యిర్మీయా 46
46
ఈజిప్టును గురించిన సందేశం
1ఇతర దేశాల గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:
2ఈజిప్టును గురించి:
యూదా రాజైన యోషీయా కుమారుడు యెహోయాకీము పరిపాలనలోని నాల్గవ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమీషులో ఓడిపోయిన ఈజిప్టు రాజైన ఫరో నెకో సైన్యానికి వ్యతిరేకంగా వచ్చిన సందేశం ఇది:
3“చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని
యుద్ధానికి బయలుదేరండి.
4గుర్రాలను సిద్ధం చేసుకోండి,
గుర్రాలను ఎక్కండి!
శిరస్త్రాణం ధరించి
బయలుదేరడానికి సిద్ధపడండి!
నీ ఈటెలను పదును చేయండి,
మీ కవచాన్ని ధరించండి!
5నేను చూస్తున్నదేంటి?
వారు భయభ్రాంతులకు గురవుతున్నారు,
వారు వెన్ను చూపుతున్నారు,
వారి యోధులు ఓడిపోయారు.
వారు వెనుకకు చూడకుండ
వేగంగా పారిపోతున్నారు,
అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
6“వేగంగా పరుగెత్తేవారు పారిపోలేరు,
బలాఢ్యులు తప్పించుకోలేరు.
ఉత్తరాన యూఫ్రటీసు నదీ తీరాన
వారు తడబడి పడిపోతున్నారు.
7“నైలు నది ప్రవాహంలా
ప్రవహించే నదుల్లా వస్తున్నదెవరు?
8ఈజిప్టు నైలు నదిలా,
ఉప్పెనలా ప్రవహిస్తుంది.
ఆమె ఇలా అన్నది, ‘నేను లేచి భూమిని కప్పివేస్తాను,
పట్టణాలను వాటిలోని ప్రజలను నాశనం చేస్తాను’ అంటుంది.
9గుర్రాల్లారా ఎగరండి,
రథాల్లారా రెచ్చిపోండి!
యోధులారా, డాళ్లు మోసే కూషు#46:9 అంటే, నైలు ఉపరితల ప్రాంతం వారలారా, పూతు వారలారా, బయలుదేరండి,
విల్లు విసిరే లిడియా పురుషులారా ముందుకు నడవండి.
10అయితే ఈ దినం సైన్యాల అధిపతియైన యెహోవాది;
తన శత్రువుల మీద పగతీర్చుకునే దినం.
ఖడ్గం తనకు తృప్తి కలిగే వరకు హతమారుస్తుంది,
తన రక్త దాహం తీరే వరకు హతమారుస్తుంది.
ఎందుకంటే యూఫ్రటీసు నది ప్రక్కన ఉత్తర దేశంలో
సైన్యాల అధిపతియైన యెహోవా బలి అర్పించబోతున్నారు.
11“కన్యయైన ఈజిప్టు కుమారీ,
గిలాదుకు వెళ్లి ఔషధతైలం తెచ్చుకో.
కానీ నీవు అనేక మందులు వాడడం వ్యర్థమే;
నీకు స్వస్థత కలుగదు.
12దేశాలు నీ అవమానం గురించి వింటాయి;
నీ కేకలు భూమంతటా వినబడతాయి.
యోధులు ఒకరికొకరు తగిలి తడబడి;
ఇద్దరూ కలిసి క్రిందకు పడిపోతారు.”
13ఈజిప్టుపై దాడి చేయడానికి బబులోను రాజైన నెబుకద్నెజరు రావడం గురించి యెహోవా యిర్మీయా ప్రవక్తతో చెప్పిన సందేశం ఇది:
14“ఈజిప్టులో ప్రకటన చేయండి, మిగ్దోలులో చాటించండి;
మెంఫిసులో, తహ్పన్హేసులో కూడా చాటించండి:
‘ఖడ్గం నీ చుట్టూ ఉన్నవారందరిని హతమారుస్తుంది,
కాబట్టి మీరు మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.’
15నీ బలవంతులు ఎందుకు దిగజారిపోతారు?
వారు నిలబడలేరు, ఎందుకంటే యెహోవా వారిని క్రిందికి నెట్టివేస్తారు.
16వారు పదే పదే తడబడతారు;
వారు ఒకరి మీద ఒకరు పడతారు.
వారు, ‘లేవండి, మనం
అణచివేసే వారి ఖడ్గానికి దూరంగా,
మన స్వదేశాలకు, మన సొంత ప్రజల దగ్గరికి తిరిగి వెళ్దాం’ అని చెప్తారు.
17అక్కడ వారు,
‘ఈజిప్టు రాజు ఫరో పెద్ద శబ్దం మాత్రమే;
అతడు తన అవకాశాన్ని కోల్పోయాడు’ అని గట్టిగా కేకలు వేస్తారు.
18“నా జీవం తోడు” అని రాజు ప్రకటిస్తున్నారు,
ఆయన పేరు సైన్యాల యెహోవా,
“పర్వతాల మధ్య తాబోరు లాంటివాడు,
సముద్రం ఒడ్డున ఉన్న కర్మెలు లాంటివాడు వస్తాడు.
19ఈజిప్టులో నివసించేవారలారా,
బందీలుగా వెళ్లడానికి మీ సామాన్లు సర్దుకోండి,
ఎందుకంటే మెంఫిసు పాడుచేయబడి,
నివాసులు లేక శిథిలమవుతుంది.
20“ఈజిప్టు అందమైన పాడి ఆవు,
అయితే దాని మీదికి ఉత్తరం నుండి
జోరీగ వస్తున్నది.
21దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు
బలిసిన దూడల వంటివారు.
వారు కూడా నిలబడలేక,
వెనక్కి పారిపోతారు.
విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది,
అది వారు శిక్షించబడే సమయము.
22శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు
పారిపోతున్న సర్పంలా ఈజిప్టు బుసలు కొడుతుంది.
చెట్లు నరికేవారు గొడ్డళ్లతో వచ్చినట్లు
వారు ఆమె మీదికి వస్తారు.
23ఆమె దట్టమైన అడవులను,
వారు నరికివేస్తారు” అని యెహోవా చెప్తున్నారు.
“వారి సంఖ్య మిడతల కంటే ఎక్కువ,
వారిని లెక్కించలేము.
24ఈజిప్టు కుమార్తె అవమానించబడుతుంది,
ఉత్తరాది ప్రజల చేతికి అప్పగించబడుతుంది.”
25ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేబేసులోని ఆమోను దేవున్ని, ఫరోను, ఈజిప్టును దాని దేవుళ్ళను, రాజులను, ఫరోను నమ్ముకున్న వారిని శిక్షించబోతున్నాను. 26వారిని చంపాలనుకున్న వారి చేతులకు అనగా బబులోను రాజైన నెబుకద్నెజరుకు అతని అధికారులకు నేను వారిని అప్పగిస్తాను. ఆ తర్వాత ఈజిప్టు గతంలో ఉన్నట్లే నివాసయోగ్యంగా ఉంటుంది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
27“నా సేవకుడైన యాకోబూ, భయపడకు;
ఇశ్రాయేలూ, కలవరపడకు.
నేను నిన్ను సుదూర ప్రాంతం నుండి తప్పకుండా రక్షిస్తాను,
నీ సంతతివారిని బందీలుగా ఉన్న దేశం నుండి రక్షిస్తాను.
యాకోబుకు మళ్ళీ శాంతి భద్రతలు కలుగుతాయి,
ఎవరూ అతన్ని భయపెట్టరు.
28నా సేవకుడైన యాకోబూ, భయపడకు,
నేను నీకు తోడుగా ఉన్నాను”
అని యెహోవా చెప్తున్నారు.
“నేను నిన్ను చెదరగొట్టే
దేశాలన్నిటిని పూర్తిగా నాశనం చేసినా,
నిన్ను పూర్తిగా నాశనం చేయను.
కాని నేను నిన్ను తగినంతగా శిక్షిస్తాను;
శిక్షించకుండ మాత్రం నిన్ను వదిలిపెట్టను.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 46: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.