యిర్మీయా 28

28
అబద్ధ ప్రవక్త హనన్యా
1అదే సంవత్సరం అంటే, యూదారాజు సిద్కియా ఏలుబడిలో నాల్గవ సంవత్సరం అయిదవ నెలలో, గిబియోనుకు చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకులు ప్రజలందరి సమక్షంలో నాతో ఇలా అన్నాడు, 2“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘నేను బబులోను రాజు కాడిని విరగ్గొడతాను. 3బబులోను రాజైన నెబుకద్నెజరు ఇక్కడినుండి బబులోనుకు తీసుకెళ్లిన యెహోవా మందిరంలోని పాత్రలన్నిటిని రెండు సంవత్సరాల లోపు తిరిగి తెప్పిస్తాను. 4నేను బబులోను రాజు కాడిని విరగ్గొట్టి, యూదా రాజును యెహోయాకీము కుమారుడునైన యెహోయాకీనును,#28:4 హెబ్రీలో యెకొన్యా యెహోయాకీను యొక్క మరో రూపం బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన యూదావారందరిని తిరిగి ఇక్కడకు రప్పిస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.”
5అప్పుడు యిర్మీయా ప్రవక్త యెహోవా మందిరంలో నిలబడి ఉన్న యాజకుల ముందు, ప్రజలందరి ముందు ప్రవక్తయైన హనన్యాకు జవాబిచ్చాడు. 6యిర్మీయా ఇలా అన్నాడు, “ఆమేన్! యెహోవా అలా చేయును గాక! బబులోను నుండి యెహోవా మందిరానికి సంబంధించిన వస్తువులను బందీలుగా తీసుకెళ్లిన వారందరిని తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి నీవు ప్రవచించిన మాటలను యెహోవా నెరవేరుస్తారు. 7అయితే, నీవు వింటుండగా, ఈ ప్రజలందరు వింటుండగా నేను చెప్పేది విను: 8నీకు నాకు ముందు ఉన్న ప్రవక్తలు చాలా దేశాలకు గొప్ప రాజ్యాలకు వ్యతిరేకంగా యుద్ధాలు, విపత్తు, తెగులు గురించి చాలా కాలం నుండి ప్రవచించారు. 9అయితే క్షేమం కలుగుతుందని ప్రవచించే ప్రవక్త తన అంచనా నిజమైతేనే యెహోవా పంపిన వ్యక్తిగా గుర్తించబడతాడు.”
10అప్పుడు ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని తీసి, దాన్ని విరిచి, 11ప్రజలందరి ముందు, “యెహోవా ఇలా అంటున్నారు: ‘రెండు సంవత్సరాల్లో అన్ని దేశాల మెడ మీద నుండి బబులోను రాజై నెబుకద్నెజరు కాడిని నేను అలాగే విరగ్గొడతాను.’ ” అది వినగానే యిర్మీయా ప్రవక్త అక్కడినుండి వెళ్లిపోయాడు.
12ప్రవక్తయైన హనన్యా యిర్మీయా ప్రవక్త మెడలోని కాడిని విరగ్గొట్టిన తర్వాత, యెహోవా వాక్కు యిర్మీయాకు ఇలా వచ్చింది: 13“నీవు, వెళ్లి హనన్యాతో ఇలా చెప్పు, ‘యెహోవా చెప్పేదేమిటంటే, నీవు చెక్క కాడి విరగ్గొట్టావు. కానీ దాని స్థానంలో నీవు ఇనుప కాడిని పొందుతావు. 14ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేసేలా ఈ దేశాలందరి మెడపై నేను ఇనుప కాడిని ఉంచుతాను. అడవి జంతువులపై కూడా నేను అతనికి అధికారం ఇస్తాను.’ ”
15అప్పుడు యిర్మీయా ప్రవక్త హనన్యా ప్రవక్తతో ఇలా అన్నాడు: “విను హనన్యా! యెహోవా నిన్ను పంపలేదు, అయినప్పటికీ నీ అబద్ధాలను ఈ ప్రజలు నమ్మేలా చేశావు. 16కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నిన్ను భూమి మీద నుండి తొలగించబోతున్నాను. మీరు ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు బోధించారు కాబట్టి ఈ సంవత్సరమే మీరు చనిపోతారు.’ ”
17అదే సంవత్సరం ఏడవ నెలలో హనన్యా ప్రవక్త చనిపోయాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 28: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి