యెహోషువ 10
10
సూర్యుడు నిలిచిపోవుట
1యెహోషువ హాయిని పట్టుకుని పూర్తిగా నాశనం#10:1 ఇక్కడ హెబ్రీ పదం వస్తువులను లేదా వ్యక్తులను తిరిగి మార్చుకోలేని విధంగా యెహోవాకు అప్పగించడాన్ని సూచిస్తుంది చేసి, యెరికోకు దాని రాజుకు చేసినట్లు హాయికి దాని రాజుకు చేశాడని, గిబియోను ప్రజలు ఇశ్రాయేలుతో సమాధాన ఒప్పందం చేసుకుని వారితో కలిసిపోయారని యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు విన్నాడు. 2అతడు, అతని ప్రజలు దీని గురించి చాలా భయపడ్డారు, ఎందుకంటే గిబియోను పట్టణం రాజధానుల్లో ఒక ముఖ్యమైన పట్టణం; అది హాయి కంటే పెద్దది, దాని మనుష్యులందరు మంచి పోరాట యోధులు. 3కాబట్టి యెరూషలేము రాజైన అదోనీ-సెదెకు హెబ్రోను రాజైన హోహాము, యర్మూతు రాజైన పిరాము, లాకీషు రాజైన యాఫీయా, ఎగ్లోను రాజైన దెబీరులకు, 4“రండి గిబియోనుపై దాడి చేయడానికి నాకు సహాయం చేయండి, ఎందుకంటే గిబియోను యెహోషువతో ఇశ్రాయేలీయులతో సమాధాన ఒప్పందం చేసుకుంది” అని విన్నవించుకున్నారు.
5అమోరీయుల అయిదుగురు రాజులు అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను రాజులు ఒకటిగా చేరి, తమ సైనికులందరితో కలిసి వెళ్లి గిబియోనీయులతో యుద్ధం చేశారు.
6గిబియోనీయులు గిల్గాలులోని శిబిరంలో ఉన్న యెహోషువకు: “నీ దాసులను విడిచిపెట్టక త్వరగా మా దగ్గరకు వచ్చి సహాయం చేసి మమ్మల్ని రక్షించండి! కొండ సీమలోని అమోరీయుల రాజులందరూ ఒక్కటిగా మా మీదికి దండెత్తి వచ్చారు” అని అంటూ సమాచారం పంపారు.
7కాబట్టి యెహోషువ తన సైన్యమంతటితో, అత్యుత్తమ పోరాట యోధులందరితో సహా గిల్గాలు నుండి బయలుదేరాడు. 8యెహోవా యెహోషువతో, “వారికి భయపడకు; నేను వారిని నీ చేతికి అప్పగించాను. వారిలో ఒక్కరు మీ ముందు నిలబడలేరు” అని చెప్పారు.
9గిల్గాలు నుండి రాత్రంతా నడిచి వచ్చిన తర్వాత, యెహోషువ హఠాత్తుగా వారి మీద దాడి చేశాడు. 10యెహోవా వారిని ఇశ్రాయేలీయుల ముందు గందరగోళంలో పడేశారు, కాబట్టి ఇశ్రాయేలీయులు గిబియోనులో వారిని పూర్తిగా ఓడించారు. ఇశ్రాయేలీయులు బేత్-హోరోనుకు పైకి వెళ్లే దారిలో అజేకా, మక్కేదా వరకు వారిని వెంటాడి నరికివేశారు. 11వారు బేత్-హోరోను నుండి అజేకాకు వెళ్లే దారిలో ఇశ్రాయేలీయుల నుండి పారిపోతుండగా, యెహోవా వారిపై పెద్ద వడగళ్ళు కురిపించారు, ఇశ్రాయేలీయుల ఖడ్గాల చేత చంపబడినవారి కంటే వడగళ్ళతో చచ్చినవారే ఎక్కువ.
12యెహోవా అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించిన రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల సమక్షంలో యెహోవాతో ఇలా అన్నాడు:
“సూర్యుడా, గిబియోనుపై నిలిచిపో,
చంద్రుడా, అయ్యాలోను లోయ పైగా ఆగిపో.”
13ప్రజలు తమ శత్రువులపై పూర్తి విజయం సాధించే వరకు,
సూర్యుడు నిలిచిపోయాడు,
చంద్రుడు ఆగిపోయాడు,
అని యాషారు#10:13 యాషారు అంటే వీరులు లేదా శూరులు వ్రాసిన వీరుల గ్రంథంలో వ్రాయబడినట్లుగా జరిగింది.
సూర్యుడు ఆకాశం మధ్యలో ఆగి, దాదాపు ఒక రోజు ఆలస్యమయ్యాడు. 14యెహోవా ఒక మానవుడి మాట విన్న ఆ రోజులాంటిది ఇంకొకటి అంతకుముందుగానీ ఆ తర్వాత గాని లేదు. నిజంగా యెహోవా ఇశ్రాయేలీయుల కోసం యుద్ధం చేశారు!
15ఆ తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు గిల్గాలులో ఉన్న శిబిరానికి తిరిగి వచ్చాడు.
అయిదుగురు అమోరీయుల రాజులు చంపబడుట
16అప్పుడు అయిదుగురు రాజులు పారిపోయి మక్కేదాలోని గుహలో దాక్కున్నారు. 17అయిదుగురు రాజులు మక్కేదాలోని గుహలో దాక్కున్నట్టు యెహోషువకు తెలిసినప్పుడు, 18యెహోషువ ఇలా అన్నాడు, “గుహ ద్వారానికి పెద్ద పెద్ద రాళ్లు దొర్లింది మూసివేసి దానికి మనుష్యులను కాపలా పెట్టండి. 19ఆగవద్దు; మీ శత్రువులను వెంటాడండి! వెనుక నుండి వారిపై దాడి చేయండి, వారిని వారి పట్టణాలకు చేరనివ్వవద్దు, ఎందుకంటే మీ దేవుడైన యెహోవా వారిని మీ చేతికి అప్పగించారు.”
20కాబట్టి యెహోషువ, ఇశ్రాయేలీయులు వారిని పూర్తిగా ఓడించారు, అయితే ప్రాణాలతో బయటపడిన కొంతమంది కోటగోడలు గల తమ పట్టణాలకు చేరుకున్నారు. 21అప్పుడు సైన్యమంతా మక్కేదాలోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు క్షేమంగా తిరిగి వచ్చింది. ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు.
22యెహోషువ, “గుహ ద్వారం తెరిచి ఆ అయిదుగురు రాజులను నా దగ్గరకు తీసుకురండి” అని అన్నాడు. 23కాబట్టి వారు ఆ అయిదుగురు రాజులను అనగా యెరూషలేము, హెబ్రోను, యర్మూతు, లాకీషు, ఎగ్లోను యొక్క రాజులను గుహ నుండి బయటకు తెచ్చారు. 24ఆ రాజులను వారు యెహోషువ దగ్గరకు తీసుకువచ్చాక, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిపించి తనతో వెళ్లి వచ్చిన సేనాధిపతులతో, “నా దగ్గరకు రండి, మీ పాదాలు ఈ రాజుల మెడల మీద పెట్టండి” అని చెప్పాడు. కాబట్టి వారు ముందుకు వచ్చి తమ పాదాలను వారి మెడల మీద పెట్టారు.
25అప్పుడు యెహోషువ వారితో, “భయపడకండి; నిరుత్సాహపడకండి. నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. మీరు పోరాడబోయే శత్రువులందరికీ యెహోవా ఇలాగే చేస్తారు” అన్నాడు. 26అప్పుడు యెహోషువ రాజులను చంపి వారి శవాలను అయిదు స్తంభాలకు వ్రేలాడదీశాడు, సాయంత్రం వరకు వారి శవాలు స్తంభాలకు వ్రేలాడి ఉన్నాయి.
27సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆజ్ఞ ఇవ్వగా వారు వాటిని స్తంభాల నుండి దించి, వారు దాక్కున్న గుహలోకి విసిరి ఆ గుహ ముఖద్వారం దగ్గర వారు పెద్ద రాళ్లను ఉంచారు, అవి నేటికీ ఉన్నాయి.
దక్షిణ పట్టణాలను జయించుట
28ఆ రోజు యెహోషువ మక్కేదాను స్వాధీనపరచుకున్నాడు. అతడు ఆ పట్టణాన్ని దాని రాజును కత్తితో చంపి, దానిలోని వారందరినీ పూర్తిగా నాశనం చేశాడు. ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లుగా మక్కేదా రాజుకు చేశాడు.
29అప్పుడు యెహోషువ, అతనితో ఉన్న ఇశ్రాయేలీయులందరు మక్కేదా నుండి లిబ్నాకు వెళ్లి దానిపై దాడి చేశారు. 30యెహోవా ఆ పట్టణాన్ని దాని రాజును ఇశ్రాయేలు చేతికి అప్పగించారు. యెహోషువ ఆ పట్టణాన్ని, దానిలోని వారందరినీ కత్తితో చంపాడు. అక్కడ అతడు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లు దాని రాజుకు చేశాడు.
31అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లిబ్నా నుండి లాకీషుకు వెళ్లి అక్కడ తన దళాలను మోహరించి దాని మీద దాడి చేశాడు. 32యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు. రెండవ రోజు యెహోషువ దానిని పట్టుకుని లిబ్నాకు చేసినట్లే ఆ పట్టణాన్ని, అందులోని వారందరినీ ఖడ్గంతో చంపాడు. 33ఇంతలో గెజెరు రాజైన హోరాము లాకీషుకు సహాయం చేయడానికి రాగా అయితే యెహోషువ ఎవరూ ప్రాణాలతో మిగులకుండా అతన్ని అతని సైన్యాన్ని హతం చేశాడు.
34అప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు లాకీషు నుండి ఎగ్లోనుకు వెళ్లారు; దానికి వ్యతిరేకంగా వారు తమ సైన్యాన్ని మోహరింపజేసి దాని మీద దాడి చేశాడు. 35వారు లాకీషుకు చేసినట్లుగా అదే రోజు దానిని పట్టుకుని ఖడ్గంతో అక్కడ ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు.
36ఎగ్లోను నుండి యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు హెబ్రోనుకు వెళ్లి దాని మీద దాడి చేశారు. 37వారు దానిని పట్టుకుని దానిని దాని రాజును దానికి చెందిన అన్ని గ్రామాలను దానిలో ఉన్నవారినందరిని ఖడ్గంతో చంపారు. ఎగ్లోనుకు చేసినట్టే దానిని దానిలో ఉన్నవారినందరిని పూర్తిగా నాశనం చేశారు.
38తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో పాటు వెనుకకు వచ్చి దెబీరు మీద దాడి చేశాడు. 39వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దాని గ్రామాలను పట్టుకుని కత్తితో చంపారు. అందులో ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు. వారు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. లిబ్నాకు, దాని రాజుకు, హెబ్రోనుకు చేసినట్లే వారు దెబీరుకు, దాని రాజుకు చేశారు.
40కాబట్టి యెహోషువ కొండ ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన్ని, పడమటి పర్వతాలను, కొండ వాలులతో సహా మొత్తం ప్రాంతాన్ని వాటి రాజులందరితో పాటు స్వాధీనం చేసుకున్నాడు. ఎవ్వరినీ మిగల్చలేదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లుగానే, ఊపిరితో ఉన్నవారందరిని అతడు పూర్తిగా నాశనం చేశాడు. 41యెహోషువ వారిని కాదేషు బర్నియా నుండి గాజా వరకు, గోషేను ప్రాంతం నుండి గిబియోను వరకు జయించాడు. 42ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలు కోసం పోరాడారు కాబట్టి యెహోషువ ఈ రాజులందరినీ, వారి దేశాలను ఒకే దండయాత్రలో జయించాడు.
43తర్వాత యెహోషువ ఇశ్రాయేలీయులందరితో కలిసి గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యెహోషువ 10: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.