కురిసి, వరదలు వచ్చి, గాలులు వీచి, ఆ ఇంటిని కొట్టాయి; అయినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద ఉంది. కానీ నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని లాంటివారు. వాన కురిసి, వరదలు వచ్చి, గాలులు వీచి, ఆ ఇంటిని కొట్టాయి, అప్పుడు గొప్ప శబ్దంతో అది కూలిపోయింది.” యేసు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా కాక, ఒక అధికారం కలవానిగా బోధించారు.
Read మత్తయి 7
వినండి మత్తయి 7
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: మత్తయి 7:14-29
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు