యిర్మీయా 17

17
1“యూదా పాపం వారి హృదయ పలకలపై,
వారి బలిపీఠాల కొమ్ములపై,
ఇనుప పనిముట్టుతో చెక్కబడింది.
వజ్రపు మొనతో లిఖించబడింది.
2వారి పిల్లలు కూడా
మహా వృక్షాల ప్రక్కన ఎత్తైన కొండలమీద ఉన్న
తమ బలిపీఠాలను, అషేరా స్తంభాలను#17:2 అంటే, అషేరా దేవత యొక్క చెక్క చిహ్నాలు
జ్ఞాపకం చేసుకుంటారు.
3నీవు పాపం నీ దేశమంతటా ఉంది కాబట్టి
దేశంలోని నా కొండలను,
నీ#17:3 లేదా దేశంలోని పర్వతాలు ధనాన్ని, నీ సంపదను,
నీ క్షేత్రాలతో పాటు
దోపుడు సొమ్ముగా ఇస్తాను.
4నీవు చేసిన తప్పు వల్ల
నేను నీకు ఇచ్చిన వారసత్వాన్ని నీవు కోల్పోతావు.
నీకు తెలియని దేశంలో నిన్ను
నీ శత్రువులకు బానిసగా చేస్తాను,
నీవు నా కోపాన్ని రెచ్చగొట్టావు,
అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది.”
5యెహోవా ఇలా అంటున్నారు:
“మనుష్యుల మీద నమ్మకం పెట్టుకునేవారు,
కేవలం శరీర బలం మీద ఆధారపడేవారు,
యెహోవా నుండి తమ హృదయాన్ని త్రిప్పివేసుకునేవారు శాపగ్రస్తులు.
6వారు బంజరు భూములలో పొదలా ఉంటారు;
వృద్ధి కలిగినప్పుడు వారు దానిని చూడరు.
వారు ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో,
ఎవరూ నివసించని ఉప్పు భూమిలో నివసిస్తారు.
7“కాని యెహోవా మీద నమ్మకముంచేవారు ధన్యులు,
ఆయనయందు నమ్మకం ఉంచేవారు ధన్యులు.
8వారు నీళ్ల ప్రక్కన నాటిన చెట్టులా ఉంటారు
వాటి వేర్లు నీటి ప్రక్కన లోతుగా పాదుకుంటాయి.
కాబట్టి వేడి తగిలినా అవి భయపడవు;
వాటి ఆకులు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి.
కరువు వచ్చిన సంవత్సరంలో వాటికి చింత ఉండదు,
ఫలాలు ఇచ్చే విషయంలో ఎప్పుడూ విఫలం కావు.”
9హృదయం అన్నిటికంటే మోసకరమైనది
నయం చేయలేని వ్యాధి కలది.
దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
10“యెహోవానైన నేను హృదయాన్ని పరిశోధించి
మనస్సును పరీక్షించి,
ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి,
వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తాను.”
11అన్యాయంగా ధనాన్ని సంపాదించేవారు
పెట్టని గుడ్ల మీద పొదిగిన కౌజుపిట్టలాంటి వారు.
వారి జీవితం సగం ముగిసినప్పటికే సంపద వారిని వదిలివేస్తుంది,
చివరికి వారు మూర్ఖులు అని నిరూపించబడతారు.
12మన పరిశుద్ధాలయం,
ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము.
13యెహోవా, మీరే ఇశ్రాయేలీయుల నిరీక్షణ;
మిమ్మల్ని విడిచిపెట్టేవారందరూ అవమానానికి గురవుతారు.
మిమ్మల్ని విడిచిపెట్టినవారి గమ్యం నాశనమే,
ఎందుకంటే వారు జీవజలపు ఊటయైన
యెహోవాను విడిచిపెట్టారు.
14యెహోవా, నన్ను స్వస్థపరచండి, నేను స్వస్థపడతాను;
నన్ను రక్షించండి, నేను రక్షింపబడతాను,
నేను స్తుతించేది మిమ్మల్నే.
