యెహోషువ 4

4
1ప్రజలంతా యొర్దాను నది దాటిన తర్వాత యెహోవా యెహోషువకు, 2“ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున ప్రజల్లో నుండి పన్నెండుమందిని ఎన్నుకుని, 3యొర్దాను మధ్య నుండి, అంటే యాజకులు నిలబడి ఉన్న చోటుకు కుడివైపు నుండి పన్నెండు రాళ్లను తీసుకుని, వాటిని మీతో పాటు మోసుకువెళ్లి, ఈ రాత్రి మీరు బసచేసే స్థలంలో వాటిని ఉంచమని వారికి చెప్పు” అని ఆజ్ఞాపించారు.
4కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయుల నుండి తాను నియమించిన పన్నెండుమందిని ప్రతి గోత్రం నుండి ఒకరి చొప్పున పిలిచి, 5వారితో, “మీ దేవుడైన యెహోవా మందసానికి ముందుగా యొర్దాను మధ్యలోనికి వెళ్లండి. ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున మీలో ప్రతి ఒక్కరూ తన భుజంపై ఒక రాయిని మోయాలి, 6అది మీ మధ్య ఒక సూచనగా ఉంటుంది. భవిష్యత్తులో, ‘ఈ రాళ్లకు అర్థమేంటి?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు, 7యెహోవా నిబంధన మందసం యొర్దాను దాటుతున్నప్పుడు యొర్దాను నీళ్లు ఆగిపోయాయి. కాబట్టి ఈ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు నిత్యం జ్ఞాపకార్థంగా ఉంటాయి అని వారికి చెప్పండి.”
8కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోషువ ఆజ్ఞాపించినట్లు చేశారు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క ప్రకారం వారు యొర్దాను మధ్య నుండి పన్నెండు రాళ్లను తీసుకొని తమతో పాటు తమ శిబిరానికి తెచ్చి వారు ఉన్నచోట పెట్టారు. 9యెహోషువ ఆ పన్నెండు రాళ్లను యొర్దాను మధ్యలో, నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు నిలబడిన స్థలంలో నిలబెట్టించాడు. నేటి వరకు అవి అక్కడే ఉన్నాయి.
10మోషే యెహోషువకు నిర్దేశించినట్లుగా యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన ప్రతిదీ ప్రజలు చేసే వరకు మందసాన్ని మోసిన యాజకులు యొర్దాను మధ్యలో నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరత్వరగా దాటి వెళ్లారు, 11వారంతా దాటిన వెంటనే ప్రజలు చూస్తుండగానే యెహోవా మందసాన్ని మోస్తూ యాజకులు అవతలి వైపుకు దాటి వచ్చారు. 12ఇశ్రాయేలీయులకు ముందుగా రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారు మోషే వారికి నిర్దేశించినట్టుగా యుద్ధానికి సిద్ధపడి దాటారు. 13యుద్ధానికి సిద్ధపడిన దాదాపు నలభై వేలమంది ఆయుధాలు ధరించి యెహోవా ఎదుట దాటి యుద్ధానికి యెరికో మైదానాలకు చేరుకున్నారు.
14ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులందరి ముందు యెహోషువను గొప్ప చేశారు; వారు మోషేను గౌరవించినట్టు యెహోషువ జీవించినంత కాలం అతన్ని గౌరవించారు.
15తర్వాత యెహోవా యెహోషువతో, 16“నిబంధన#4:16 హెబ్రీలో సాక్ష్యపు మందసం మందసాన్ని మోసే యాజకులను యొర్దానులో నుండి ఇవతలికి రమ్మని ఆజ్ఞాపించు” అని చెప్పారు.
17కాబట్టి యెహోషువ, “యొర్దానులో నుండి పైకి వచ్చేయండి” అని యాజకులను ఆజ్ఞాపించాడు.
18యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను మధ్యలో నుండి పైకి వచ్చారు. వారి అరికాళ్ల ఆరిన నేలను తాకగానే యొర్దాను నీరు ఎప్పటిలాగే పొంగుతూ ప్రవహించాయి.
19మొదటి నెల పదవ రోజున ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు సరిహద్దులోని గిల్గాలులో బస చేశారు. 20వారు యొర్దాను నుండి తీసిన పన్నెండు రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలబెట్టించాడు. 21అతడు ఇశ్రాయేలీయులతో, “భవిష్యత్తులో మీ సంతతివారు తమ తల్లిదండ్రులను, ‘ఈ రాళ్లకు అర్థం ఏంటి?’ అని అడిగినప్పుడు, 22మీరు వారితో, ‘ఇశ్రాయేలీయులు ఆరిన నేలమీద ఈ యొర్దాను నదిని దాటారు’ అని చెప్పాలి. 23ఎందుకంటే మీరు యొర్దానును దాటే వరకు మీ దేవుడైన యెహోవా మీ ఎదుట యొర్దానును ఆరిపోయేలా చేశారు. మేము ఎర్ర సముద్రాన్ని దాటే వరకు మా ఎదుట దాన్ని ఆరేలా చేసినట్టు మీ దేవుడైన యెహోవా ఇప్పుడు యొర్దానును చేశారు. 24యెహోవా హస్తం శక్తివంతమైనదని భూమిపై ఉన్న ప్రజలందరూ తెలుసుకునేలా, మీరు మీ దేవుడైన యెహోవాకు ఎల్లప్పుడూ భయపడేలా ఆయన ఇలా చేశారు.”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెహోషువ 4: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి