యోబు 22
22
ఎలీఫజు
1అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలా జవాబిచ్చాడు:
2“ఒక మనిషి దేవునికేమైనా ప్రయోజనం చేయగలడా?
ఒక జ్ఞానియైన వ్యక్తైనా సరే ఆయనకు ప్రయోజనం చేయగలడా?
3నీవు నీతిమంతుడవైతే సర్వశక్తిమంతునికి కలిగే ఆనందమేమిటి?
నీ మార్గాలు నిందలేనివైతే ఆయనకు వచ్చే లాభం ఏమిటి?
4“నీకున్న భయభక్తులను బట్టి ఆయన నిన్ను గద్దిస్తారా?
దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తారా?
5నీ దుష్టత్వం గొప్పది కాదా?
నీ పాపాలు అంతులేనివి కావా?
6ఏ కారణం లేకుండానే నీ సోదరుల దగ్గర తాకట్టు తీసుకున్నావు;
నీవు ప్రజల బట్టలు లాక్కుని, వారిని నగ్నంగా వదిలివేసావు.
7-8సొంత భూమి కలిగి ఉండి, నీవు అధికారంలో ఉండి,
ఒక గౌరవం కలిగినవాడవై, స్థాయికి తగినట్టుగా జీవిస్తూ కూడా,
నీవు అలసిపోయినవారికి నీళ్లు ఇవ్వలేదు
ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టకుండ వెనుకకు తీసుకున్నావు.
9విధవరాండ్రను వట్టి చేతులతో పంపివేసావు
తండ్రిలేనివారి బలాన్ని అణగద్రొక్కావు.
10అందుకే ఉరులు నిన్ను చుట్టుకున్నాయి,
ఆకస్మిక ప్రమాదం నిన్ను భయపెడుతుంది.
11అందుకే ఏమీ చూడలేనంతగా చీకట్లు నిన్ను కమ్ముకున్నాయి,
వరదనీరు పొంగి నిన్ను ముంచేస్తున్నాయి.
12“దేవుడు ఎత్తైన ఆకాశాల్లో లేరా?
పైనున్న నక్షత్రాలను చూడు అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయి!
13అయినా నీవు, ‘దేవునికేమి తెలుసు?
గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం చెప్పగలడా?
14ఆకాశమండలం పైన ఆయన తిరుగుచున్నాడు కాబట్టి
మేఘాలు ఆయనను కప్పివేశాయి ఆయన చూడలేడు’ అని అంటున్నావు.
15దుష్టులు నడిచిన పాత మార్గంలోనే
నీవు కూడా నడుస్తావా?
16తమ గడువు తీరకముందే వారు కొనిపోబడ్డారు,
వారి పునాదులు వరదల్లో కొట్టుకుపోయాయి.
17దేవుడు వారి గృహాలను మంచివాటితో నింపినప్పటికి
వారు దేవునితో, ‘మమ్మల్ని విడిచిపో!
18సర్వశక్తిమంతుడైన దేవుడు మాకేమి చేయగలడు?’ అంటారు
కాబట్టి దుర్మార్గుల ప్రణాళికలకు నేను దూరంగా ఉంటాను.
19-20‘మన పగవారు నాశనమైపోయారు,
వారి సంపదను అగ్ని కాల్చివేసిందని’ చెప్పుకుంటూ,
ఖచ్చితంగా నీతిమంతులు వారి నాశనాన్ని చూసి సంతోషిస్తారు;
నిర్దోషులు వారిని ఎగతాళి చేస్తారు.
21“దేవునికి లొంగి ఆయనతో నీవు సమాధానంగా ఉండు;
దీనివలన నీకు వృద్ధి కలుగుతుంది.
22ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అంగీకరించు
ఆయన మాటలను నీ హృదయంలో నిలుపుకో.
23ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే,
నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు:
నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి
24నీ బంగారాన్ని మట్టిలో
ఓఫీరు బంగారాన్ని కనుమల రాళ్లలో పారవేస్తే,
25అప్పుడు సర్వశక్తిమంతుడు నీకు బంగారం,
నీకు ప్రశస్తమైన వెండి అవుతాడు.
26అప్పుడు నీవు ఖచ్చితంగా సర్వశక్తిమంతునిలో ఆనందిస్తావు
దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తుతావు.
27నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన నీ మనవి వింటారు,
నీవు నీ మ్రొక్కుబడులను చెల్లిస్తావు.
28నీవు ఏది నిర్ణయించుకొంటే అది నీకు జరుగుతుంది,
నీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది.
29ప్రజలు తగ్గించబడినప్పుడు, ‘వారిని పైకి లేవనెత్తు!’ అని నీవు అంటావు
అప్పుడు ఆయన దీనులను రక్షిస్తారు.
30నిర్దోషి కాని వానిని కూడా ఆయన విడిపిస్తారు,
నీ చేతుల శుద్ధి కారణంగా వారికి విడుదల కలుగుతుంది.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 22: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.