15వారు నాతో ఇలా అంటారు:
“యెహోవా మాట ఏమైంది?
అది ఇప్పుడు నెరవేరాలి!”
16నేను మీకు కాపరిగా ఉండకుండ పారిపోలేదు;
వారికి నిరాశ దినం రావాలని నేను కోరుకోలేదని మీకు తెలుసు.
నా పెదవుల నుండి బయటకు వచ్చే ప్రతీ మాట మీకు తెలుసు.
17నాకు భయాన్ని కలిగించకండి;
ఆపద దినాన మీరే నాకు ఆశ్రయము.
18నన్ను హింసించేవారు అవమానించబడాలి,
కాని అవమానపాలుకాకుండ నన్ను కాపాడండి.
వారికి భయభ్రాంతులు కలగాలి,
కాని నాకు భయభ్రాంతులు కలుగకుండా కాపాడండి.
వారి మీదికి నాశన దినాన్ని రప్పించండి;
రెట్టింపు విధ్వంసంతో వారిని నాశనం చేయండి.
సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడం
19యెహోవా నాతో ఇలా అన్నారు: “నీవు వెళ్లి యూదా రాజులు వెళ్లే ప్రజల#17:19 లేదా సైన్యం ద్వారం దగ్గర నిలబడు. యెరూషలేము యొక్క అన్ని ఇతర ద్వారాల దగ్గర కూడా నిలబడు. 20నీవు వారితో, ‘ఈ ద్వారాల గుండా వచ్చే యూదా రాజులారా, సర్వ యూదా ప్రజలారా, యెరూషలేములో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ యెహోవా మాట వినండి. 21యెహోవా ఇలా అంటున్నారు: సబ్బాతు దినాన ఏ బరువులు మోయకుండా, వాటిని యెరూషలేము ద్వారాల గుండా తీసుకురాకుండా జాగ్రత్తపడండి. 22సబ్బాతు దినాన మీ ఇళ్ళ నుండి బరువులు తేకండి, ఏ పని చేయకండి, అయితే నేను మీ పూర్వికులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలి. 23కాని వారు వినలేదు, పట్టించుకోలేదు; వారు మొండి వారై నా మాటలు వినలేదు, క్రమశిక్షణకు ప్రతిస్పందించలేదు. 24అయితే యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, మీరు నా మాటకు విధేయత చూపుతూ, సబ్బాతు దినాన ఈ పట్టణపు ద్వారాల గుండా ఎలాంటి బరువులు తీసుకురాకుండా, ఏ పని చేయకుండా సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తే, 25దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజులు తమ అధికారులతో కలిసి ఈ నగర ద్వారాల గుండా వస్తారు. వారు, వారి అధికారులు రథాల మీద, గుర్రాల మీద స్వారీ చేస్తూ, యూదా వారితో, యెరూషలేము నివాసులతో కలిసి వస్తారు, ఈ పట్టణం శాశ్వతంగా ఉంటుంది. 26యూదా పట్టణాల నుండి, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల నుండి, బెన్యామీను ప్రాంతం నుండి, పడమటి కొండ దిగువ ప్రదేశాల నుండి, కొండ ప్రదేశాల నుండి, దక్షిణ వైపు నుండి ప్రజలు దహనబలులను, బలులను, భోజనార్పణలను, ధూపద్రవ్యాలను, కృతజ్ఞతార్పణలను యెహోవా ఆలయానికి తీసుకువస్తారు. 27అయితే మీరు సబ్బాతు దినాన యెరూషలేము గుమ్మాల గుండా వస్తున్నప్పుడు ఎలాంటి బరువును మోస్తూ రాకుండ సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించడంలో మీరు నాకు విధేయత చూపితే సరి, లేకపోతే నేను యెరూషలేము గుమ్మాల్లో ఆర్పలేని అగ్నిని రప్పిస్తాను, అది దాని భవనాలను దహించివేస్తుంది.’ ”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యిర్మీయా 17: TSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి