న్యాయాధిపతులు 15
15
ఫిలిష్తీయుల మీద సంసోను ప్రతీకారం
1కొంతకాలం తర్వాత, గోధుమ పంట కోతకాలంలో, సంసోను ఒక మేకపిల్లను తీసుకుని భార్యను చూడడానికి వెళ్లాడు. “నా భార్యను చూడడానికి తన గదిలోకి వెళ్తాను” అని అతడు అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతన్ని లోపలికి వెళ్లనివ్వలేదు.
2ఆమె తండ్రి, “నీకు ఆమె అస్సలు ఇష్టం లేదు అనుకుని ఆమెను నీ స్నేహితునికి ఇచ్చాను. ఆమె చెల్లెలు ఆమెకంటే అందంగా ఉంటుంది ఆమెను చేసుకో” అని అన్నాడు.
3అప్పుడు సంసోను, “నేను ఇప్పుడు ఫిలిష్తీయులకు ఏదైనా కీడు చేసినా నిర్దోషినే” అని, 4సంసోను బయటకు వెళ్లి మూడువందల నక్కలను పట్టుకుని, రెండేసి నక్కల తోకలను ఒకదానికొకటి ముడివేసి ఆ రెండు తోకల మధ్య ఒక దివిటీని కట్టి, 5ఆ దివిటీలను వెలిగించి ఫిలిష్తీయుల గోధుమ పంట చేలల్లోకి ఆ నక్కలను వదిలాడు. ఇలా అతడు పనల కుప్పలను పైరును ద్రాక్ష ఒలీవ తోటలను తగలబెట్టాడు.
6ఫిలిష్తీయులు, “ఇలా ఎవరు చేశారు?” అని అడిగినప్పుడు, “తిమ్నా అల్లుడైన సంసోను; తన భార్యను తన స్నేహితునికి ఇచ్చినందుకు అలా చేశాడు” అని చెప్పారు.
అందుకు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెను, ఆమె తండ్రిని కాల్చి చంపారు. 7అప్పుడు సంసోను వారితో, “మీరిలా చేశారు కాబట్టి మీమీద పగతీర్చుకునే వరకు నేను ఊరుకోను” అంటూ, 8అతడు వారిపై దాడి చేసి తొడలనూ తుంటి ఎముకలను విరగ్గొట్టి వారిలో చాలామందిని చంపేశాడు. తర్వాత అతడు వెళ్లి, ఏతాము బండ సందులో నివసించాడు.
9అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా ప్రదేశంలో దిగి సైన్య శిబిరాన్ని లేహి వరకు ఏర్పరచుకున్నారు. 10యూదా ప్రజలు వారిని, “మీరెందుకు మా మీదికి వచ్చారు?” అని అడిగారు.
అందుకు వారు, “మేము సంసోను మాకెలా చేశాడో మేము కూడ అతనికి అలాగే చేయడానికి వచ్చాం, మేము అతన్ని బంధించి తీసుకెళ్లడానికి వచ్చాం” అని జవాబిచ్చారు.
11అప్పుడు యూదా నుండి మూడువేలమంది పురుషులు ఏతాము బండలో ఉన్న గుహలోకి దిగి, సంసోనుతో, “ఫిలిష్తీయులు మనలను పరిపాలిస్తున్నారని నీకు తెలియదా? మా మీదికి ఇంత ప్రమాదాన్ని ఎందుకు తెచ్చిపెట్టావు?” అని అన్నాడు.
అతడు వారితో, “వారు నాకు ఏమి చేశారో నేను వారికి అదే చేశాను!” అన్నాడు.
12అందుకు వారు అతనితో, “సరే, నిన్ను బంధించి ఫిలిష్తీయులకు అప్పగించడానికి మేము వచ్చాం” అన్నాడు.
అందుకు సంసోను, “మీరు మాత్రం నన్ను చంపరని నాకు ప్రమాణం చేయండి” అని వారితో అన్నాడు.
13“సరే, మేము కేవలం నిన్ను బంధించి వారికి అప్పగిస్తాం మేము నిన్ను చంపము” అని వారు జవాబిచ్చారు. అలా వారు అతన్ని రెండు క్రొత్త త్రాళ్లతో బంధించి బండ దగ్గర నుండి తీసుకువచ్చారు. 14అతడు లేహిని సమీపించినప్పుడు, ఫిలిష్తీయులు కేకలువేస్తూ అతని దగ్గరకు వచ్చారు. యెహోవా ఆత్మ బలంగా అతని మీదికి రాగా అతని చేతులకున్న త్రాళ్లు కాలిపోయిన నారపీచులై అతని చేతుల నుండి తెగిపడిపోయాయి. 15అక్కడే అతనికి గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి దొరికింది. అతడు దాన్ని చేతపట్టుకుని దానితో వేయిమందిని చంపేశాడు.
16అప్పుడు సంసోను,
“గాడిద దవడ ఎముకతో
ఒక కుప్పను, రెండు కుప్పలను చంపాను.
గాడిద దవడ ఎముకతో
వేయిమందిని చంపాను”
అని, 17అతడు మాట్లాడడం ముగించిన తర్వాత, ఆ దవడ ఎముకను పారవేశాడు; ఆ స్థలం రామత్ లేహి#15:17 రామత్ లేహి అంటే దవడ ఎముక కొండ అని పిలువబడింది.
18అతనికి బాగా దాహం వేయడంతో యెహోవాకు మొరపెట్టి, “మీ సేవకుడనైన నాకు ఈ గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను దాహంతో చచ్చి సున్నతిలేనివారి చేతుల్లో పడాలా?” అన్నాడు. 19అప్పుడు దేవుడు లేహిలో ఉన్న ఒక బోలు స్థలం తెరవగా దానిలో నుండి నీళ్లు వచ్చాయి. సంసోను నీరు త్రాగగానే అతనికి బలం తిరిగివచ్చి అతని ప్రాణం తెప్పరిల్లింది. కాబట్టి ఆ ఊట ఎన్-హక్కోరె#15:19 ఎన్-హక్కోరె అంటే పిలిచేవారి బుగ్గ అని పిలువబడింది. అది ఇప్పటికి లేహిలో ఉంది.
20ఫిలిష్తీయుల రోజుల్లో సంసోను ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
న్యాయాధిపతులు 15: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.