మత్తయి సువార్త 4

4
యేసు అరణ్యంలో పరీక్షించబడుట
1అప్పుడు యేసు అపవాది చేత శోధించబడడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకెళ్లాడు. 2నలభై రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకు ఆకలివేసింది. 3శోధకుడు యేసు దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మారమని చెప్పు” అని అన్నాడు.
4అందుకు యేసు, “ ‘మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు’#4:4 ద్వితీ 8:3 అని వ్రాయబడి ఉంది” అని జవాబిచ్చారు.
5అప్పుడు అపవాది ఆయనను పవిత్ర పట్టణానికి తీసుకుని వెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, 6“నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది:
“ ‘నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు,
నీ పాదాలకు ఒక్క రాయి తగలకుండ,
వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’#4:6 కీర్తన 91:11,12
అని అన్నాడు.
7అందుకు యేసు అతనితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’#4:7 ద్వితీ 6:16 అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు.
8మరల అపవాది ఆయనను ఒక ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్లి ప్రపంచంలోని రాజ్యాలన్నిటినీ వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు. 9వాడు యేసుతో, “నీవు నా ముందు తలవంచి నన్ను ఆరాధిస్తే వీటన్నిటిని నీకు ఇస్తాను” అన్నాడు.
10అందుకు యేసు, “సాతానా! నా దగ్గర నుండి వెళ్లిపో! నీ ప్రభువైన దేవున్ని ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉంది”#4:10 ద్వితీ 6:13 అని చెప్పారు.
11అపవాది ఆయనను విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు సేవ చేశారు.
బోధించడం మొదలుపెట్టిన యేసు
12యోహాను చెరసాలలో వేయబడ్డాడని విన్న తర్వాత యేసు గలిలయకు వెళ్లారు. 13ఆయన నజరేతును వదిలి జెబూలూను, నఫ్తాలి ప్రాంతపు సముద్రతీరాన ఉన్న కపెర్నహూముకు వెళ్లారు. వారు అక్కడ కొన్ని రోజులు నివసించారు. 14ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన:
15“జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో,
యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో,
యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతంలో,
16చీకటిలో నివసిస్తున్న ప్రజలు,
గొప్ప వెలుగును చూశారు;
మరణచ్ఛాయలో నివసించేవారి మీద
ఒక వెలుగు ప్రకాశించింది”#4:16 యెషయా 9:1,2
అనే మాటలు నెరవేరడానికి ఇలా జరిగింది.
17అప్పటినుండి యేసు, “పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అని ప్రకటించడం మొదలుపెట్టారు.
యేసు తన మొదటి శిష్యులను పిలుచుట
18యేసు గలిలయ సముద్రతీరాన నడుస్తున్నప్పుడు పేతురు అని పిలువబడే సీమోను, అతని సోదరుడు అంద్రెయ అనే ఇద్దరు సోదరులు సముద్రంలో వలలు వేయడం ఆయన చూశారు. వారు జాలరులు. 19యేసు వారితో, “నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తాను” అన్నారు. 20వెంటనే వారు తమ వలలను విడిచి యేసును వెంబడించారు.
21ఆయన అక్కడినుండి వెళ్తూ జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనే మరో ఇద్దరు సోదరులను చూశారు. వారు తమ తండ్రి జెబెదయితో కలసి పడవలో ఉండి తమ వలలను సిద్ధం చేసుకుంటున్నారు. యేసు వారిని పిలిచారు. 22వెంటనే వారు పడవను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు.
రోగులను స్వస్థపరచిన యేసు
23యేసు గలిలయ ప్రాంతమంతా తిరుగుతూ, వారి సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ప్రజల మధ్యలో ప్రతి వ్యాధిని రోగాన్ని బాగుచేస్తూ ఉన్నారు. 24ఆయన గురించి సిరియా దేశమంతటా తెలిసి ప్రజలు రకరకాల వ్యాధులతో, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నవారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛ రోగం గలవారిని పక్షవాత రోగులను యేసు దగ్గరకు తీసుకుని రాగా ఆయన వారిని బాగుచేశారు. 25గలిలయ, దెకపొలి,#4:25 అంటే, పది పట్టణాలు యెరూషలేము, యూదయ, యొర్దాను అవతలి వైపు ఉన్న ప్రాంతాల నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మత్తయి సువార్త 4: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

మత్తయి సువార్త 4 కోసం వీడియోలు