యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు.
అందుకు పరిసయ్యులు, “నీ గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు; కాబట్టి నీ సాక్ష్యానికి విలువలేదు” అన్నారు.
యేసు జవాబిస్తూ, “నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నా నా సాక్ష్యం విలువైనదే, ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. మీరు మానవ ప్రమాణాలను బట్టి తీర్పు తీరుస్తారు; కాని నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒంటరిగా లేను, నేను నన్ను పంపిన తండ్రితో ఉన్నాను కాబట్టి నేను తీర్పు తీర్చినా నా నిర్ణయాలు న్యాయమైనవే. ఇద్దరు మనుష్యుల సాక్ష్యం విలువైనదని మీ ధర్మశాస్త్రంలోనే వ్రాయబడి ఉంది. నేను నా గురించి సాక్ష్యమిస్తున్నాను; నా మరొక సాక్షి నన్ను పంపిన తండ్రి” అన్నారు.
వారు ఆయనను, “నీ తండ్రి ఎక్కడ?” అని అడిగారు.
అప్పుడు యేసు, “మీకు నా గురించి కాని నా తండ్రిని గురించి కాని తెలియదు. మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని తెలుసుకుని ఉండేవారు” అని చెప్పారు. దేవాలయ ఆవరణంలో కానుకలపెట్టె ఉండే స్థలం దగ్గరగా బోధిస్తూ ఈ మాటలను చెప్పారు. అయినా వారెవరు ఆయనను పట్టుకోలేదు, ఎందుకంటే ఆయన గడియ ఇంకా రాలేదు.
యేసు మరొకసారి వారితో, “నేను వెళ్లిపోతున్నాను, మీరు నా కోసం వెదకుతారు, మీరు మీ పాపంలోనే చస్తారు. నేను వెళ్లే చోటికి మీరు రాలేరు” అన్నారు.
అందుకు యూదులు, “తనను తానే చంపుకుంటాడా? అందుకేనా ‘నేను వెళ్లే చోటికి మీరు రాలేరు’ అని చెప్తున్నాడు” అని అనుకున్నారు.
అప్పుడు ఆయన, “మీరు క్రిందుండే వారు; నేను పైనుండి వచ్చాను. మీరు ఈ లోకానికి చెందినవారు; నేను ఈ లోకానికి చెందిన వాడను కాను. మీరు మీ పాపంలోనే చస్తారు అని నేను చెప్పాను; నేనే ఆయనను అని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే చస్తారు” అని వారితో చెప్పారు.
వారు, “నీవు ఎవరవు?” అని అడిగారు.
అందుకు యేసు, “మొదటి నుండి నేను మీతో ఎవరినని చెప్పుతూ వచ్చానో ఆయననే. మిమ్మల్ని గురించి తీర్పు చెప్పడానికి నాకు చాలా సంగతులు ఉన్నాయి, కానీ నన్ను పంపినవాడు నమ్మదగినవాడు. ఆయన దగ్గర నుండి నేను విన్నవాటినే ఈ లోకానికి చెప్తున్నాను” అన్నారు.
ఆయన తన తండ్రి గురించి చెప్తున్నారని వారు గ్రహించలేకపోయారు. కాబట్టి యేసు, “మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనను, నా అంతట నేనేమి చేయను కాని తండ్రి నాకు బోధించిన వాటినే నేను చెప్తున్నానని మీరు తెలుసుకుంటారు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు; నేనెల్లప్పుడు ఆయనను సంతోషపరచే వాటినే చేస్తున్నాను, కాబట్టి ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు” అని చెప్పారు. ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగా చాలామంది ఆయనను నమ్మారు.
తనను నమ్మిన యూదులతో యేసు, “ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు. అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది” అని చెప్పారు.
వారు ఆయనతో, “మేము అబ్రాహాము సంతతివారం, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు మీరు విడుదల పొందుతారని ఎలా చెప్తారు?” అన్నారు.
యేసు వారితో, “పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే అని నేను మీతో చెప్పేది నిజము. కుటుంబంలో దాసునికి స్థిరమైన స్థానం ఉండదు. కానీ కుమారుడు ఎల్లప్పుడు కుటుంబ సభ్యునిగానే ఉంటాడు. అందుకే కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజంగా విడుదల పొందినవారిగా ఉంటారు. మీరు అబ్రాహాము సంతతివారని నాకు తెలుసు. అయినా మీలో నా మాటకు చోటు లేదు, కాబట్టి మీరు నన్ను చంపడానికి చూస్తున్నారు. నేను నా తండ్రి సన్నిధిలో చూసినవాటిని మీకు చెప్తున్నాను. మీరు మీ తండ్రి దగ్గరి విన్నవాటిని చేస్తున్నారు” అన్నారు.