యోబు 19
19
యోబు
1అప్పుడు యోబు ఇచ్చిన జవాబు:
2“ఎంతకాలం మీరు నన్ను వేధించి
మాటలతో నలుగగొడతారు?
3ఇప్పటికి పదిసార్లు మీరు నన్ను నిందించారు;
సిగ్గులేకుండా మీరు నాపై దాడి చేశారు.
4ఒకవేళ నేను తప్పు చేసినట్లైతే
నా తప్పు నా మీదికే వస్తుంది.
5మిమ్మల్ని మీరు నా కంటే హెచ్చించుకొని
నా మీద నా అవమానాన్ని మోపితే,
6దేవుడు నాకు అన్యాయం చేశారని
నా చుట్టూ ఆయన తన వల వేశారని తెలుసుకోండి.
7“నాపై ‘దౌర్జన్యం జరుగుతుంది’ అని నేను మొరపెట్టినా నాకు జవాబు రాదు;
సహాయం చేయమని అడిగినా నాకు న్యాయం జరుగదు.
8నేను దాటకుండా ఆయన నా దారిని మూసివేశారు;
నా త్రోవలను చీకటితో కప్పివేశారు.
9ఆయన నా గౌరవాన్ని తొలగించారు.
నా తలపై నుండి కిరీటాన్ని తీసివేశారు.
10నేను నశించే వరకు అన్నివైపులా ఆయన నన్ను విరగ్గొట్టారు;
చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణను పెల్లగించారు.
11నా మీద ఆయన కోపం రగులుకుంది;
ఆయన నన్ను తన శత్రువుగా భావించారు.
12ఆయన సైన్యాలన్నీ ఒక్కటిగా వచ్చి,
నాకు విరోధంగా ముట్టడి దిబ్బలు వేసి
నా గుడారం చుట్టూ మకాం వేశారు.
13“ఆయన నా సహోదరులను నాకు దూరం చేశారు;
నా పరిచయస్థులందరూ నాకు పూర్తిగా పరాయివారయ్యారు.
14నా బంధువులు నా నుండి దూరంగా వెళ్లిపోయారు;
నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయారు.
15నా అతిథులకు నా ఇంటి పనికత్తెలకు నేను విదేశీయునిగా ఉన్నాను;
పరాయివానిగా చూసినట్లు వారు నన్ను చూస్తున్నారు.
16నేను పనివాన్ని పిలిచినా, నేను వాన్ని బ్రతిమాలినా,
వాడు పలకడం లేదు.
17నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యం కలిగిస్తుంది;
నా కుటుంబం నన్ను అసహ్యించుకుంటుంది.
18చిన్నపిల్లలు కూడా నన్ను దూషిస్తున్నారు;
నేను కనిపిస్తే నన్ను ఎగతాళి చేస్తున్నారు.
19నా ప్రాణస్నేహితులంతా నన్ను అసహ్యించుకుంటున్నారు;
నేను ప్రేమించినవారు నా మీద తిరగబడుతున్నారు.
20నేను అస్థిపంజరంలా తయారయ్యాను.
నా పళ్ల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది.
21“జాలి పడండి, నా స్నేహితులారా, నాపై జాలి చూపండి
ఎందుకంటే దేవుని హస్తం నన్ను మొత్తింది.
22దేవుడు వెంటాడినట్లు మీరు కూడా నన్నెందుకు వెంటాడుతున్నారు?
నా శరీరం నాశనమైపోయింది, ఇది చాలదా?
23“నా మాటలు ఒక గ్రంథపుచుట్టలో,
వ్రాయబడి ఉంటే బాగుండేది!
24అవి నిత్యం ఉండేలా ఇనుపగంటతో రాతి మీద చెక్కి
సీసంతో నింపితే బాగుండేది!
25నా విమోచకుడు సజీవుడని,
తుదకు ఆయన భూమి#19:25 లేదా నా సమాధి మీద నిలబడతారని నాకు తెలుసు.
26నా చర్మం నాశనమైపోయిన తర్వాత
నా శరీరంతో నేను దేవుని చూస్తాను.
27మరొకరు కాదు, నేనే
నా కళ్ళతో స్వయంగా దేవుని చూస్తాను.
నా హృదయం నాలో ఎంత ఆరాటపడుతుంది!
28“ఒకవేళ మీరు, ‘దీనికంతటికి మూలకారణం అతనిలోనే ఉంది,
అతన్ని మనమెలా వేటాడాలి’ అని అనుకుంటే,
29మీరు ఖడ్గానికి భయపడాలి;
ఎందుకంటే కోపమనే ఖడ్గం శిక్షను విధిస్తుంది,
అప్పుడు మీరు తీర్పు ఉందని తెలుసుకుంటారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 19: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fte.png&w=128&q=75)
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.